హస్తం జాబితా ఎప్పుడొస్తదో..?

– కారు పార్టీ అభ్యర్థుల ఎదురు చూపులు…
– బలమైన ప్రత్యర్థులుంటే గెలుపు కష్టమేనని ఆందోళన
– లేదంటే గట్టెక్కొచ్చనే భావన
– అభ్యర్థుల అనుచరుల్లోనూ ఇదే చర్చ
– అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తొలి జాబితా వచ్చి అప్పుడే పది రోజులు కావస్తోంది. దాంతో నేతల హడావుడి.. పైనుంచి జనంలో ఉండి, వారి మెప్పును పొందాలంటూ ఆదేశాలు. వీటితోపాటు ఇంటిలిజెన్స్‌ రిపోర్టులు, అధిష్టానం చేయించే సర్వేలు… వీటన్నింటితో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఉక్కిరిబిక్కిరవు తున్నారు. ఇదే సమయంలో తమ ప్రత్యర్థులు ఎవరా అని ఒకవైపు ఆసక్తి, మరోవైపు ఆందోళనతో వారు ఎదురు చూస్తున్నారు. ప్రత్యర్థి తమకన్నా బలహీనుడైతే బయటపడొచ్చు. అదే బలవంతుడైతే…? ఇదే వీరి ఆసక్తి, ఆందోళనకు ప్రధాన కారణం. అందుకే ఇప్పుడు గులాబీ క్యాండిడేట్ల చూపంతా హస్తం జాబితా వైపే. కర్నాటక ఫలితాల తర్వాత రాష్ట్రంలో అనూహ్యంగా పుంజుకుందని భావిస్తున్న హస్తం పార్టీ అభ్యర్థులపైన్నే బీఆర్‌ఎస్‌ సిట్టింగులు, సీటు దక్కించుకున్న వారి భవితవ్యం ఆధారపడి ఉందంటూ ఆ పార్టీకి చెందిన నేతలే అభిప్రాయపడుతున్నారు. తమ తమ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ నిలబెట్టే అభ్యర్థుల ఆధారంగా తమ గెలుపోటములు ప్రభావితమవుతాయని వారు భావిస్తున్నారు. ప్రభుత్వ వర్గాలు, ఇంటిలిజెన్స్‌ సర్వేల ప్రకారం బీఆర్‌ఎస్‌ ఇప్పటి వరకూ 40 నుంచి 50 నియోజకవర్గాల్లో గట్టి పట్టును కలిగుంది. అదే మోతాదులో కాంగ్రెస్‌ కూడా పుంజుకోవటం గులాబీల్లో గుబులు పుట్టిస్తోంది. ఈ పెరిగిన కాంగ్రెస్‌ గ్రాఫ్‌నకు తోడు వారి అభ్యర్థులూ బలమైన వారైతే… ఆయా సీట్లలో కారు ముందుకు పోవటం కష్టమేననే వాదనలు బలంగా వినబడుతున్నాయి. గులాబీ పార్టీ కంచుకోటలని భావిస్తున్న స్థానాల్లో కూడా గెలుపు అంత సులభం కాకపోవచ్చని తెలుస్తోంది. ఉదాహరణకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, నాగార్జున సాగర్‌, హుజూర్‌నగర్‌, కోదాడ, మునుగోడు, మిర్యాలగూడ, సూర్యాపేట, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, పాలేరు, మధిర, భద్రాచలం, కొత్తగూడెం, సత్తుపల్లి, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కొడంగల్‌, కొల్లాపూర్‌తోపాటు ఉమ్మడి వరంగల్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో మూడేసి సీట్ల చొప్పున బీఆర్‌ఎస్‌కు ఇబ్బందులు తప్పేట్టు లేవు. ఆయా సీట్లలో సీనియర్లు, అంగబలం, అర్థబలం ఉన్న వారికే కాంగ్రెస్‌ టిక్కెట్లు దక్కే అవకాశాలుండటమే దీనికి కారణం. ఈ జిల్లాలు కాకుండా ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి మెదక్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో సైతం హస్తం పార్టీకి సాంప్రదాయక ఓటు బ్యాంకు బలంగా ఉంది. దీనికితోడు బలమైన అభ్యర్థులను బరిలోకి దించితే అది కాంగ్రెస్‌కు మరింతగా కలిసొచ్చే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే కారు కంచుకోటల్లో సైతం ఆ పార్టీకి ఇబ్బందులు ఎదురు కావొచ్చన్నది వారి వాదన. ఈ కారణంతోనే గులాబీ పార్టీ నుంచి తొలి జాబితాలో చోటు దక్కించుకున్న అభ్యర్థులు… ఇప్పుడు కాంగ్రెస్‌ జాబితా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ఛరిష్మా, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకుతోడు హస్తం పార్టీ తరపున బలహీన అభ్యర్థులు బరిలోకి దిగితే.. తమ గెలుపు సులవవుతుందని వారి ఆశ. అలాగాక బలమైన అభ్యర్థులు ప్రత్యర్థులుగా ఉంటే మాత్రం తమతోపాటు ప్రభుత్వానికి కూడా గండం తప్పదని ఆందోళన చెందుతున్నారు. అందువల్ల అనేక స్థానాల్లో కాంగ్రెస్‌ నిలబెట్టే అభ్యర్థులపైన్నే బీఆర్‌ఎస్‌ నేతల భవితవ్యం ఆధారపడి ఉందని చెప్పక తప్పదు.

Spread the love