ఇక చావోరేవో!

Who are you?– నిలవాలంటే తప్పక గెలవాల్సిందే
– హార్దిక్‌సేనకు నేడు విషమ పరీక్ష
– సిరీస్‌ విజయంపై విండీస్‌ గురి
భారత్‌, వెస్టిండీస్‌ మూడో టీ20 నేడు
టీమ్‌ ఇండియాకు ఇక చావోరేవో. టీ20 సిరీస్‌పై ఆశలు నిలవాలంటే నేడు మూడో టీ20లో కచ్చితంగా నెగ్గి తీరాల్సిందే. లేదంటే, 2016 తర్వాత తొలిసారి భారత్‌పై కరీబియన్లు ద్వైపాక్షిక టీ20 సిరీస్‌ సొంతం చేసుకోవటం లాంఛనమే కానుంది. 2-0 ఆధిక్యంలో నిలిచిన ఆతిథ్య వెస్టిండీస్‌ నేడు సిరీస్‌ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్‌ లైనప్‌ అంచనాలను అందుకుంటేనే నేడు కీలక మ్యాచ్‌లో హార్దిక్‌సేన గెలుపుపై కన్నేయగలదు. మరి భారత బ్యాటర్లు మూడో మ్యాచ్‌లోనైనా మెరుగైన ఆట తీరు కనబరుస్తారా? సిరీస్‌పై ఆశలు సజీవంగా నిలుపుతారా? ఆసక్తికరం.
నవతెలంగాణ-ప్రొవిడెన్స్‌
కరీబియన్‌ పర్యటనలో భారత జట్టు తొలిసారి ఒత్తిడిలో పడింది. పొట్టి ఫార్మాట్‌లో ఆతిథ్య జట్టు కుర్రాళ్లు కదం తొక్కుతుండగా.. స్లో పిచ్‌లపై పరుగుల వేటలో భారత బ్యాటర్లు తడబాడుతున్నారు. తొలి రెండు మ్యాచుల్లో వెస్టిండీస్‌ విజయం సాధించగా.. ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో నేడు సిరీస్‌ సొంతం చేసుకునేందుకు కరీబియన్లు బరిలోకి దిగుతున్నారు. మరోవైపు హార్దిక్‌సేన బ్యాటింగ్‌ లోపాలను సరిచేసుకునేందుకు ఇబ్బంది పడుతుంది. ఎదురుదాడి వ్యూహంలో భాగంగా టాప్‌ ఆర్డర్‌ ధనాధన్‌ మోత మోగించాల్సిన అవసరం ఉన్నప్పటికీ.. నిలకడగా నిరాశపరుస్తున్నారు. నేడూ బ్యాటర్లు తేలిపోతే.. సుదీర్ఘ విరామం అనంతరం విండీస్‌ చేతిలో టీ20 సిరీస్‌ పరాజయం చవిచూడాల్సిన ప్రమాదం పొంచి ఉంది. భారత్‌, వెస్టిండీస్‌ మూడో టీ20 నేడు. రాత్రి 8 గంటలకు డిడి స్పోర్ట్స్‌, జియో సినిమాలో ప్రసారం.
బ్యాటర్లు మెరిస్తేనే :
ఇషాన్‌ కిషన్‌, శుభ్‌మన్‌ గిల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌. పొట్టి ఫార్మాట్‌లో మంచి రికార్డున్న బ్యాటర్లు. అయినా, స్లో వికెట్‌పై పరుగులు చేసేందుకు తంటాలు పడుతున్నారు. శుభ్‌మన్‌ గిల్‌ ఐపీఎల్‌ తర్వాత నిలకడగా విఫలమవుతుండగా.. ఇషాన్‌ కిషన్‌ మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నాడు. ఇక సూర్యకుమార్‌ యాదవ్‌ పేలవ ఫామ్‌ కరీబియన్‌ టూర్‌లో కొనసాగుతుంది. టాప్‌ ఆర్డర్‌లో ముగ్గురు బ్యాటర్లు నిలకడగా అంచనాలు అందుకోవటం లేదు. దీంతో భారత్‌ బ్యాట్‌తో ఆశించిన స్కోరు సాధించటం లేదు. యువ బ్యాటర్‌ తిలక్‌ వర్మ తొలి రెండు మ్యాచుల్లోనూ ఆదుకున్నాడు. సంజు శాంసన్‌, హార్దిక్‌ పాండ్య సైతం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయటం లేదు. బ్యాటర్లు తేలిపోతున్న పిచ్‌లపై ఓ అదనపు బ్యాటర్‌ను తుది జట్టులోకి తీసుకునే ఆలోచన సైతం ఉంది. ముగ్గురు స్పిన్నర్లలో ఒకరిపై వేటు వేసి యశస్వి జైస్వాల్‌ను టాప్‌ ఆర్డర్‌లో ఆడించే అవకాశం లేకపోలేదు. అయితే, హార్దిక్‌ పాండ్య ఈ ఆలోచనకు అంత సుముఖంగా లేనట్టు కనిపిస్తుంది. బౌలింగ్‌ విభాగంలో అర్షదీప్‌ సింగ్‌, ముకేశ్‌ కుమార్‌లు డెత్‌ ఓవర్లలో మరింత మెరుగైన ప్రదర్శన చేయాల్సి అవసరం ఉంది. అక్షర్‌ పటేల్‌ గత మ్యాచ్‌లో ఒక్క ఓవర్‌ కూడా వేయలేదు. కుల్దీప్‌ ఫిట్‌నెస్‌ సాధిస్తే రవి బిష్ణోరు స్థానంలో తుది జట్టులోకి రానున్నాడు. యుజ్వెంద్ర చాహల్‌ మరోసారి భారత్‌కు కీలకం కానున్నాడు.
