ఏమి సేతుర లింగా?

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఎన్నికల గోదాలో దూకుడు ప్రదర్శిస్తుంటే..బీజేపీ మాత్రం ఏమి సేతుర లింగా? అంటూ తలలు పట్టుకుంటున్నది. ఏడాది కిందటి దాకా అధికారం మాదే..ఆహో ఓహో అన్నట్టుగా హడావిడి చేసిన బీజేపీ నేతలు సల్లబడ్డారు. ఎన్నికల ముందు బలమైన అభ్యర్థుల్లేక..ఉన్నవారిలో ఎవరిని ప్రకటించాలో అర్థంకాక భేటీల మీద భేటీలు అవుతూ కాలయాపన చేస్తూ కాంగ్రెస్‌ రెండోలిస్టు విడుదలపై దింపుడు కళ్లెం ఆశపెట్టుకున్నది. షరామామూలే అన్నట్టుగా విభజించు పాలించు.. విద్వేషాలను రెచ్చగొట్టు అనే సూత్రాలను నమ్ముకుని ముందుకు పోతున్నది. ఓట్ల కోసం ప్రజల మధ్య చిచ్చు రాజేస్తున్నది. చరిత్ర వక్రీకరణ ఆధారంగా రూపొందించిన రజాకార్‌ సినిమాకు మతం రంగు పులిమి లబ్ది పొందాలని చూస్తున్నది. కానీ, తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర ఉన్న గడ్డ కాబట్టి ప్రజలెవ్వరూ ఆ పార్టీని నమ్మే స్థితిలో లేరని స్పష్టమవుతున్నది. రాజకీయ చదరంగం కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ అన్నట్టుగా మారింది. దీంతో గంపెడాశలు పెట్టుకున్న తెలంగాణపై పట్టు దొరక్కపోవడంతో ఏమి సేతుర లింగా? ఏమి సేతూ? అంటూ పాట పాడుకోవాల్సిన పరిస్థితి ఆ పార్టీకొచ్చింది.
– అచ్చిన ప్రశాంత్‌

Spread the love