– మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసి పంట పొలాలను కాపాడాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శనివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎడమ కాల్వ పరిధి ఆయకట్టులో బోర్లు బావులు, చెరువుల కింద 30శాతం వరి పంట సాగు చేశారన్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో చేతికొచ్చిన పంట ఎండిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పంటపొలాలను కాపాడేందుకు ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయాలని కోరారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో 524 అడుగుల నీటిమట్టం ఉందని, అందులో 15 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశ ఉంటుందని చెప్పారు. కర్నాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటం వల్ల అక్కడి ప్రభుత్వంతో మన ప్రభుత్వం చర్చలు జరిపి ఆల్మట్టి ద్వారా నీటిని తెప్పించుకోవాలన్నారు. సాగర్ ఎడమ కాల్వకు విడుదల చేసి చెరువులు, కుంటలు నింపి భూగర్భ జలాలు పెంపొందించా లన్నారు. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి నీటిని విడుదల చేసి పంట పొలాలను కాపాడాలన్నారు. అలా చేస్తే భవిష్యత్‌లో తాగునీటి సమస్య కూడా ఉండదని చెప్పారు. నీటి విడుదలపై ప్రభుత్వ స్పందించకపోతే రైతులను సమీకరించి పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరపల్లి వెంకటేశ్వర్లు, నాయకులు రవినాయక్, డాక్టర్ మల్లు గౌతమ్‌రెడ్డి, రాగిరెడ్డి మంగారెడ్డి, తిరుపతి రామ్మూర్తి, ఎండి అంజాద్ తదితరులు ఉన్నారు.