కరీబియన్ల ఉత్సాహం
ఆల్‌రౌండ్ల అండతో ఆతిథ్య వెస్టిండీస్‌ ముచ్చటగా మూడో విజయంపై కన్నేసింది. లోతైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉండటంతో ఆ జట్టు ఒత్తిడిలోనూ రాణిస్తోంది. నికోలస్‌ పూరన్‌, షిమ్రోన్‌ హెట్‌మయర్‌లు ఫామ్‌లో ఉన్నారు. భారత బౌలర్లను ఎదుర్కొని విలువైన ఇన్నింగ్స్‌లు నమోదు చేస్తున్నారు. బ్రాండన్‌ కింగ్‌, కైల్‌ మేయర్స్‌ ఆరంభంలో ఆశించిన ప్రదర్శన చేయటం లేదు. కొత్త బంతిని ఎదుర్కొని నిలబడలేకపోతున్నారు. జాన్సన్‌ చార్లెస్‌, రోవ్‌మాన్‌ పావెల్‌లు సైతం రాణిస్తే ఆతిథ్య జట్టుకు తిరుగుండదు. ఒబెడ్‌ మెక్‌కారు, అల్జారీ జొసెఫ్‌, రోమారియో షెఫర్డ్‌, జేసన్‌ హోల్డర్‌లు బంతితో సమిష్టిగా రాణిస్తున్నారు. నేడూ కరీబియన్‌ కుర్రాళ్లు మెరిస్తే.. సిరీస్‌ వేదిక అమెరికాకు మారకముందే వెస్టిండీస్‌ సొంతం కానుంది!.
పిచ్‌ రిపోర్టు
ప్రొవిడెన్స్‌ స్టేడియంలో సగటు తొలి ఇన్నింగ్స్‌ స్కోరు 127 పరుగులు. ఇక్కడ ఆతిథ్య జట్టుకు మంచి రికార్డు లేదు. అయినా, రెండో టీ20లో కరీబియన్లు పైచేయి సాధించారు. మ్యాచ్‌ సాగుతున్న కొద్దీ పిచ్‌ మరీ నెమ్మదించటంతో స్పిన్నర్లకు అనుకూలత ఎక్కువగా లభిస్తోంది. ఆరంభంలో పేసర్లకు మంచి సహకారం లభిస్తుంది. టాస్‌ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది.
వర్షం సూచనలు
భారత్‌, విండీస్‌ మూడో టీ20కి సైతం వర్షం ముప్పు కనిపిస్తోంది. మంగళవారం ఇక్కడ 50 శాతం వర్షం కురువనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. స్థానిక కాలమానం ప్రకారం మ్యాచ్‌ ఉదయం 10.30 గంటలకు ఆరంభం అవుతుండగా.. మ్యాచ్‌ సమయంలోనూ చిరు జల్లులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.
తుది జట్లు (అంచనా) :
భారత్‌ : ఇషాన్‌ కిషన్‌, శుభ్‌మన్‌ గిల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, సంజు శాంసన్‌, హార్దిక్‌ పాండ్య, అక్షర్‌ పటేల్‌/యశస్వి జైస్వాల్‌, రవి బిష్ణోరు/కుల్దీప్‌ యాదవ్‌, అర్షదీప్‌ సింగ్‌, యుజ్వెంద్ర చాహల్‌, ముకేశ్‌ కుమార్‌.
వెస్టిండీస్‌ : బ్రాండన్‌ కింగ్‌, కైల్‌ మేయర్స్‌, జాన్సన్‌ చార్లెస్‌, నికోలస్‌ పూరన్‌, రోవ్‌మాన్‌ పావెల్‌, షిమ్రోన్‌ హెట్‌మయర్‌, రోమారియో షెఫర్డ్‌, జేసన్‌ హోల్డర్‌, అకీల్‌ హొసేన్‌, అల్జారీ జొసెఫ్‌, ఒబెడ్‌ మెక్‌కారు.

Spread the love