ప్రజాస్వామ్యానికి ఓటే పునాది

– మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ ఆదర్శ్‌ సురభి
నవతెలంగాణ-ఖమ్మం
ప్రజాస్వామ్యానికి ఓటే పునాది అని, ఓటు అనే రెండు అక్షరాల పదం దేశ భవిష్యత్తును మార్చేస్తుందని ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ ఆదర్శ్‌ సురభి అన్నారు. శనివారం నూతన కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అన్ని శాఖల ఉద్యోగులకు ఓటు హక్కు, సి విజిల్‌ యాప్‌పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు తమ ఓటు ఏ పోలింగ్‌ కేంద్రంలో ఉన్నది, సీరియల్‌ నెంబర్‌, పార్ట్‌ నెంబర్లపై అవగాహన కల్పించారు. ఓటర్లు ప్రతిఒక్కరు తమ ఓటు గురించి అవగాహన కల్గివుండాలని తెలిపారు. స్వేచ్ఛ, న్యాయబద్ద ఎన్నికల నిర్వహణకు ప్రతిఒక్కరు తమ వంతు కృషి చేయాలన్నారు. సి విజిల్‌ యాప్‌ను డౌన్లోడ్‌ చేసుకోవాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు దృష్టికి వస్తే, వెంటనే సి విజిల్‌ యాప్‌ ద్వారా సమాచారం అందించాలని చెప్పారు. సి విజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేస్తే, ఫిర్యాదుదారు వివరాలు గోప్యంగా ఉంచవచ్చని పేర్కొన్నారు. డబ్బు, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, నైతికతతో ఓటు వేసేలా చైతన్యం తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్వీప్‌ నోడల్‌ అధికారి జిల్లా ఉపాధి కల్పన అధికారి కే. శ్రీరామ్‌, జిల్లా గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, జిల్లా నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు అఫ్జల్‌ హసన్‌, వివిధ శాఖల ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love