నీరు

నీరు‘ఇంకిన అడుగంటిన / చెలిమల దుఃఖాలు
తడిలేని పొడిపొడి / తనువుల తత్వాలు
నీటి యుద్ధాలు, కన్నీటి సంద్రాలు’ అంటూ నీరు గురించిన వేదనను వినిపించాడు కవి. మనిషి నీటి జీవి. కన్నీటి జీవి కూడా. మనిషే కాదు, ఈ భూమిపైనున్న జీవులన్నీ నీటిపై ఆధారపడేవే. నీరే లేకపోతే ఈ నేలపై పచ్చదనమే లేదు. జీవిరూపమే లేదు. నీరే మన ఆధారం. కన్నీళ్లు, మానవీయ మనోధారం. ఈ రెండింటికీ కరువొ చ్చింది నేడు. జీవనాధారమైన నీటి కోసం మనిషి నిరంతరం సంఘర్షి స్తూనే ఉన్నాడు. నీటి కోసం యుద్ధాలనూ చేస్తున్నాడు. అంతేకాదు యుద్ధాలకు నీటినీ ఉపయోగిస్తున్నాడు. నీటి బాధలు ఎప్పటి నుండో మనను వెంటాడుతూనే ఉన్నాయి. వేసవి కాలమొచ్చిందంటే అది మరింత పెరుగుతుంది. దాహం, దాహం అంటూ ఊళ్లకు ఊళ్లు నీటికోసం పోరాటం చేస్తుంటాయి. మిషన్‌ భగీరథలు, ఇంటింటికీ మంచినీళ్ల కుళాయిలు అంటూ ఎన్ని పథకాలు అమలుచేస్తున్నా నీటి కొరత మాత్రం తీరటంలేదు. వాస్తవానికి ఈ భూమిలో నీటి జల ఇగిరిపోవటం అసలు సమస్యగా వున్నది. నదుల సజీవత, స్వచ్ఛత కోల్పోవడమూ ప్రధాన సమస్య.
ప్రజల వేసవి తాగునీటి సమస్యను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించటము, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మాత్రమే చేయగలుగుతాము. భూగర్భ జలాలను రక్షించుకోవటం, వాననీటి సంరక్షణ కోసం సరైన వ్యవస్థను నెలకొల్పటం చాలా ముఖ్యమైన విషయాలు. అందుకే ఇటీవల మన హైకోర్టు ప్రభుత్వాన్ని నీటి సంరక్షణ విషయమై హెచ్చరించింది కూడా. వాన నీటి సంరక్షక వ్యవస్థలపట్ల నిర్లక్ష్యంవహిస్తే, బెంగళూరులో నెలకొన్నటువంటి తాగునీటి ఎద్దడి పరిస్థితులు హైద్రాబాద్‌లోనూ నెలకొనే ప్రమాదం ఉందని కోర్టు చెప్పింది. నిబంధనల ప్రకారం ఇంకుడు గుంటలులేని నిర్మాణాలను గుర్తించాలనీ, తెలంగాణ జల, భూ, వృక్ష చట్టం అమలుచేయాలని కూడా ఆదేశించింది. ప్రకృతిని విధ్వంసమొనర్చడమే జరుగుతోంది తప్ప, రక్షించుకోవాలనే ధ్యాసే కరువైంది. వ్యాపార లాభాల కోసం కొండలను, గుట్టలను అన్నింటినీ తవ్వేసి సొమ్ము చేసుకుంటున్నారు. చెరువులను, వాగులను, తమ వ్యాపార లాభాల కోసం రియలెస్టేట్‌ భూమిగా మార్చేస్తున్నారు. అమ్మేస్తున్నారు. అక్రమమైనింగ్‌లు, క్వారీల తవ్వకాలు, చెట్ల నరికివేత, అడవుల విధ్వంసం యధేచ్ఛగా సాగుతుంటే, ఇంకెక్కడి జలసంపద! భూగర్భ జలాలన్నీ అడుగంటిపోతున్నాయి.
