– మహిళా సాధికారతపై చిత్తశుద్ధి ఏది?
– మాటలు ఘనం…చేతలు శూన్యం
– అఘాయిత్యాలు జరుగుతున్నా నోరు మెదపరు
– రిజర్వేషన్ల అమలుపై కుంటిసాకులు చెబుతారు
న్యూఢిల్లీ : ఈ సంవత్సరం చివరలో ఐదు రాష్ట్రాల శాసనసభలకు, వచ్చే సంవత్సరం ఏప్రిల్-మే నెలల్లో లోక్‌సభకు ఎన్నికలు జరగనున్న తరుణంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించు కుంది. చట్టసభలలో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కల్పించి వారికి విధానాలు, చట్టాల రూపకల్పనలో సముచిత ప్రాతినిధ్యం కల్పించడమే తన లక్ష్యమని గొప్పగా చెప్పుకుంది. అయితే మాటలు కోటలు దాటి చేతలు గడప దాటని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మహిళా సాధికారత విషయంలోనూ మోడీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో పరిశీలిస్తే బండారం బయటపడుతుంది.
మహిళా బిల్లు సెప్టెంబర్ 21న రాజ్యసభ ఆమోదం పొందగానే పార్లమెంట్ వెలుపల కన్పించిన దృశ్యాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చి, దానిని పార్లమెంటులో ఆమోదింపజేసినందుకు కృతజ్ఞతగా మహిళా సభ్యులంతా మోడీకి జేజేలు పలికిన ఆ దృశ్యాన్ని వీక్షించి కమలనాథులు ఉబ్బి తబ్బిబయ్యారు. మే 28న పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవం జరిగిన రోజు మహిళా మల్లయోధులను వీధుల్లో ఈడ్చుకెళ్లిన దృశ్యాలు కూడా ఇంకా దేశం మరిచిపోలేదు. ఈ రెండు ఉదంతాల మధ్య ఎంత తేడా ఉన్నదో గమనించాలి.
నిర్బంధాలు… అణచివేతలు
ప్రజాస్వామ్య పరిరక్షణలో మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామని చెప్పుకుంటున్న పాలకులు… వారిపై దాష్టీకాలు జరుగుతుంటే అదేమని ప్రశ్నించే అవకాశం కూడా ఇవ్వడం లేదు. నిరసనలు, ఆందోళనలను బలప్రయోగంతో అణచివేస్తున్నారు. మణిపూర్‌లో మహిళల పై జరిగిన అఘాయిత్యాలను ప్రపంచమంతా గమనిం చింది. ఈ దారుణాలకు సంబంధించి సామాజిక మాధ్యమా లలో వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పే పాలకులు ఈ దారుణాలను చూసి కనీసం చలించిన పాపాన పోలేదు. మణిపూర్‌లోనే కాదు… దేశంలోని అనేక ప్రాంతాలలో మహిళల పట్ల పైశాచికంగా వ్యవహరిస్తున్న ఉదంతాలను గురించి ప్రతిరోజూ వింటూనే ఉన్నాము. అమృత్‌కాల్, సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్ వంటి మాటలు వినసొంపుగానే ఉన్నా ఆచరణలో మాత్రం నీటి మీద రాతలుగా మారుతున్నాయి.
ఈ ప్రశ్నలకు బదులేది?
