– వెంటనే పంటల కొనుగోళ్లు చేపట్టకపోతే ఆందోళనలు: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
– వ్యవసాయ మార్కెట్, కొనుగోలు కేంద్రం పరిశీలన
నవతెలంగాణ-నర్సంపేట/గీసుకొండ
ధాన్యం ఆఖరి గింజ కొనే వరకు ప్రభుత్వాన్ని వెంటాడుతామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట వ్యవసాయ మార్కెట్‌ను, పరకాల నియోజకవర్గంలోని గీసుగొండ మండలం ఊకల్ సొసైటీలోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించి రైతులతో మాట్లాడారు. నెల రోజులుగా మక్కలను తీసుకొచ్చి మార్కెట్లో పడిగాపు కాస్తున్నామని రైతులు కేటీఆర్‌కు చెప్పారు. మార్కెట్లో పంట కొనుగోలు తీరుపై కేటీఆర్ ఆరా తీశారు. అనంతరం కేటీఆర్ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా మొక్కజొన్నలను ప్రభుత్వం కొనుగోలు చేయడంలో విఫలమైందన్నారు. నాడు కేసీఆర్ ప్రభుత్వం 27వేల కొనుగోలు కేంద్రాల ద్వారా పంటను ఎప్పటికప్పుడూ కాంటా వేసి రైతులకు అండగా నిలిచిందని చెప్పారు. ధాన్యం కొనుగోలు కూడా రికార్డ్ స్థాయిలో నాడు సివిల్ సప్లై ద్వారా కొనుగోలు చేశామన్నారు. నేడు రైతులు కష్టపడి పండించిన మక్కలు ఎక్కడికక్కడా కల్లాల్లోనే ఉన్నాయని తెలిపారు. దీనికి దిగుబడికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేకపోవడమే కారణమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి రియల్‌ఎస్టేట్ మీద ఉన్న ధ్యాస పాలనపై లేకుండా పోయిందని విమర్శించారు.
అకాల వర్షాల నేపథ్యంలో మొక్కజొన్న, ధాన్యం పండించిన రైతులు తీవ్ర భయాందోళనలతో ఉన్నారని అన్నారు. అలాగే, దళారులతో కుమ్మక్కై కొనుగోళ్లు ఆలస్యం చేస్తూ రైతులను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే ధాన్యం, శనగలు, మొక్కజొన్న తదితర పంటల కొనుగోళ్లు ప్రారంభించకపోతే ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. సివిల్ సప్లై కార్పొరేషన్‌లో జరిగిన రూ.లక్ష కోట్లకుపైగా కుంభకోణంపై ఆధారాలతో సహా సీబీఐ, ఈడీ దర్యాప్తు సంస్థలకు బీఆర్‌ఎస్ ఫిర్యాదు చేసిందని అన్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించకుండా ఎందుకు వెనుకడుగు వేస్తోందని ప్రశ్నించారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీ కవిత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మెన్ చింతం సదానందం, మాజీ జెడ్పీటీసీ పోలీస్ ధర్మారావు, మాజీ ఎంపీపీ ముంత కళావతి రాజయ్యయాదవ్ ఉన్నారు.
ధాన్యం మొత్తం కొనే వరకు వెంటబడుతాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



