స్పెషల్ టీంను ఏర్పాటు చేయాల్సిందిగా సీపీకి ఆదేశాలు
రివ్యూ మీటింగ్‌లో ప్రధాన చర్చ
సోషల్ మీడియా ద్వారా వైషమ్యాలు సృష్టిస్తే కేసులు
రెండేండ్ల వరకూ అడవుల్లోనే 600 మంది గ్రేహౌండ్స్
మాదకద్రవ్యాల నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత
మావోల అంతంతో పెరుగుతున్న గంజాయి స్మగ్లర్స్
ఖమ్మం జిల్లా పోలీసింగ్ సంతృప్తికరం : డీజీపీ సీవీ ఆనంద్
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామ మాజీ సర్పంచ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు సామినేని రామారావు హత్య కేసును నెల రోజుల్లో ఛేదిస్తామని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. ఓ మర్డర్ కేసును ఇన్ని రోజులూ అన్ డిటెక్టివ్‌గా పెట్టడం మంచిది కాదన్నారు. అందుకే స్పెషల్ టీంను ఏర్పాటు చేసి నెల రోజుల్లో ఈ కేసును ఛేదించాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్‌కు సూచించినట్టు వెల్లడించారు. మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించామని, మావోయిస్టుల అంతంతో గంజాయి పెడ్లర్స్ పెరిగారని తెలిపారు. ఖమ్మం పోలీసుల పనితీరు సంతృప్తికరంగా ఉందన్నారు. ఖమ్మంలోని సీపీ పాత క్యాంప్ కార్యాలయ మీటింగ్ హాల్‌లో ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీజీపీ మాట్లాడారు. సామినేని హత్య కేసుకు సంబంధించి ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టు తెప్పిస్తున్నామని తెలిపారు. ఆ క్లూస్ ఆధారంగా విచారణ నిర్వహిస్తామన్నారు. సోషల్ మీడియా ద్వారా వైషమ్యాలు సృష్టిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఖమ్మం జిల్లాలో నలుగురైదుగురిపై ఈ రకమైన కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. రెండు నెలల కాలంలో ఎస్‌ఐ, ఆ పైస్థాయి అధికారులు 6,500 మందితో తాను వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్టు చెప్పారు. వాటి ఫలితాలు ఎలా ఉన్నాయో.. సమీక్షించామన్నారు.ప్రజలు ఆశించిన రీతిలో పోలీసింగ్ప్రజలు ఆశించిన రీతిలో పోలీసింగ్ ఉండేలా చర్యలు చేపడుతున్నామని డీజీపీ వెల్లడించారు.
దీనిలో భాగంగా తరచూ విజిటింగ్, పర్యవేక్షణా చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలకు పోలీసులు అందుబాటులో ఉండాలని సూచించామన్నారు. నేర నియంత్రణ చర్యలు, చార్జిషీట్ నమోదు, కోర్టులకు వెళ్లి బ్రీపింగ్ చేయటం.. లాంటి చర్యలూ చేపట్టాలని సూచించామన్నారు. పని భారం, తదితర కారణాలతో కీలక అంశాలపై కొన్నిసార్లు దృష్టి సారించలేకపోతున్నామని అంగీకరించారు. నేరస్తులు, దొంగలపై మరింతగా దృష్టి పెట్టాలన్నారు. సీసీటీఎన్ఎస్ 3.వో, టీజీ క్వాప్ 3.వోను తీసుకురావడంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఎలా వాడాలో పోలీసులకు ట్రైనింగ్ ఇస్తున్నట్టు తెలిపారు. డేటా ఫీడింగ్‌లో వెనుకబడ్డామన్నారు. దీనివల్ల జాతీయస్థాయి నేర గణాంకాల్లో మన రాష్ట్రాంశాల్లో తేడాలు వస్తున్నట్టు చెప్పారు. సాంకేతికతను ఉపయోగించుకోవడంలో తెలంగాణ పోలీసులు ముందంజలో ఉన్నారని తెలిపారు. మాదక ద్రవ్యాల నియంత్రణపై ఉక్కుపాదంభవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని మాదకద్రవ్యాల నియంత్రణపై చర్యలు చేపడుతున్నట్టు డీజీపీ వెల్లడించారు. గంజాయి తయారీదారులు, స్మగ్లర్ల పట్ల చాలా కఠినంగా వ్యవహరించబోతున్నామని వెల్లడించారు. గంజాయికి యువతను బానిసలను చేసేలా కొందరు వ్యవహరిస్తున్నారని చెప్పారు.
అటువంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. నార్కోటిక్స్ నియంత్రణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఖమ్మం జిల్లాతో పాటు అంతర్రాష్ట్ర సరిహద్దులుగా ఉన్న ప్రాంతాలపై దృష్టి సారించామని చెప్పారు. రూ.11 కోట్లు దోపిడీ, దొంగతనాల ద్వారా పోతే రూ.42 కోట్లు సైబర్ క్రైం ద్వారా ఖమ్మం జిల్లా వాసులు పోగొట్టుకున్నట్టు తెలిపారు. అందుకే సైబర్ క్రైమ్ నియంత్రణ కోసం ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేశామన్నారు. నేరస్తులకు శిక్షలు పడేలా ఆఫీసర్లు వ్యవహరించాలని, ఇందుకోసం న్యాయస్థానాలకు కావలసిన సాక్ష్యా ధారాలను సమర్పించాలని ఆదేశించారు. రోడ్డు భద్రతా చర్యలను మరింత పటిష్టం చేసినట్టు తెలిపారు. యాక్సిడెంట్ స్పాట్లలో తగు జాగ్రత్తలు చేపట్టామన్నారు. రాత్రి దొంగతనాలు అధికమవుతున్న దృష్ట్యా గస్తీని మరింత పకడ్బందీ చేశామన్నారు. మావోయిజం పూర్తిగా అంతమైందనడానికి లేదని, అందుకే రెండేండ్ల వరకూ గ్రేహౌండ్ పోలీసులు 1100 మందిలో 600 మందితో పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్, సత్తుపల్లి ఏసీపీ వసుంధరా యాదవ్, అడిషనల్ డీసీపీలు తదితరులు పాల్గొన్నారు.



