తెలంగాణలోని 8 జిల్లాలకు హెచ్చరిక

నవతెలంగాణ – హైదరాబాద్
తెలంగాణలో వర్షాలు కురవడంతో నెమ్మదిగా వాతావరణం మెల్లగా చల్లబడుతోంది. అయితే రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉత్తర తెలంగాణలోని 8 జిల్లాలకు వాతావరణశాఖ అతి భారీ వర్షసూచన జారీ చేసింది. శని, ఆదివారాల్లో కురిసే ప్రాంతాలకు హెచ్చరికలను జారీ చేసింది. నేడు ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 115.6 – 204.4 మి.మీ.ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్లు పేర్కొంది. మరో ఏడు జిల్లాల్లో 64.5 – 115.5 మి.మీ.ల మధ్య వర్షాలు కురుస్తాయని సూచించింది. ఈ జిల్లాల్లో విపత్తు స్పందన దళాలు అప్రమత్తం కావాలని ఐఎండీ సూచించింది. నైరుతి రుతుపవనాలు శుక్రవారం నాటికి నిజామాబాద్‌ జిల్లాలో కొంత భాగం వరకు విస్తరించాయి. కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్‌, వికారాబాద్‌ జిల్లాలతోపాటు ఆదిలాబాద్‌ జిల్లాలో కొంత భాగం వ్యాపించాల్సి ఉంది. ఆదివారం నాటికి రాష్ట్రమంతటా విస్తరిస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.

Spread the love