ఏమి సేతురా..!

What Sethura..!– బీజేపీని వెంటాడుతున్న బ్యాక్‌ఫుట్‌ భయం
– పోటీ చేయమంటున్న కొందరు
– ఏకంగా రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్న మరి కొందరు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
లోక్‌సభ ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాల్లో శరవేగంగా మార్పులు వస్తున్నాయి. బీజేపీలో నేతలు పోటీ నుంచి తప్పుకుంటున్నారు. మరికొంత మంది నేతలు రాజకీయాల నుంచే నిష్క్రమిస్తున్నారు. బీజేపీలో గత కొన్నేళ్లుగా మోడీ, షా ద్వయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు పోటీకి వెనుకడుగు వేస్తున్న వారు, రాజకీయాల నుంచే నిష్క్రస్తున్న వారు ..ఆ ద్వయాన్ని సహించలేకపోతున్నారు. ఇంకొంత మంది బీజేపీలో ఉన్నప్పటికీ ఆ ద్వయం పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అయితే వారు బయటపడలేక లోలోన కుమిలిపోతున్నారు.
400 ప్లస్‌..అంటున్న ప్రధాని
ప్రధాని మోడీ ఎక్కడికెళ్లినా ”ఈ సారి 400కుపైనే” అంటున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 370 స్థానాలు, ఎన్డీయేకి 400కుపైగా స్థానాలు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు. అయితే బీజేపీ టికెట్‌ ఇచ్చినా, ఎన్నికల బరిలో దిగడానికి చాలా మంది ఇష్టపడటం లేదు. ‘వ్యక్తిగత కారణాలు’ అంటూ పోటీ నుంచి వైదొలుగుతున్నారు. సరిగ్గా పోలింగ్‌ దగ్గరపడుతున్న సమయంలో ఈ పరిణామాలు ఆ పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారాయి.
పోటీ నుంచి వెనక్కి తగ్గిన నేతలు
గుజరాత్‌లోని వడోదర నుంచి పోటీ చేసేందుకు బీజేపీ టికెట్‌ పొందిన రంజన్‌బెన్‌ భట్‌ వ్యక్తిగత కారణాలను చూపుతూ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఆమె రెండుసార్లు ఎంపీగా గెలిచారు. ఈసారి కూడా ఆమెకు టికెట్‌ దక్కినా.. పోటీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. అయితే తాను బీజేపీలోనే కొనసాగుతానని, అధిష్టానం ఎవరికి అవకాశం ఇచ్చినా, వారి విజయం కోసం కృషి చేస్తానని చెప్పారు.
గుజరాత్‌లోని శబర్‌కాంత నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అవకాశం దక్కించుకున్న బీజేపీ నేత భికాజీ ఠాకూర్‌ కూడా కాడి కింద పడేశారు. వ్యక్తిగత కారణాలను చూపుతూ, పోటీ చేయడం తనకు ఇష్టం లేదని చెప్పారు. ఆయన మాజీ విశ్వ హిందూ పరిషత్‌ కార్యకర్త, ఓబీసీ నేత, 34 ఏండ్ల నుంచి బీజేపీలో ఉన్నారు. లోక్‌సభకు పోటీ చేసే అవకాశం ఆయనకు మొదటిసారి లభించింది. ఇక మెహసానా లోక్‌సభ నియోజకవర్గం నుంచి తనకు టికెట్‌ ఇవ్వాలని మాజీ ఉప ముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌ మొదట కోరారు. కానీ ఆ తర్వాత ఎటువంటి కారణం చూపకుండానే తాను పోటీ చేయబోనని ప్రకటించారు. ఈ స్థానం నుంచి పోటీ చేసేవారి పేరును బీజేపీ ప్రకటించడానికి ముందే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్‌ లోక్‌సభ నియోజకవర్గానికి అభ్యర్థిగా భోజ్‌పురి గాయకుడు, నటుడు పవన్‌ సింగ్‌ను బీజేపీ ప్రకటించింది. ఈ స్థానానికి ప్రస్తుతం టీఎంసీ నేత,శతృఘ్న సిన్హా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే తాను అసన్‌సోల్‌ నుంచి పోటీ చేయలేనని పవన్‌ సింగ్‌ ప్రకటించారు. ఉత్తర ప్రదేశ్‌లోని బారాబంకీ నియోజకవర్గం అభ్యర్థిగా ఎంపీ ఉపేంద్ర సింగ్‌ రావత్‌ను బీజేపీ ప్రకటించింది. మరుక్షణంలోనే ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ఓ మహిళతో అభ్యంతరకర పరిస్థితిలో ఉన్నట్టు ఈ వీడియోలో కనిపించింది. దీంతో తాను నిర్దోషినని నిరూపణ అయ్యే వరకు తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని రావత్‌ ప్రకటించారు. తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయబోనని కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ వికె సింగ్‌ ప్రకటించారు. ఘజియాబాద్‌ నుంచి రెండుసార్లు ఎన్నికైన ఆయన.. ఈ సారి పోటీలో నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించారు. కాన్పూర్‌ బీజేపీ ఎంపీ సత్యదేవ్‌ పచౌరీ కూడా లోక్‌సభ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.
రాజకీయాలకు స్వస్తి
ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ హర్షవర్థన్‌ రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు. జార్ఖండ్‌కు చెందిన మాజీ మంత్రి, ఎంపీ జయంత్‌ సిన్హా సైతం రాజకీయాలకు స్వస్తి పలికారు. అలాగే కర్నాటకకు చెందిన సదానంద్‌ గౌడ్‌ కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. మళ్లీ యూటర్ను తీసుకొని రాజకీయాలు కొనసాగిస్తానని అన్నారు. ఇలా ఎన్నికల బరిలోంచి తప్పుకుంటున్న వాళ్లు, రాజకీయాలకు స్వస్తి చెపుతున్న వారి సంఖ్య బీజేపీలో రోజు రోజుకి పెరుగుతున్నారు.

Spread the love