పిల్లలు తినకపోవడానికి కారణమేంటో…

ఎంతసేపు తింటావ్‌, సరిగా తినకపోతే బలమెలా వస్తుందంటూ తిట్టే తల్లులు కొందరు. మా పిల్లలు అస్సలు తినరండీ అంటూ కంప్లయింట్‌ చేసే తల్లులు ఇంకొందరు. తింటావా తన్నమంటావా అంటూ బెత్తం పట్టుకునే వాళ్లు ఇంకొందరు. అయితే వీటన్నిటికంటే ముందు చేయాల్సింది ఇంకొక టుంది. బిడ్డ తినకపోవడానికి వెనుక కారణాన్ని వెతకడం. పిల్లలు తిండి తినకపోవడానికి ఆటల్లో పడిపోవడం ఒక్కటే కాదు… ఏదైనా పెద్ద కారణం ఉండొచ్చు. వాళ్లకేదైనా సమస్య ఉండివుండొచ్చు. కాబట్టి ఆ కోణంలో కూడా ఓసారి ఆలోచించమంటున్నారు పిల్లల నిపుణులు…
పిల్లలు తిండి తినకపోవడానికి ఆరోగ్య సమస్యలు చాలాసార్లు కారణమవుతాయి. కాబట్టి వాళ్లకి అన్న వాహికలో ఏదైనా సమస్య ఉందా, హార్మోన్ల లోపాలేమైనా ఉన్నాయా, ఆకలి సంబంధింత సమస్యలేమైనా ఉన్నాయా, మలబద్దకం ఉందా, అసిడిటీ ఏమైనా మొదలయ్యిందా, థైరాయిడ్‌ హార్మోన్లలో హెచ్చుతగ్గులేమైనా ఉన్నాయా, కాలేయ సమస్యలు కానీ కిడ్నీ సమస్యలు కానీ ఏమైనా ఉన్నాయా అన్నది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. చిన్నపిల్లలకి ఈ సమస్యలా అనుకోకండి. మనకే కాదు… పిల్లలకీ చాలా ఇబ్బందులుంటాయి. అవి వాళ్లు చెప్పలేరు. మనకి అర్థం కావు. అందుకే పిల్లలు తిండి తినకుండా మారాం చేస్తుంటే చిన్నతనం అని వదిలేయకుండా ఓసారి డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్లండి.
ఇక శారరీక సమస్యలతో పాటు మానసిక సమస్యలూ ఉంటాయి. మన మనసు బాగోకపోతే మనం తిండి తింటామా? అలాగే పిల్లలకూ ఉంటుంది. మనసులో ఏదైనా బెంగ, దిగులు, భయం ఉంటే వాళ్లకి కూడా తిండి సహించదు. కాబట్టి పిల్లలను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. వాళ్లతో మాట్లాడాలి. ఏమైంది అంటూ లాలించి వాళ్ల మనసులో మాటను తెలుసుకోవాలి. ఆ బెంగను, భయాన్ని దూరం చేయాలి. అప్పుడు బలవంతంగా తినిపించాల్సిన అవసరం ఉండదు. వాళ్లంతట వాళ్లే తినేస్తారు.
ఈ కోణంలో ఆలోచించేవాళ్లు చాలా తక్కువమందే ఉంటారు. ఎందుకంటే చిన్నపిల్లలే కదా అని ఎక్కువ దూరం ఆలోచించకపోవడమే అసలు సమస్యకు కారణం. మీరు మాత్రం ఆ తప్పు చేయకండి. ఆటల్లో పడినా పిల్లలకు ఆకలి వేస్తుంది. కాస్త లేటయినా వచ్చి తినేస్తారు. కానీ ఎంతకీ తినడం లేదంటే వాళ్లకి సమస్య ఉన్నట్టే. దాన్ని కనిపెట్టాల్సిన బాధ్యత మీదే.

Spread the love