మోడీ దేశాన్ని ఏం చేస్తాడో..!

What will Modi do to the country..!– అన్నీ ప్రయివేటీకరిస్తున్నడు..
– మోటార్లకు మీటర్లు పెట్టాలని చెబుతుండు..
– రాహుల్‌కు ఎద్దు, ఎవుసం తెల్వదు..
– ఖమ్మం ప్రజలు ఏపీ, తెలంగాణ రోడ్లు చూడాలే..
– డబుల్‌ రోడ్డు వస్తే తెలంగాణ.. సింగిల్‌ రోడ్‌ వస్తే ఏపీ..
– మనం వెలుగుతున్నాం.. వారు ఉన్నచోటే ఉన్నారు : బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్‌
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి/సత్తుపల్లి/ఇల్లందు
”నరేంద్రమోడీ ఈ దేశాన్ని ఏమి చేస్తాడో..! ఎల్‌ఐసీని అమ్ముతున్నాడు.. విమానాశ్రయాలు, ఓడరేవులు.. ఇలా అన్నీ ప్రయివేటీకరణ చేస్తున్నాడు.. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టమంటున్నాడు” అని బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. మోటార్లు పెట్టేందుకు తాము వ్యతిరేకమని చెప్పామని తెలిపారు. ఉత్తర భారతదేశంలో దళితులపై దాడులు జరగని రోజే లేదన్నారు. 75 ఏండ్ల స్వాతంత్య్ర భారతదేశంలో దళితులు అణచివేతకు గురయ్యారని, వారిని సాటి మనుషులుగా గుర్తించింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని తెలిపారు. ‘దళిత చైతన్య జ్యోతి’ కార్యక్రమం ద్వారా దళితబంధుకు రూపం ఇచ్చామని, ఇదేదో ఎన్నికల కోసం రూపొందించిన పథకం కాదన్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని సత్తుపల్లి, ఇల్లెందు నియోజకవర్గాల్లో బుధవారం నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ప్రజాఆశీర్వాద సభల్లో కేసీఆర్‌ ప్రసంగించారు.
దళితబంధు ఎన్నికల కోసం కాదు..
ప్రజాస్వామ్య పరిణతి వస్తేనే అద్భుతాలు, అభివృద్ధి అని కేసీఆర్‌ అన్నారు. ధర్నాలు, రాస్తారోకోలు చేస్తేనో దళితబంధు రాలేదన్నారు. ఉత్తర భారతదేశంలోని ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, బీహార్‌, చివరకు ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోనూ దళితులపై దాడి జరగని రోజు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పది ఓట్లు రావాలి, పూట గడవాలని కాదు.. తెలంగాణను బాగు చేయాలనే ఆలోచనతో మ్యానిఫెస్టోలో లేకపోయినా దళితబంధు అనే పదాన్ని వెలుగులోకి తెచ్చామ న్నారు. ఎన్నికలతో సంబంధం లేకుండా తెచ్చిన ఈ పథకాన్ని రాజకీయాలకు అతీతంగా ఖమ్మం జిల్లాలో ప్రతిపక్ష ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క నియోజకవర్గం మధిరలోని చింతకాని మండలం మొత్తానికి వర్తింపజేశామని తెలిపారు. సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా దళితబంధు అమలు చేసేందుకు జీవో జారీ చేసిన కొద్దిరోజులకే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిందన్నారు. ఆరునూరైనా గెలిచేది బీఆర్‌ఎస్సేనని.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దళితబంధును యథాతథంగా అమలు చేస్తామన్నారు.
మోడీ ప్రయివేటీకరణ..
మోడీ ప్రయివేటీకరణ పేరుతో.. ఎల్‌ఐసీ, ఓడరేవులు, విమానాశ్రయాలు అమ్ముతున్నారన్నారు. ప్రభుత్వరంగంలో నుంచి కరెంట్‌ను ప్రయి వేటీకరించేందుకు తాను అంగీకరించలేద న్నారు. భద్రాద్రి వంటి పవర్‌ప్లాంట్‌ను జెన్కో ఆధ్వర్యంలో నిర్మించామన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టమంటున్నారని, సంవత్సరానికి రూ.25 కోట్ల నష్టాన్ని భరించామే కానీ మోటార్లకు మీటర్లు పెట్టలేదని తెలిపారు.
కాంగ్రెస్‌వి బలుపు రాజకీయాలు..
”ఓ ఇద్దరు కాంగ్రెస్‌లో చేరిండ్రు.. ఒకడు మాట్లాడతడు.. అసెంబ్లీ గేటు తాకనీయడట..” అని అన్నారు. మీరు తలచుకుంటే దుమ్ములేవదా.. అని కేసీఆర్‌ సభికులను ప్రశ్నించారు. డబ్బు రాజకీయాలు, అహంకార రాజకీయాలు తగవన్నారు. కాంగ్రెస్‌ ధరణి పోర్టల్‌ ఎత్తివేస్తామంటోంది.. ధరణి పోతే మళ్లీ రైతుల భూములపై వీఆర్‌ఏ, వీఆర్‌వో, ఎమ్మార్వో, ఆర్డీవో, జాయింట్‌ కలెక్టర్‌, కలెక్టర్‌ ఎవడికి కోపం వచ్చినా భూములు మారతాయన్నారు. రాహుల్‌కు ఎద్దు, వ్యవసాయం తెల్వదన్నారు. గుండెకాయలాంటి సీతారామను పూర్తి చేసి సాగర్‌ నీళ్ల తండ్లాట నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాను బయటపడేస్తామని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ వస్తే చీకట్లు వస్తాయన్నారని.. ఇప్పుడు మనకు వెలుగులు, వాళ్లకు చీకట్లు వచ్చాయన్నారు. ఖమ్మం జిల్లా ప్రజలు ఏపీ, తెలంగాణల్లో రోడ్లు ఎలా ఉన్నాయో చూడాలన్నారు. డబుల్‌ రోడ్డు వస్తే తెలంగాణ.. సింగిల్‌ రోడ్డు వస్తే ఏపీదని తెలిపారు. ఏపీ రైతులు తెలంగాణకు వచ్చి ధాన్యం అమ్ముకుంటున్నారన్నారు. వ్యక్తుల మధ్య పోరాటం కాదు.. పార్టీ మధ్య పోరాటం.. కాంగ్రెస్‌ ఏమి చేసిందో మనసుపెట్టి ఆలోచన చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సభల్లో బీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్ష నేత నామ నాగేశ్వరరావు, రాజ్యసభ ఎంపీలు బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, మంత్రి, బీఆర్‌ఎస్‌ ఖమ్మం అభ్యర్థి పువ్వాడ అజరుకుమార్‌, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, తాతా మధుసూదన్‌, రఘోత్తమ్‌రెడ్డి, అశ్వారావుపేట బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌, డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మెన్లు కూరాకుల నాగభూషణం, రాయల శేషగిరిరావు, మహబూబాబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ బిందు, ఖమ్మం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ ఉమామహేశ్వరరావు, బీఆర్‌ఎస్‌ యువజన విభాగం ఖమ్మం జిల్లా అధ్యక్షులు చింతనిప్పు కృష్ణచైతన్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love