– ధరణి స్థానంలో భూమాత పోర్టల్
– బడ్జెట్ సమావేశాల్లో రెవెన్యూ పునరుద్ధరణ బిల్లు!
– కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో మళ్లీ వీఆర్వో, వీఆర్‌ఏ వ్యవస్థ్థలు జీవం పోసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం భారీ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వానికి, గ్రామాలకు మధ్య వారధిగా పనిచేస్తూ వచ్చిన గ్రామ రెవెన్యూ వ్యవస్థ మళ్లీ పునరుద్ధ్దరించడం తప్ప మరో మార్గం లేదనే ఆలోచనలోనున్నట్టు సమాచారం. గత సర్కార్ తీసుకొచ్చిన ధరణిలో మార్పులు చేసి భూమాత పోర్టల్‌ను అందుబాటులోకి తేనున్నారు. త్వరలో వీటికి సంబంధించి విధాన పరమైన నిర్ణయం వెలువడే అవకాశముంది.
గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను గతంలో కంటే మరింత పటిష్టంగా తయారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకొనున్నది. ఈ మేరకు రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సర్కార్ త్వరలో విధాన పరమైన నిర్ణయం తీసుకోనుంది. గ్రామాల్లో తిష్టవేసిన ఎన్నో సమస్యలు ఆరేండ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. భూసమస్యల పరిష్కారాలు, ప్రకతి వైపరీత్యాలు, ధాన్యం కొనుగోళ్లు, సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక, ఎన్నికల విధులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ, కుల, ఇన్‌కం, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు మొదలగు దాదాపు 20కి పైగా సమస్యలు, విఆర్వో బాధ్యతలకు సంబంధించినవే కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి ఎన్నో సమస్యలు వచ్చాయనీ, వాటన్నింటినీ దష్టిలో ఉంచుకొని రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ జరిగి తీరాలని ఆయన చాలా పట్టుదలగా ఉన్నట్టు సమాచారం.
మార్పులు, చేర్పులపై కసరత్తు
గతంలో ఉన్న గ్రామ రెవెన్యూ ఆఫీసర్ (వీఆర్వో), విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్‌ఎ) పోస్టులను యథావిధిగా ప్రవేశపెడతారా? లేక రెండు రకాల పోస్టులను కలిపి ఒకే పోస్టుగా సర్దుబాటు చేసి విలేజ్ రెవెన్యూ సెక్రటరీ (వీఆర్‌ఎస్) అనే పోస్టును సృష్టించి నియామకాలు చేస్తారా? అనే అంశాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్ష తర్వాత విధానపరమైన తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వానికి, గ్రామాలకు మధ్య వారధిగా ఉన్న ఈ వ్యవస్థ లేక పోవడం వల్ల సర్కారుకు, ప్రజలకు మధ్య క్రమంగా దూరం పెరుగుతూ వస్తొంది. ఈనేపథ్యంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పాత రెవెన్యూ వ్యవస్థవైపు అడుగులు వేస్తోందని సమాచారం.
”భూమాత”గా ధరణి
గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ధరణి పోర్టల్ భూమాతగా మారనుంది. ఈ పోర్టల్‌లో ఉన్న లొసుగులను సరిదిద్దేందుకు సీసీఎల్‌ఏ కమిషనర్ కన్వీనర్‌గా పలువురు భూ నిపుణులతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ధరణి కమిటీని ఏర్పాటు చేసింది. మూడు దఫాలు సమావేశమైన ఈ కమిటీ ఇప్పటికే ఆ పోర్టల్‌లో ఉన్న అనేక లొసుగుల పరిష్కారంపై ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇందులో మార్పులు చేసి ధరణి స్థానంలో భూమాతను తీసుకురానున్నారు. పాత రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణతో పాటు దీనిని కూడా అందుబాటులోకి తేనున్నట్టు తెలుస్తోంది.