కొత్త ఏడాదికి స్వాగతం

Welcome to the new yearకొత్త ఏడాది.. కొత్తగా స్టార్ట్‌ చేయాలి. అలవాట్లు, అభిరుచుల విషయంలోనూ కొన్ని రిజల్యూషన్స్‌ తీసుకోవాలి. అప్పుడే మన జీవితం కూడా కొత్తగా ఉంటుంది. వ్యక్తిగతంగానూ కొన్ని విషయాల్లో నియమాలు పెట్టుకోవాలి. లేదంటే కొత్త అనుకుంటూనే పాత రోతలోనే మిగిలిపోతాం. అందుకే మీలోని చెడును వదిలిపెట్టేయాలనే నియమం పెట్టుకోండి. రాబోయే ఏడాది దాన్ని సాధించడం కోసం కష్టపడాలి. వాటిని ఏదో రెండు మూడు రోజులు కాకుండా.. మీ మాటే శాసనంగా నిరంతరం ఫాలో అయితే మీకు మంచిది. మీ న్యూ ఇయర్‌ రిజల్యూషన్స్‌ మీ వ్యక్తిగత వృద్ధి కోసమే కాకుండా సమాజానికి కూడా ఉపయోగపడేలా చూసుకోండి.
మీ ప్రియమైనవారితో మీ సంబంధాలను పెంచుకోండి. వారికి ప్రాధాన్యం ఇవ్వండి. మీకు విలువ ఇస్తున్నారు కదా అని వారిని లైట్‌ తీసుకోకండి. మీ కుటుంబం, స్నేహితులు లేదా సహోద్యోగులు కావచ్చు. వారితో మంచి రిలేషన్‌ ఏర్పరచుకోవడానికి సమయాన్ని, కృషిని పెట్టుబడిగా పెట్టడానికి ప్రయత్నించండి. ఇది మీ బంధాన్ని బలోపేతం చేస్తుంది. మీ మానసిక శ్రేయస్సుకు సానుకూలంగా దోహదం చేస్తుంది.
కొత్త విషయాలను అన్వేషించడానికి, ప్రయత్నించడానికి, కొత్త అనుభవాలను పొందడానికి ట్రై చేయండి. ఇది జీవితానికి గొప్ప అనుభవాన్ని అందిస్తుంది. కంఫర్ట్‌ జోన్‌ను దాటి కొత్తదనం కోసం తలుపులను తెరిచి ఉంచండి. కొత్త అభిరుచిని కనుగొనండి. కొత్త విషయాలు తెలుసుకోండి. దానికోసం రీసెర్చ్‌ చేయండి. ఇది మీకు సబ్జెక్ట్‌ పెరిగేలా చేస్తుంది. అప్పుడు మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది.
ఈ ఆధునిక జీవితంలో పర్యావరణంపై ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ప్రయత్నం చిన్నదైనా పర్యావరణంపై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. అలాగే మీ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను మంచి కోసం ఉపయోగించండి. ఆన్‌లైన్‌లో ఉన్నవన్నీ నిజం కాదని గుర్తుంచుకోండి. అందులోని మంచిని మాత్రమే స్వీకరించాలి. మంచి కంటెంట్‌ను మాత్రమే షేర్‌ చేయండి. వీలైతే సోషల్‌ మీడియా తక్కువగా వాడండి.
జీవితంలో ఎల్లప్పుడూ ఆరోగ్యమే మీ ప్రాధాన్యతగా ఉండాలి. వచ్చే ఏడాది సమతుల్యమైన, మరింత అనుకూలమైన జీవనశైలిని అనుసరించడానికి ప్రయత్నించండి. వ్యాయామం కోసం ఓ అరగంట కేటాయించండి. మీ మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఇది మీ శరీరంలో శ్వాస నియంత్రణ, జ్ఞాపకశక్తి మెరుగుపరుస్తుంది. అలాగే ఆర్థికంగా నిలదొక్కుకోవడం తప్పనిసరి. ఇందుకోసం ఖర్చులను తగ్గించుకోండి. కష్టపడి పని చేయాలి, లక్ష్యాల కోసం నిజాయితీగా ప్రయత్నించాలి. వ్యూహాత్మక ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ సభ్యుల్లో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించడం ద్వారా పొదుపు, ఖర్చు గురించి తెలియజేయండి. కొన్ని స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. సంపద పెరుగుతుందనుకునే విషయాల్లో పెట్టుబడులు పెట్టండి.
మరో ముఖ్యమైన విషయం కొత్త ఏడాది అంటే పార్టీలు మాత్రమే కాదు. మత్తులో ఊగిపోవడం అంతకన్నా కాదు. రాబోయే ఏడాది జీవితం ఎంత అందంగా ఉండాలని మీరు కోరుకున్నా… మీ చుట్టూ ఉన్న పరిస్థితులు అందుకు దోహదపడాలి. చుట్టూ చీకట్లు అలముకుని ఉంటే మీరొక్కరే వెలుగులో బతకడం అసాధ్యం. కనుక సమాజాన్ని పట్టిపీడుస్తున్న అంధకారాన్ని పారద్రోలడం కూడా మన లక్ష్యాల్లో ఓ భాగంగా ఉండాలి. ముఖ్యంగా యువత దీనికి నడుం కట్టాలి. వీటి సాధన దిశగా కొత్త ఏడాదికి స్వాగతం పలకాలి.

Spread the love