ఒక చట్టం అమలును కొంతకాలం నిలిపివేయడం, దానిని ఇతర ప్రభుత్వ చర్యలతో ముడిపెట్టడం, పైగా అమలుకు కాలపరిమితి నిర్ణయించడం..గతంలో ఎన్నడూ జరగలేదు. 2021లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని చేసిన ప్రకటనకు ఇది భిన్నంగా ఉంది. అప్పుడు మోడీ ఏమన్నారంటే…అమృతకాలం పాతిక సంవత్సరాలు. అయితే అప్పటి వరకూ వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడే మొదలు పెట్టాలి. ఒక్క క్షణం కూడా వృథా కాకూడదు. ఇదే సరైన సమయం. మన దేశం మారాలి. ప్రజలుగా మనం కూడా మారాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా మనమూ మారాల్సి ఉంటుంది… మరి అప్పుడు ప్రధాని చెప్పిందేమిటి? ఇప్పుడు చేసిందేమిటి? మహిళా బిల్లును వెంటనే ఎందుకు అమలులోకి తీసుకురాలేదు? దానికి సరైన సమయం ఇంకా రాలేదా? మహిళా రిజర్వేషన్ల విషయానికి వచ్చేసరికి అప్పుడు చెప్పిన మాటలన్నీ మర్చిపోయారా?
కుంటిసాకులతో కాలయాపన
2026 తర్వాతే మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పిన వారు ఇప్పుడు ఇంత హడావిడిగా బిల్లును ఎందుకు ఆమోదించాల్సి వచ్చింది? ఇది కేవలం ఎన్నికల వేళ మహిళలను మభ్యపెట్టడానికేనని అర్థమవుతోంది. ఇక్కడ ఇంకో విషయాన్ని గమనించాల్సి ఉంది. రిజర్వేషన్ల కారణంగా సీట్లు కోల్పోయే వారిని బుజ్జగించడానికే ఈ ఎత్తు వేశారు. బిల్లును ఆమోదింపజేసుకునేందుకు అవసరమైన సంఖ్యాబలం 2014 నుండే ప్రభుత్వానికి ఉంది. అనేక బిల్లుల విషయంలో ప్రతిపక్షాల నుండి అభ్యంతరాలు వ్యక్త మైనప్పటికీ మందబలంతో వాటిని ఆమోదించుకున్న ఉదంతాలు అనేకం. వ్యవసాయ చట్టాలు, కార్మిక నిబంధన లు వీటికి ఉదాహరణలు. కానీ మహిళా బిల్లు విషయంలో మాత్రం ఏకాభిప్రాయం కొరవడిందన్న సాకు చెప్పారు. వాస్తవానికి మహిళా సాధికారత విషయంలో మోడీ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. అనేక ప్రభుత్వ విధానాలు మహిళా లోకానికి నష్ట దాయకంగా ఉంటున్నాయి. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు సం బంధించిన సమాచారం సభ్య సమాజానికి ఆందోళన కలిగిస్తోంది. మహిళ లకు సరైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించడం లేదు. వారిపై ఇంటిపని భారం పెరుగుతోంది. ప్రతిరోజూ మహిళలపై దౌర్జన్యాలు, దాష్టీకాలు, అకృత్యాలు, లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. వాస్తవాల గుట్టును చరిత్ర రట్టు చేస్తుంటే పాలకులు మాత్రం మహిళా సాధికారత అంటూ తీపి కబుర్లు చెబుతూనే ఉన్నారు. ప్రజలను మభ్యపెడుతూనే ఉన్నారు.
మాటలకే పరిమితం
మహిళా సాధికారత వాస్తవ రూపం దాల్చాలంటే విధానపరమైన నిర్ణయాలలో మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు ప్రవచిస్తుంటారు. కానీ మాటలకు, చేతలకు ఎక్కడా పొంతన లేదు. ఏకాభిప్రాయం లేదన్న సాకు చూపి మహిళా రిజర్వేషన్ బిల్లుపై విపరీతమైన కాలయాపన చేశారు. చివరికి హడావిడిగా బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదింపజేసుకొని చేతులు దులుపు కున్నారు. అమలు మాత్రం ఇప్పుడే కాదంటూ చావు కబురు చల్లాగా చెప్పారు. బిల్లులోని క్లాజ్ 5 (1) ప్రకారం… జనగణన, నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాతే మహిళా బిల్లు అమలులోకి వస్తుంది. వచ్చినా పదిహేను సంవత్సరాలు మాత్రమే రిజర్వేషన్లు అమలులో ఉంటాయి.