చాలా చేశాం..

– మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి
– విభజన చట్టం అమలుపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రారు
న్యూఢిల్లీ : విభజన చట్టంలోని చాలా అంశాలు అమలు చేశామనీ, మిగిలిన అంశాలు వివిధ దశల్లో ఉన్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రారు తెలిపారు. లోక్‌సభలో టీడీపీ ఎంపీలు కేశినేని నాని, కె. రామ్మోహన్‌ నాయుడు వేర్వేరుగా అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారు. ”విభజన చట్టంలోని చాలా అంశాలు అమలు చేయడం జరిగిందనీ, మిగిలిన అంశాలు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. ప్రత్యేక రైల్వే జోన్‌కు సౌత్‌కోస్ట్‌ రైల్వేజోన్‌ హెడ్‌ క్వార్టర్స్‌ ఏర్పాటుకు 2022 నవంబర్‌ 10న రూ.106.89 కోట్లతో మంజూరు చేయడం జరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.10 కోట్లను విడుదల చేయడం జరిగింది. సమీప ప్రాంతాల్లో ఉన్న పోర్టులు నుండి గట్టి పోటీ ఉండటంతో దుగ్గరాజుపట్నంలో ప్రధాన ఓడరేవు ఏర్పాటు సాధ్యం కాలేదు. ‘రెండు రాష్ట్రాల మధ్య విభజన చట్టంలోని పెండింగ్‌ అంశాలు పరిష్కారం కోసం సమయానుకూలంగా హోం శాఖ సమీక్షిస్తున్నది. పెండింగ్‌ అంశాలను రెండు రాష్ట్రాలు పరస్పర సహకారంతోనే ద్వైపాక్షిక అంశాలు పరిష్కారం అవుతాయి. వివాదాలు ఉన్న సమస్యల ఆమోదయోగ పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం కేవలం మధ్యవర్తిగా వ్యవహరిస్తుంది’ అన్నారు.

Spread the love