ప్రాణహిత-చెవేళ్ల పథకాన్ని రీ-డిజైన్ చేసి 02మే2016 జూన్ 19న కాళేశ్వరం పేరుతో సాగునీటి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో 13 జిల్లాలు, 7 లింక్‌లు, 56 ప్యాకేజీలు, 3 బ్యారేజీలు, 14 జలశయాలు, 31 లిఫ్టులు, 1832 కి.మీ కాల్వలతో పునర్ నిర్మాణం చేపట్టారు. 3 బ్యారేజీలలో గోదావరి నదిపై ఎల్లంపెల్లికి 108 కి.మీ దిగువన, ప్రాణిహిత నది గోదావరిలో కలిసిన తరువాత మేడిగడ్డ వద్ద 16.17 టిఎంసీలతో బ్యారేజీ నిర్మాణం చేపట్టారు. దానికి ఎగువన 46 కి.మీ దూరంలో అన్నారం బ్యారేజ్ 10.87 టిఎంసీలతోనూ, అన్నారం బ్యారేజ్‌కి ఎగువన 31.5 కి.మీ దూరంలో సుందిల్ల ప్రాజెక్టు 8.56 టిఎంసీలతో చేపట్టారు. సుందిల్ల నుండి 31 కి.మీ దూరంలో ఉన్న ఎల్లంపెల్లి ప్రాజెక్టులోకి పంపిణీ చేయాలి. 195 టిఎంసీలకు మేడిగడ్డ నుండి గోదావరి ఎగువకు అనగా అన్నారం, సుందిల్ల, ఎల్లంపెల్లి ప్రాజెక్టుకు లిఫ్ట్ చేయాలి. ఇదిగాక 20 టిఎంసీలు గోదావరిలో లభ్యత ఉంటుంది. 25 టిఎంసీల భూగర్భ జలాలతో కలిపి 240 టిఎంసీల లభ్యత ఉంటుందని ప్రాజెక్టు సర్వే చేసిన ఢిల్లీ ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారం మేడిగడ్డ బ్యారేజ్, పంపుహౌజ్, అన్నారం బ్యారేజ్, పంపుహౌజ్, సుందిల్ల బ్యారేజ్ పంపుహౌజ్ నిర్మాణం చేపట్టారు. మార్చి 2022 నాటికి 3 బ్యారేజీలకు, 3 పంపుహౌజ్‌లకు కలిపి రూ.17,941.75 కోట్లు వ్యయం చేశారు. ఈ మూడు బ్యారేజీలకు 2,623.68 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం.
ఏడాదిలో 90 రోజులు ఈ లిప్టులు పని చేస్తాయి. మేడిగడ్డ నీటిని 17 పంపులతో కన్నెపెల్లి పంపుహౌజ్ నుండి అన్నారానికి లిప్టు చేయాలి. విద్యుత్ చార్జీ యూనిట్ రూ.6.30 చొప్పున నిర్ణయించారు. రోజుకు 203.02 మిలియన్ యూనిట్లు అవసరం కాగా, విద్యుత్ చార్జీలకు ఏటా రూ.10,374.56 కోట్లు కావాలి. నిర్వహణ వ్యయం రూ.10,647.26 కోట్లు అవసరమని కాగ్ నివేదిక వెల్లడించింది. ఈ ప్రాజెక్టును ఎల్లంపెల్లి నుండి మల్లన్నసాగర్ ద్వారా కొండపోచమ్మ వైపు ఒక లైను, మల్లన్న సాగర్ నుంచి చిట్యాల (గంధమల్ల, బస్వాపురం రిజర్వాయర్లు) వరకు ఒక లైను ద్వారా 14 జలాశయాలను నిర్మించాలి.
కాగ్ నివేదిక ఏం చెప్పింది?
