విభజన హామీలు నెరవేరేది ఎప్పుడు?

When are separation guarantees fulfilled?– కలగానే మామునూరులో విమానాశ్రయం
– వరంగల్‌ సమస్యలపై పార్లమెంటులో పోరాడే ఎంపీ కావాలి
నవతెలంగాణ- హన్మకొండ
రాజ్యాంగబద్ధంగా పార్లమెంటు సాక్షిగా తెలంగాణ విభజన సమయంలో వరంగల్‌ ప్రజలకు ఇచ్చిన విభజన హామీలతోపాటు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న మామునూరులో విమానాశ్రయం, వరంగల్‌ నగరంలో అండర్‌ డ్రయినేజీ, టెక్స్‌టైల్‌ పార్క్‌ లాంటి హామీలు ఎప్పుడు నెరవేరుతాయని వరంగల్‌ ప్రజలు ఎదురుచూస్తున్నారు. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో తమ సమస్యల కోసం పార్లమెంట్‌లో పోరాడే అభ్యర్థిని గెలిపించాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. కాగా, ఏపీ పునర్విభజన చట్టంలో కాజీపేటకు కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, ములుగులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని అప్పటి కేంద్ర ప్రభుత్వం పొందుపరిచింది. పార్లమెంట్‌ సాక్షిగా ప్రకటించింది. కానీ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదేండ్లు గడిచినా ఇంతవరకు ఒక్క హామీని కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదు. గతంలో ఈ ప్రాంతం నుంచి గెలిచిన వారు కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేదన్న ఆరోపణలు ప్రజల్లో ఉన్నాయి.
కోచ్‌ ఫ్యాక్టరీ కోరిక తీరేదేప్పుడు?
వరంగల్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లక్షలాదిమందికి ఉద్యోగ కల్పన కల్పించే అతి ప్రధానమైన కోచ్‌ ఫ్యాక్టరీ దశాబ్దాల కాలంగా వరంగల్‌ ప్రజలను ఊరిస్తూనే ఉంది. కేంద్రంలో గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ నెలకొల్పుతామని హామీ ఇచ్చింది. కానీ ఆ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడంతో హామీలన్నింటినీ పక్కకు పడేసింది. దేశంలో సరిపడా రైల్వే వ్యాగన్లు ఉన్నాయని ఇప్పుడు కోచ్‌ ఫ్యాక్టరీ అవసరం లేదని బీజేపీ ప్రకటించి దాన్ని గుట్టు చప్పుడు కాకుండా గుజరాత్‌కు తరలించింది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు తీవ్ర ప్రతిఘటన ఎదురు కావడంతో తూతూ మంత్రంగా రైల్వే ఓవరాయిలింగ్‌ ఫ్యాక్టరీని మోడీ ప్రారంభించారు. దీనివల్ల ఏమీ ఉపయోగం లేదని గతంలో వార్తలూ వచ్చాయి. అలాగే, బయ్యారంలో సరిపడా ఉక్కు నిలువలు ఉన్నా ఆ ప్రాంతాన్ని కనీసం పరిశీలించకుండానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పడానికి ముందుకు రావడం లేదు.
ఎట్టకేలకు ప్రారంభమైన గిరిజన యూనివర్సిటీ..
గత ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో బీజేపీ అధికారంలోకి రావడానికి విభజన హామీల్లో ఏదో ఒక హామీని నిలబెట్టుకోకపోతే తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని భావించిన బీజేపీ.. ఆగమేఘాల మీద ములుగు ప్రాంతంలో ఒక ప్రయివేటు భవనంలో ప్రధాన మోడీ చేతుల మీదుగా యూనివర్సిటీని ప్రారంభించారు. అయితే అది ఎన్నికల వరకే ఉంటుందా లేక పూర్తిగా గిరిజన యూనివర్సిటీని నిర్మాణం చేస్తారా అనేది వేచి చూడాల్సిందే. వీటితోపాటు వరంగల్‌ మామునూరులో విమానాశ్రయం, ప్రధానంగా వర్షాకాలంలో నీట మునుగుతున్న వరంగల్‌ నగరాన్ని కాపాడటానికి అండర్‌ డ్రయినేజీ సిస్టమ్‌, సంగెం మండలంలో టెక్స్‌టైల్‌ పార్క్‌ వంటి ప్రధాన సమస్యలు తీరాలంటే రాబోయే ఎన్నికల్లో వరంగల్‌ సమస్యలపై పార్లమెంటు సాక్షిగా పోరాడే అభ్యర్థిని గెలిపించాలని వరంగల్‌ ప్రజలు కోరుకుంటున్నారు.

Spread the love