ప్రకృతి సిద్ధంగా దొరికే నీటిని సంరక్షించుకోవటం, నీటి వాడకంలో వృథాను అరికట్టటం, ఈ రెండూ ముఖ్యమైన అంశాలు. పెద్ద పెద్ద నగరాల్లో, పట్టణాల్లో నివసించే ప్రజలు నీటి ప్రాముఖ్యతను గుర్తించరు. నీటిని వృథా చేసేముందు ఆలోచించరు కూడా. ఇండ్లలో కూడా కుళాయి తెరిచి వృథా చేస్తారు. అదే సందర్భంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు నీటి కోసం కిలో మీటర్ల దూరం నడచి వెళుతుంటారు. ఎండాకాలంలో అయితే పిల్లలు పాఠశాలలకు వెళ్లరు. బదులుగా బావులు, వాగుల వద్ద నీటిని తెచ్చేందుకు వెళుతుంటారు. ఇది మనుగడ ప్రశ్న. దేశంలో మంచినీళ్లు దొరకక ఎన్నో అనారోగ్యాలకు ప్రజలు గురవుతున్నారు. నీటిని మనం ఉత్పత్తి చేయలేము. కానీ వృథా చేస్తాము. ఇదొక చైతన్యలేమి సమస్య. ప్రతిరోజూ ఒక కుళాయి నుండి ఒక చుక్క నీటిని నిరంతరం వదిలితే, మొత్తం సంవత్సరంలో లక్ష లీటర్ల నీరు వృథా అవుతుంది. ఒక జత జీన్స్‌ తయారీకి 11000 లీటర్ల నీరు ఉపయోగిస్తారు. ఇక పరిశ్రమల్లో ఒక కారు తయారుకు దాదాపు 39090 గ్యాలన్ల నీరు అవసరమవు తోంది. భూమిలో 70శాతం నీటితో కప్పబడి వున్నప్పటికీ, అది గ్రహం బరువులో 0.025 శాతమే. నీటిని కలిగున్నందుననే భూమిని ‘బ్లూ ప్లానెట్‌’ అంటారు. భూమి మొత్తం నీటిలో 2.5శాతం మాత్రమే మంచి నీటిని కలిగియుంది. అయితే మనం దానిలో ఒక శాతం మాత్రమే ఉపయోగించగలము.
జనాభా పెరుగుదల, పరిశ్రమల కారణంగా నీటి అవసరం పెరిగింది. దేశంలోని నదులు కాలుష్యం బారిన పడటం వలన నీటి కొరత ఏర్పడుతోంది. వర్షపు నీరును భూమి ఇముడ్చుకొనే శక్తిని కోల్పోతున్నది. ఆ నీటిని నిలువ ఉంచే ఏర్పాట్లనూ మనం చేయలేకపో తున్నాము. కారణంగా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఎన్ని బోర్లు వేసినా నీటి లభ్యత కరువై అనేకమంది రైతులు నష్టాలపాలు, కన్నీళ్లపాలు అవుతున్నారు. పట్టణీకరణ నేటి మానవాళికి ప్రమాదంగా మారిందని, అధికోత్పత్తి పేర ప్రకృతి విధ్వంసమూ పెరిగిందని పర్యావరణవేత్తలు, మేధావులు విశ్లేషిస్తున్నారు. మానవ తప్పిదాలే ప్రకృతి వైపరిత్యాల రూపంలో మనుగడను ప్రమాదంలో పడేస్తున్నాయని అంటున్నారు. తాత్కాలిక ప్రయోజనాలనే కాకుండా, రేపటితరం కోసం, శాశ్వత ప్రయోజనాల కోసం ప్రకృతి సిద్ధ వనరులను కాపాడుకోవలసి ఉంది. అందులో నీరు అత్యంత ముఖ్యమైనది. మన దాహాలు తీరాలి, నీటి జల ఊరాలి! నీటి సంరక్షణకు ప్రభుత పూనుకోవాలి!

Spread the love