ఈ ప్రాజెక్టు ద్వారా 169 టిఎంసీలు సాగుకు, 16 టిఎంసీలు పారిశ్రామిక అవసరాలకు, 30 టిఎంసీలు హైదరాబాద్ పట్టణానికి, 10 టిఎంసీలు దారి పొడువున ఉన్న గ్రామాలకు తాగునీటి సౌకర్యం కల్పించాలి. మార్చి 2022 నాటికి రూ.86,788.06 కోట్లు వ్యయం చేశారు. ఇందులో రూ.55,807.86 కోట్లు వివిధ సంస్థల ద్వారా అప్పులు తెచ్చారు. ఈ అప్పులకు 7.8 శాతం నుండి 10.9 శాతం వడ్డీ చెల్లించాలి. 2035-36 నాటికి ఆసలు రూ.87,369.89 కోట్లు, రూ.54,174.70 కోట్లు వడ్డీకింద మొత్తం రూ.1,41,544.59 కోట్లు 14 ఏండ్లలో చెల్లించాలి. ఈ మొత్తం నిర్వహణ వ్యయం లెక్కవేసినప్పుడు ఎకరానికి ఒక పంటకు రూ.40వేల ఖర్చు అవుతుంది. ప్రభుత్వం మొదటి 3 బ్యారేజీలకు పెట్టిన పెట్టుబడిలో 70 శాతం రుణాలు తెచ్చి పెట్టారు. అందువల్ల ఏటా రైతులపై ప్రభుత్వం చెల్లించాల్సిన రుణాలకు అదనపు భారాలు వేయాల్సి వస్తున్నది. ఇంత భారాన్ని తెలంగాణ ప్రజలు, రైతులు భరించగలరా? ఇంత వ్యయం చేసి నిర్మాణం చేసినప్పటికీ మేడిగడ్డ బ్యారేజీలో 7వ బ్లాకులోని 18, 19, 20, 21 పియర్స్ 4 ఫీట్ల లోతుకు కుంగిపోయాయి. అంతేగాక అన్నారం బ్యారేజీకి బుంగ పడి నీరు దిగువకు వస్తున్నది. అన్నారం బ్యారేజీ ముందుగల నిర్మాణాలు బుంగ ద్వారా దిగువకు కొట్టుకు వచ్చాయి. సుందిల్ల బ్యారేజీ కూడా నిర్మాణ లోపాలు ఉన్నట్లు గుర్తించారు.
ఈ లోపాలపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్ శాఖతో విచారణ చేపట్టింది. జస్టిస్ పినాకి చంద్రఘోష్‌తో జూడీషియల్ విచారణకు కమిషన్ వేసింది. కేంద్ర ప్రభుత్వం జాతీయ డ్యాం సెప్టీ ఆథారిటీ ద్వారా విచారణ జరిపించింది. పై మూడు కమిషన్లు జరిపిన విచారణలో మేడిగడ్డ నుండి సుందిల్ల వరకు గల ఎత్తిపోతల పథకాలు పనికి రావని నిర్దారణకు వచ్చాయి. కానీ, జస్టిస్ చంద్రఘోష్ ఏప్రిల్ 28న ”మేడిగడ్డను అట్లా వదిలేస్తే ఎట్లా ? అని” ఆశ్చర్యాన్ని ప్రకటించాడు. ఇంత డబ్బు వ్యయం చేసి చేసిన నిర్మాణాన్ని వదిలివేస్తే జరిగే నష్టానికి బాధ్యులెవరు? అన్న ఆలోచనతో జస్టిస్ ఆ ప్రకటన చేసి ఉండవచ్చు. కానీ ప్రాజెక్టు జీవిత పర్యంతం ప్రతియేట ఎకరాకు రూ.40వేలు వ్యయం చేయడం ప్రభుత్వానికి సాధ్యమవుతుందా అన్న విషయాన్ని ఆలోచించ లేదు. పైగా గోదావరి నది ఇసుక తిన్నెలపై నిర్మాణం చేసిన బ్యారేజీల జీవిత కాలం ఎంత కాలం ఉంటుంది. శాస్త్రీయంగా విచారించాల్సిన అవసరం ఉంటుంది.
మేడిగడ్డకు ప్రత్యామ్నాయం ఉందా?
2008లో నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్ రాజశేఖర్‌రెడ్డి ప్రాణహిత నుండి కాళేశ్వరం వరకు గల 116 కి.మీ కాలువ ద్వారా 165.38 టిఎంసీల నీటిని లిప్టు చేయాలని పథకం రూపొందించి 2014 నాటికి రూ.8వేల కోట్లు వ్యయం చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద 150 అడుగుల ఎత్తుతో బ్యారేజీ నిర్మించాలని మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం జరిగింది. కానీ వెంటనే ప్రారంభించకపోవడం వల్ల మహారాష్ట్రలో ప్రభుత్వం మారడం, తుమ్మిడిహెట్టి వల్ల ముంపుకు గురైన ప్రాంతాలను గుర్తించి ప్రాజెక్టుకు అనుమతించకపోవడం జరిగింది. కానీ, 148 అడుగుల ఎత్తు నిర్మాణం చేపట్టడానికి అంగీకారం తెలిపారు. 148 మీటర్ల ఎత్తులో మహారాష్ట్రలో 3,990 ఎకరాలు తెలంగాణలో 434 ఎకరాలు ముంపునకు గురవుతాయి. అందుకు పరిహారం చెల్లించాలి. 116 కి.