జాబ్‌ క్యాలెండర్‌ ఎప్పుడేస్తారు

– బడ్జెట్‌పై చర్చలో కడియం శ్రీహరి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలోని నిరుద్యోగులు జాబ్‌ క్యాలెండర్‌ కోసం ఎదురు చేస్తున్నారనీ, అది దాన్ని ఎప్పుడేస్తారని బీఆర్‌ఎస్‌ సభ్యులు కడియం శ్రీహరి ప్రశ్నించారు. ఏడాదిలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. గురువారం హైదరాబాద్‌ శాసనసభలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు ఇచ్చిందనీ, పరీక్షలు నిర్వహించిందనీ, పఎన్నికల నోటిఫికేషన్లు రావడంతో ఫలితాలు ఇవ్వడం సాధ్యం కాదన్నారు. ఆ ఉద్యోగాలను కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చినట్టు ప్రచారం చేసుకుంటున్నదని ఎద్దేవా చేశారు. వాటిని కూడా తన క్రెడిట్‌ బాక్స్‌లో వేసుకుంటున్నదని చెప్పారు.
నోటిఫికేషన్లు ఇచ్చామని చెప్పలేదు మంత్రి పొన్నం ప్రభాకర్‌
ఉద్యోగ నోటిపికేషన్లు ఇచ్చినట్టు కాంగ్రెస్‌ ప్రభుత్వం చెప్పలేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం, ఆలసత్వం వల్లే ఉద్యోగులకు నియామకపత్రాలు ఇవ్వలేకపోయారని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఫలితాలు విడుదల చేయడంతోపాటు ఎల్బీస్టేడియంలో నియామ కపత్రాలు ఇస్తున్నట్టు చెప్పారు. ఈ రకంగా కొలువులు సంబంధించిన సమస్యలను పరిష్కరిం చామన్నారు. టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేస్తున్నట్టు తెలిపారు. బీఆర్‌ఎస్‌ నేతలకు ఉద్యోగాలు పోవడంతో నిరుద్యోగుల ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
ప్రతిపక్షం కాదు…ఫ్రస్టేషన్‌ పక్షం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
బీఆర్‌ఎస్‌ సభ్యులు అధికారంలోకి కోల్పోయి ప్రతిపక్షంగా వ్యవహరించకుండా ఫ్రస్టేషన్‌ పక్షంగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఇక ముందు బీఆర్‌ఎస్‌ ఎవ్వరూ కాపాడలేరని చెప్పారు. వానలు లేక, తాగడానికి నీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డితో ఆ పార్టీ నేతలు బిర్యానీ తిన్నారని చెప్పారు. నల్లగొండ సందర్భంగా ఓ హోంగార్డు చనిపోతే, ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని కేసీఆర్‌, కేటీఆర్‌ చెప్పలేదన్నారు.

Spread the love