సీట్లే కాదు… పవరూ కావాలి

Not just seats...power too– మహిళా సాధికారతకు అదే రాచబాట
– కోటలు దాటిన మాటలు…గడప దాటని చేతలు
– ఇప్పుడైనా మహిళల కల సాకారమయ్యేనా?
గత వారం రాజ్యాంగంలో 128వ సవరణను కేవలం 24 గంటల కంటే తక్కువ వ్యవధిలోనే ఆమోదించి పార్లమెంట్‌ చరిత్ర సృష్టించింది. అదే మహిళా రిజర్వేషన్‌ బిల్లు. గత నాలుగు దశాబ్దాలుగా దేశంలోని రాజకీయ నాయకులందరూ చట్టసభల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇస్తూనే ఉన్నారు. సంఖ్యాపరంగా చూస్తే ఇది మహిళలకు బలం చేకూర్చే విషయమే. అయితే మహిళల బలం కేవలం సంఖ్య పైనే ఆధారపడి ఉంటుందా అనేదే ఇక్కడ ప్రశ్న ఇప్పుడు ప్రభుత్వం మహిళా బిల్లును ప్రవేశపెట్టింది. అయితే చట్టసభలలో మహిళల సంఖ్యను పెంచినంత మాత్రాన వారికి అధికారాలు లభించవు. ఇప్పటికీ రాజకీయాలలో పురుషుల పెత్తనమే కొనసాగుతోంది. మహిళలు ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్నప్పటికీ వారి భర్తలో, ఇతర కుటుంబ సభ్యులో ఆధిపత్యం చెలాయిస్తున్నారు. కాబట్టి కేవలం మహిళల ప్రాతినిధ్యం పెంచి చేతులు దులుపుకుంటే సరిపోదు. మహిళా సాధికారత స్ఫూర్తిని కొనసాగిస్తేనే ఆశించిన ఫలితాలు వస్తాయి. విధాన నిర్ణయాలలో మహిళలకు పురుషుల నుంచి సంస్థాగతమైన, నిర్మాణపరమైన అధికారాలు బదిలీ కావాలి. అప్పుడే మహిళా సాధికారతకు సార్థకత చేకూరుతుంది.
న్యూఢిల్లీ : ప్రస్తుతం పరిపాలనలో మహిళల భాగస్వామ్యం చాలా తక్కువగా ఉంది. రాజకీయాల నుండి కార్పొరేట్‌ స్థాయి వరకూ మహిళల భాగస్వామ్యం పురుషులతో పోలిస్తే తక్కువేనని చెప్పాలి. 2021లో మహిళలలో అక్షరాస్యత రేటు 91.95% ఉంది. అయినప్పటికీ వివిధ రంగాలలో వారి భాగస్వామ్యం చాలా స్వల్పంగానే ఉంటోంది. ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలైన న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలలో పురుషుల ఆధిపత్యమే ఎక్కువగా కన్పిస్తోంది. మహిళలకు తాము కోరుకున్న రంగాలలో ప్రవేశం లభించడం లేదు. 1947లో దేశంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండీ ఇదే పరిస్థితి. ఇప్పటి వరకూ దేశాన్ని పరిపాలించిన 14 మంది ప్రధానులు మహిళా సాధికారతపై ఉపన్యాసాలు ఇచ్చిన వారే. అయితే వీరిలో ఏ ఒక్కరూ తమ మహిళా సహచర సభ్యులకు ముఖ్యమైన రాజకీయ, పాలనా సంబంధమైన బాధ్యతలు అప్పగించలేదు. ఆశ్చర్యకరమైన విషయమేమంటే తొలి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ సైతం తన క్యాబినెట్‌లో మహిళలకు సముచిత స్థానం కల్పించలేదు. వాజ్‌పేయి మంత్రిమండలిలో 34 మంది సభ్యులుండగా వారిలో మహిళలు ఇద్దరంటే ఇద్దరే. స్వాతంత్య్రానంతరం కొలువుదీరిన మంత్రివర్గాలలో మహిళల సంఖ్య ఎన్నడూ 20శాతం దాటలేదు.
కీలక పదవుల్లో మొండిచేయి
ఇక రాష్ట్రాల విషయానికి వస్తే 1947 తర్వాత వివిధ రాష్ట్రాలలో 350 మంది పురుష ముఖ్యమంత్రులు పనిచేయగా, కేవలం 14 మంది మహిళలు మాత్రమే ముఖ్యమంత్రులు అయ్యారు. పోనీ ముఖ్యమైన అధికారులుగా అయినా మహిళలు గణనీయమైన సంఖ్యలో పనిచేశారా అంటే అదీ లేదు. సీబీఐ, ఈడీ, ఐబీ వంటి సంస్థలకు ఒక్కరంటే ఒక్క మహిళ కూడా ఇప్పటి వరకూ నేతృత్వం వహించలేదు. ఎన్నికల కమిషన్‌, సాయుధ దళాలు, సుప్రీంకోర్టు, ఆర్‌బీఐ వంటి వాటిలో కూడా ఇప్పటి వరకూ మహిళా బాస్‌లు లేరు. దేశంలోని 200 ప్రభుత్వ రంగ కంపెనీలలో ఓ డజను కంపెనీలకు మాత్రమే మహిళా సీఈఓలు ఉన్నారు. క్యాబినెట్‌ కార్యదర్శి, రక్షణ కార్యదర్శి, హోం కార్యదర్శి, ఆర్థిక కార్యదర్శి వంటి కీలక పదవులేవీ మహిళలను వరించలేదు.

Spread the love