మీ కాలువ (తుమ్మిడి హెట్టి – ఎల్లంపెల్లి)లో మైలారం వద్ద లిప్టు ఏర్పాటు చేయాలి. దానికి 332.64 మిలియన్ యూనిట్లు మాత్రమే కావాలి. యూనిట్ చార్జి రూ.6.30లు అయినప్పటికీ ఏటా వ్యయం 212.89 కోట్లు ఖర్చు అవుతుంది. 1 టిఎంసీకి రూ.1.33 కోట్లు వ్యయం చేయాలి. మేడిగడ్డ లిప్టు ద్వారా 1 టిఎంసీకి రూ.8.61 కోట్లు వ్యయం చేయాలి. మొత్తం తుమ్మిడిహెట్టి నుండి ఎల్లంపెల్లి వరకు గల కాలువ, తుమ్మిడి హెట్టి బ్యారేజీ కలిపి 8,603 కోట్లు మాత్రమే వ్యయం జరుగుతాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్ తూర్పు ప్రాంతంలోని 1.56 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించవచ్చు. అంతేగాక ఎల్లంపెల్లి నుండి శామీర్‌పేట వరకు (శామీర్‌పేట నుండి చెవేళ్ల వరకు గల డిజైన్‌నే ప్రస్తుత డిజైన్‌గా మార్చారు. ఎల్లంపెల్లిని మినహాయించి శామీర్‌పేట తో ముగింపు చేశారు. తుమ్మిడిహెట్టి నుండి ఎల్లంపెల్లి వరకు అతి తక్కువ నిల్వతో 165 టిఎంసీల నీటిని వినియోగించవచ్చు. ఎల్లంపెల్లి తరువాత గల మిడ్ మానేర్ మినహా మిగిలిన అనంతరగిరి, మల్లన్నసాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ, బస్వాపురం రిజర్వాయర్లను 1 నుండి 3 టిఎంసీల వరకు నీటి నిల్వకు గత కాంగ్రెస్ ప్రభుత్వం డిజైన్ రూపొందించింది. ఆ డిజైన్‌ను మార్చి 50 టిఎంసీలతో మల్లన్న సాగర్ చేపట్టారు. 20 గ్రామాలను నిర్వాసితులు చేసి నిర్మించిన మల్లన్న సాగర్ దిగువన భూమి నిలువుగా చీలి ఉన్నదని ఎప్పుడైనా భూకంపాలు వచ్చే అవకాశం ఉన్నదని భూగర్భ శాఖ నివేదికలు చెప్తున్నాయి. ఇంత భారీ ప్రాజెక్టు నిర్మాణం చేసినప్పుడు అన్ని శాఖల సర్వేలను గమనంలోకి తీసుకోవాలి. గత ప్రభుత్వం డిజైన్ ప్రకారం నిర్మాణం చేసినచో ప్రభుత్వం పైనేగాక సాగు నిర్వహణ వ్యయం చాలా వరకు తగ్గుతుంది.
ఏం చేయాలి?
ప్రస్తుత మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలను వినియోగించడం వల్ల కలిగే భారాల కన్న తుమ్మిడి హెట్టి నుండి కర్జెల్లి, సురగపెల్లి, మైలారం ద్వారా ఎల్లంపెల్లికి నీటిని తేవడం తక్కువ వ్యయంతో కూడుకున్నది. ఏటా నిర్వహణ వ్యయం కూడ చాల తక్కువ. అంతేగానీ, నిర్మాణం జరిగిన ప్రాజెక్టులను వదిలివేయడం, కొంత భారమైన ప్రాజెక్టు జీవిత పర్యంతం ఆ భారాన్ని మోయడం సాధ్యం కాదు. 2015లోనే అనంతరాములు, మరి నలుగురు ఇంజనీర్లు రీ-డిజైన్‌ను వ్యతిరేకిస్తూ నోటు ఇచ్చారు. అంతేగాక కేంద్ర ఇరిగేషన్ శాఖ సలహాదారు ఎదిరే శ్రీరాం కూడా తుమ్మిడి హెట్టి వద్ద 160 టిఎంసీల నికర జలాల లభ్యత ఉన్నట్లు నివేదిక ఇచ్చారు.
ఇవన్ని శాస్త్రీ యంగా పరిశీలించ కుండా టీ(బీ)ఆర్ఎస్ ప్రభుత్వం మేడిగడ్డ ప్రాజెక్టు ను ప్రారంభించి నిధుల దుర్వినియోగానికి పాల్పడిం ది. ఇప్పటికైన తుమ్మిడిహెట్టి నుండి ఎల్లంపెల్లికి గల పాత డిజైన్‌లోని ఐదవ ప్యాకేజీని అనగా 71 కి.మీ నుండి 116వ కి.మీ వద్ద గల ఎల్లంపెల్లికి నిర్మాణం పూర్తి చేయాలి. అలాగే తుమ్మిడి హెట్టి వద్ద 150 అడుగుల ఎత్తుతో బ్యారేజీ నిర్మించాలి. ఈ పనులు పూర్తి చేయడానికి ప్రస్తుతం చేయ తలపెట్టిన మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల రిపేర్లకన్న తక్కువ వ్యయమవుతుంది. ఇంజనీర్ల నివేదికలను పరిశీలించి తుమ్మిడి హెట్టి ప్రాజెక్టును చేపట్టడం లాభదాయకంగా ఉంటుంది.
సారంపల్లి మల్లారెడ్డి
9490098666