ఆధునీకరణ పనులు ఇంకెప్పుడు..?

When will the modernization work?– కళా విహీనంగా సరోజినీదేవి హాస్పిటల్‌
– కరోనా రాకతో ఆగిన అప్‌గ్రేడేషన్‌ వర్క్‌
– తిష్ట వేసిన పలు సమస్యలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌లోని చారిత్రక సరోజినిదేవి కంటి హాస్పిటల్‌ ఇప్పట్లో మహర్ధశకు నోచుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఉస్మానియా మెడికల్‌ కాలేజీ, గాంధీ మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఏకైక కంటి హాస్పిటల్‌ ఇది. ఏండ్లుగా హాస్పిటల్‌ ఆధునీకరణ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో, ఇప్పుడు తెలంగాణలో ఉచిత సూపర్‌-స్పెషాలిటీ కంటి సంరక్షణ సౌకర్యాలకు విస్తృతంగా ప్రసిద్ధి చెందిన ఈ హాస్పిటల్స్‌.. దశాబ్దాలుగా నిధుల కొరతతో కళా విహీనంగా తయారైంది. నిత్యం రద్దీగా ఉన్నప్పటికీ చాలీచాలని సౌకర్యాలు, వసతుల లేమితో హాస్పిటల్‌కు వెళ్లాలంటే భయపడే రోజులు ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌, ఓపీ విభాగం, ఎమర్జెన్సీ వింగ్‌ల్లో గోడలు, పైకప్పులపై తేమతో దర్శనమిస్తుండగా.. హాస్పిటల్‌ గోడలు భయపెట్టేలా పగుళ్లతో కనిపిస్తుంటాయి. సిరామిక్‌ టైల్స్‌ ఫ్లోరింగ్‌, సీలింగ్‌, టాయిలెట్లు, చెక్క తలుపులు, కిటికీలు, కుళాయిలు దయనీయ స్థితికి చేరాయి.
రూ.400 కోట్లతో ఆధునీకరణ పనులు..
తృతీయ సంరక్షణ రెఫరల్‌ కంటి హాస్పిటల్‌గా పేరొందిన సరోజినిదేవి కంటి హాస్పటల్‌.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు పొరుగు రాష్ట్రాల నుంచీ కంటి చికిత్స కోసం ఈ హాస్పిటల్‌ను వస్తూ ఉంటారు. మెహిదీపట్నం దగ్గరలోని 10.79 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ హాస్పిటల్‌ క్యాంపస్‌లో 50 పడకల సామర్థ్యంతో పాటు ఔట్‌ పేషెంట్‌ భవనం, ఎమర్జెన్సీ, క్యాజువాలిటీ విభాగం, అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌, ఇన్‌పేషెంట్‌ వార్డులు ఉన్నాయి. కాగా, హాస్పిటల్‌ దుస్థితిపై అనేక మంది ఫిర్యాదు చేయడం, మీడియాలో కథనాలు రావటంతో కొన్నేండ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం హాస్పిటల్‌ను అప్‌గ్రేడ్‌ చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాలతో తెలంగాణ స్టేట్‌ మెడికల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ), హాస్పిటల్‌ సముదాయంలో ఉన్న భవనాలపై సర్వే నిర్వహించింది. క్యాంపస్‌లోని దాదాపు అన్ని భవనాలు శిథిలావస్థలో ఉన్నాయని, కొత్త క్యాంపస్‌ నిర్మాణానికి దాదాపు రూ.400 కోట్లు ఖర్చవుతుందని నివేదికను అందించారు. అందుకు అనుగుణంగా అప్‌గ్రేడేషన్‌ పనులకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. అంతలోనే కరోనా రావడంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ నిలిచిపోయింది. కాగా, గత నెలలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సరోజినీదేవి హాస్పిటల్‌లో నేత్ర సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. దాంతో హాస్పిటల్‌లో కాంప్లెక్స్‌ నిర్మాణ ప్రాజెక్ట్‌ మళ్లీ ప్రారంభమవుతుందని, హాస్పటల్‌లో సౌకర్యాలు మెరుగవుతాయని అందరూ భావించారు. కానీ మంత్రి పర్యటించి నెల అవుతున్నా.. ఇప్పటికీ పనులు ప్రారంభానికి నోచుకోలేదు.
హాస్పిటల్‌లో కొన్ని సమస్యలు ఇలా..
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ఎంతో పేరున్న ఈ హాస్పిటల్‌ ఇప్పుడు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. పాత భవనంలోనే వైద్యం అందిస్తుండటంతో సమస్యలు ఎదరవుతున్నాయి. వైద్యులు, సిబ్బంది కొరతతోపాటు రోగుల రద్దీకి తగ్గట్టుగా భవనాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 50 పడకల సామర్థ్యం గల ఈ హాస్పిటల్‌కు ప్రతి రోజూ 900 నుంచి 1100 వరకు ఓపీ విభాగంలో రోగులు వస్తూ ఉంటారు. ఇక్కడ పదుల సంఖ్యలో రెటీనా, కార్నియా, గ్లకోమా, ఓకులోప్లాస్టీ వంటి రోగాలకు శస్త్రచికిత్సలు చేస్తూ ఉంటారు. అంతేకాదు, సుమారు 50 మంది వరకు పని చేయాల్సిన చోట సరిపడా వైద్యులు లేకపోవడంతో మెరుగైన సేవలు అందించడం గగనంగా మారుతోంది. కొన్ని సందర్భాల్లో శస్త్ర చికిత్సలు సైతం వాయిదా పడుతుండటంతో జిల్లాల నుంచి వచ్చే రోగులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కొంత మందికి కంటి ఆపరేషన్‌ తర్వాత అద్దాలను కూడా ఇవ్వలేని దయనీయస్థితిలో ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Spread the love