మేడిగడ్డపై తప్పనిసరిగా విచారిస్తాం

మేడిగడ్డపై తప్పనిసరిగా విచారిస్తాం– బాధ్యులను శిక్షిస్తాం
– అసెంబ్లీ ఆర్థిక శ్వేతపత్రంపై చర్చలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
– వందరోజులు ఆగలేరా ? :బీజేపీకి శ్రీధర్‌బాబు, పొన్నం చురకలు
– రాష్ట్రాన్ని బద్నాం చేయకండి: అక్భరుద్ధీన్‌
– హామీలు నెరవేర్చాల్సిందే: మహేశ్వర్‌రెడ్డి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీ పగుళ్లపై తప్పకుండా విచారణ చేస్తామని రాష్ట్ర భారీనీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. బాధ్యులకు తప్పకుండా శిక్షపడుతుందని చెప్పారు. లక్ష కోట్లు ఖర్చుపెట్టి సృష్టించింది కొత్త ఆయకట్టు కేవలం లక్ష ఎకరాలేనా ? ఇది ఏమైనా న్యాయబద్దంగా ఉందా ? అందుకే బాధ్యులపై తప్పకుండా విచారణ జరుగుతుందని స్పష్టం చేశారు. పాలమూరు-రంగారెడ్డిలో రూ. 25 వేల కోట్లు వ్యయం చేసినా కొత్త ఆయకట్టును సృష్టించలేదన్నారు. అలాగే సీతారామ ప్రాజెక్టు పరిస్థితీ అంతేనని వ్యాఖ్యానించారు. బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక పరిస్థితుల శ్వేతపత్రంపై చర్చలో భాగంగా మంత్రి ఉత్తమ్‌ జోక్యం చేసుకుంటూ పౌరసరఫరాల శాఖ సైతం రూ. 56 వేల కోట్ల అప్పుల్లో ఉందనీ, కార్పొరేషన్‌ని కేవలం ధాన్యం కొనుగోలుకే పరిమితం చేశారని అన్నారు. సబ్సీడి బియ్యం ఇవ్వకపోవడమే అప్పులకు కారణమని చెప్పారు. రూ.11,500 కోట్ల నష్టాలు సైతం ఉన్నాయని వివరించారు. అప్పులకు రూ. 3000 కోట్లను వడ్డీ కట్టాల్సి వస్తున్నదన్నారు. రూ.22 వేల కోట్ల ధాన్యాన్ని రైస్‌మిల్లర్ల దగ్గర ఎలాంటి భద్రతా లేకుండా ఉంచారని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ చర్చలో పాల్గొన్నారు. ఒకానొక సమయంలో చర్చలోకి సీఎం రేవంత్‌రెడ్డి సైతం వచ్చారు. శ్వేతపత్రంపై మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను విమర్శించారు. అలవికాని అప్పులు చేశారని చెప్పారు. అప్పులకు వడ్డీలు కట్టడానికి మళ్లీ అప్పులు చేశారని చెప్పారు. అప్పులు రూ. 72 వేల కోట్ల నుంచి రూ. 6.71 లక్షల కోట్లకు చేరాయని అన్నారు. ప్రపంచబ్యాంకు నుంచేగాక వాణిజ్య బ్యాంకుల నుంచీ కూడా తెచ్చారని చెప్పారు. రాష్ట్ర ప్రజలమీద పెద్దభారం మోపారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకోకుండా అభాండాలు వేయడం సరికాదన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అన్నారు. అనంతరం అక్భరుద్ధీన్‌ ఒవైసీ మాట్లాడుతూ శ్వేతపత్రం పేరుతో తెలంగాణపై చెడ్డ ప్రభావం పడేలా చేయకూడదని అన్నారు. ఆర్‌బీఐ లెక్కలు నమ్మాలా ? రాష్ట్ర బడ్జెట్‌ లెక్కలను నమ్మాలా ? కాగ్‌ లెక్కలను నమ్మాలా ? అని ప్రశ్నించారు. అధికారులు తప్పుడు లెక్కలు ఇచ్చారని గుర్తు చేశారు. వారిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రం అభివృద్ధికోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అన్ని మతాలకు న్యాయం జరిగేలా పరిపాలన ఉండాలని అభిప్రాయపడ్డారు. ఈసందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి స్పందిస్తూ కర్నాటకకు సంబంధించి ఆ రాష్ట్ర బడ్జెట్‌ లెక్కలను మాత్రమే పత్రంలో పేర్కొన్నట్టు చెప్పారు. అంతకుముందు అక్భరుద్ధీన్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి శ్రీధర్‌బాబు సమాధానమిస్తూ రాష్ట్రం పరువు తీయడానికి తాము శ్వేతపత్రం ప్రకటించలేదన్నారు. గత పదేండ్ల ప్రొగ్రెస్‌ రిపోర్టు మాత్రమే ఇచ్చామని అన్నారు. అప్పులు చేయడం ప్రభుత్వాలకు సాధారణమేననీ, కాని తెచ్చిన అప్పులను ఎలా ఖర్చుపెట్టామనేది ముఖ్యమని వ్యాఖ్యానించారు. సభ్యులకు నిబంధనల మేరకే సమయాన్ని కేటాయిస్తున్నామన్నారు. చర్చలోకి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ మాట్లాడుతూ కచ్చితంగా వందరోజుల్లో ఆరు గ్యారంటీలను అమలుచేస్తామని అన్నారు. కేంద్రంలోని బీజేపీ విదేశాల నుంచి నల్లధనాన్ని తెచ్చి ప్రజల ఖాతాల్లో రూ. 15 లక్షలు వేసిందా ? అని ప్రశ్నించారు. ప్రజాసమస్యలపైప్రశ్నిస్తే ఎంపీలను సస్పెండ్‌ చేసిందనీ, ప్రజాస్వామ్యం ఎక్కడుందని అన్నారు. పదేండ్ల కాలంలో పరిస్థితి దిగజారిందని చెప్పారు. సిలిండర్‌ బరువును బీజేపీ ప్రభుత్వం మోస్తుందా అని కూడా అడిగారు. పార్లమెంటుపై దాడి చేస్తే మోడీ సర్కారు ఏంచేయలేకపోయిందనీ, ప్రశ్నిస్తే సభ్యులను సస్పెండ్‌ చేసిందని గుర్తు చేశారు.

Spread the love