ఆరునూరైనా డిసెంబరు ఆరున ఖాతాల్లో డబ్బులేస్తాం..

ఆరునూరైనా డిసెంబరు ఆరున ఖాతాల్లో డబ్బులేస్తాం..– రైతుబంధు నిలిపివేతపై మంత్రి హరీశ్‌రావు
– ఎన్ని కుట్రలు పన్నినా ఆ పథకం ఆగదని వ్యాఖ్య
– రైతు నోటికాడ ముద్దను కాంగ్రెస్‌ లాక్కుందని ఆగ్రహం
– ఓటుతో ప్రజలు బుద్ధి చెబుతారంటూ హెచ్చరిక
– బీఆర్‌ఎస్‌ 80 స్థానాల్లో గెలుస్తుందని ధీమా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఆరు నూరైనా డిసెంబరు ఆరున అన్నదాతల ఖాతాల్లో రైతు బంధు డబ్బులేస్తామని రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదు వల్లే రైతు బంధును ఎన్నికల సంఘం ఆపిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రకంగా ఆ పార్టీ రైతు నోటి కాడి ముద్దను ఎత్త గొట్టిందని (లాక్కోవటం) వాపోయారు. ఈ నేపథ్యంలో ప్రజలు కాంగ్రెస్‌కు ఓట్లతో తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పక్షనేత కె.కేశవరావుతో కలిసి ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. రైతు బంధు పథకాన్ని ఆపాలంటూ రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే అక్టోబర్‌ 23న ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని హరీశ్‌రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ పథకం పాతదే కాబట్టి… బీఆర్‌ఎస్‌ అభ్యర్థన మేరకు తొలుత ఈసీ అనుమతించిందని అన్నారు. పీసీసీ ఉపాధ్యక్షులు నిరంజన్‌ మరోసారి ఫిర్యాదు చేయడంతోనే ఈసీ ఇప్పుడు రైతు బంధును ఆపిందని తెలిపారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా రైతు బంధు స్కీం ఆగబోదన్నారు. బీఆర్‌ఎస్‌ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్‌ 6న రైతుల ఖాతాల్లో నిధులను జమ చేస్తామని హామీనిచ్చారు.
కాంగ్రెస్‌ మొదటి నుంచి రైతు వ్యతిరేక పార్టీ అని ఆయన ఈ సందర్భంగా విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడుగానీ, ప్రతి పక్షంలో ఉన్నప్పుడుగానీ అన్నదాతల పట్ల ఆ పార్టీ సానుకూలంగా వ్యవహరించలేదని దుయ్యబట్టారు. పీసీసీ మాజీ అధ్యక్షులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, ప్రస్తుత అధ్యక్షులు రేవంత్‌రెడ్డి మీడియా సమావేశాల్లో రైతు బంధుపై విషం కక్కారని గుర్తు చేశారు. ఆ పథకం దుబారా ఖర్చని ఒకరంటే, రైతులకు బిచ్చమేస్తున్నారా? అంటూ మరొకరు విమర్శించారని తెలిపారు. మోసపూరిత వాగ్దానాలతో కర్ణాటకలో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌… తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు అబద్దపు ఆరు గ్యారంటీలను తీసుకొచ్చిందని ఎద్దేవా చేశారు. ఆ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో అమల్లో ఉన్న రూ. 4 వేల రైతు సాయాన్ని రద్దు చేయడంతోపాటు కరెంట్‌ కోతలు, స్కాలర్‌షిప్పులపై ఆంక్షలు పెట్టిందని విమర్శించారు. నాలుగు గంటల కరెంటు చాలంటూ ఒకరంటే, మీటర్లు పెడుతామంటూ మరొకరు రైతులను భయపెడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ల్లో కరెంట్‌ మోటార్లకు మీటర్లు పెట్టారని ఆరోపించారు. వంద రోజుల్లో 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ రాహుల్‌ గాంధీ బెంగళూరు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హమీ, 180 రోజులు గడుస్తున్నా అమలు కాలేదని అన్నారు. ఇప్పటి వరకూ ఆ రాష్ట్రంలో ఒక్క నోటిఫికేషన్‌ కూడా రాలేదని చెప్పారు. ఎన్నికలప్పుడు ఎన్నో వాగ్దానాలను ఇస్తాం, అన్నీ అమలు జరుగుతాయా? అంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అనడం వారి మోసాన్ని బట్టబయలు చేస్తోందని అన్నారు. కర్ణాటకలో ఇచ్చిన హమీలను అమలు చేయని కాంగ్రెస్‌… తెలంగాణలో ఏ ముఖం పెట్టుకుని ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌, బీజేపీలకు రైతులపై ప్రేమ లేదనీ, ఇప్పటి వరకు స్వామినాధన్‌ కమిషన్‌ సిఫారసులను అమలు చేయలేదని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుబంధు సృష్టికర్త అనీ, దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని సంక్షేమ పథకాలను ఇక్కడి రైతాంగానికి అమలు చేస్తున్నామని చెప్పారు. ఎవరెన్ని అబద్ధపు ప్రచారాలు చేసినా తమ పార్టీ 80 సీట్లను గెలుచుకుని చరిత్ర సృష్టిస్తుందని హరీశ్‌రావు ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.

Spread the love