కూలి సపెంచేదెప్పుడు

When will wages increase?– గడ్డిఅన్నారం ఫ్రూట్‌ మార్కెట్‌లో హమాలీల వెట్టిచాకిరీ
– ఏడేండ్లుగా పెంచని కూలి రేట్లు
– పొద్దంతా పనిచేసినా గిట్టడం లేదంటున్న కార్మికులు
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
పండ్ల బస్తాలు మోసీ మోసీ హమాలీ కార్మికుల భుజాలు అరుగుతున్నాయి. బతుకు బండిని లాగడం కోసం ఎంత బరువైనా మోస్తూ హమాలీలు తమ చెమట చుక్కలను చిందిస్తున్నారు. అయినా వాళ్ల కష్టానికి ఫలితం దక్కడం లేదు. అన్ని వస్తువుల ధరలు పెరుగుతున్నా ఏడేండ్లుగా హమాలీల కూలి రేట్లు మాత్రం పెరగడం లేదు. వారి గోస ఎవరికీ చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. ప్రభుత్వం తమ గోడు విని కూలి రేట్లు పెంచాలని హమాలీలు కోరుతున్నారు. గడ్డి అన్నారం ఫ్రూట్‌ మార్కెట్‌ హమాలీ కార్మికుల కష్టాలపై ‘నవతెలంగాణ’ కథనం.
రంగారెడ్డి జిల్లాలోని గడ్డిఅన్నారం ఫ్రూట్‌ మార్కెట్‌లో సుమారు 10వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. రెగ్యులర్‌గా ఆరు వేల మంది హమాలీ కార్మికులు పనిచేస్తారు. ఇక్కడ పనిచేసే కార్మికుల్లో అత్యధికులు వలస కార్మికులు. వివిధ రాష్ట్రాల నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన వారే. అయితే మార్కెట్‌లో ప్రతి రెండేండ్లకు ఒకసారి కూలి రేట్లు పెంచాల్సి ఉంది. కానీ కమీషన్‌ ఏజెంట్లతో కుమ్మక్కైన అధికారులు కార్మికుల సమస్యలను గాలికి వదిలేశారు. కార్మికులతో చర్చలు జరిపి కూలి రేటు పెంచాల్సిన అధికారులు దాటవేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ మార్కెట్‌ గతంలో కొత్తపేటలో ఉండగా.. బాటసింగారానికి తరలించారు. ప్రస్తుతం అక్కడే కొనసాగుతోంది. 2017లో సంబంధిత అధికారులు కార్మికులతో చర్చలు జరిపారు. అప్పుడు పెంచిన హమాలీ రేట్లే నేటికీ కొనసాగుతున్నాయి. అయితే, కార్మిక చట్టాల నిబంధనల ప్రకారం కూలి రేట్లు పెంచితే 75 శాతం పెరగాల్సి ఉంది. దాంతో అధికారులు కూలిరేట్ల పెంపుపై స్పందించడం లేదు. మామిడి టన్ను అన్‌లోడు చేస్తే రూ.150, ఆఫిల్‌ రూ.90, బొప్పాయి రూ.100, పనస రూ.64, జామ ఒక్క బాక్స్‌కు రూ.4.67.. ఇలా మార్కెట్‌ కమిటీ నిర్ణయించింది. అయితే ప్రస్తుతం ఈ రేట్లు గిట్టుబాటు కావడం లేదని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కూలి రేట్లు 75 శాతం పెరగాలి
కార్మిక చట్టాల నిబంధనల మేరకు ప్రతి రెండేండ్లకు ఒకసారి కూలి రేట్లు పెంచాలి. కానీ ఏడేండ్లుగా పెంచలేదు. ఇప్పటి వరకు 75శాతం కూలి రేట్లు పెంచాల్సి ఉంది. ప్రస్తుతం మామిడి టన్ను అన్‌లోడు చేస్తే రూ.150 ఇస్తున్నారు. కూలి రేట్లు పెంచితే రూ.275 వచ్చే అవకాశం ఉంది. కూలి రేట్లు పెంచాలని కార్మికులు గతంలో చాలా సార్లు మార్కెటింగ్‌ అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం శూన్యం. ప్రభుత్వం తక్షణమే స్పందించి హమాలీ రేట్లు పెంచాలని కార్మికులు కోరుతున్నారు.
త్వరలో సమస్యలు పరిష్కారిస్తాం
హమాలీ కార్మికుల కూలి రేట్ల పెంపుపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. రైతులతో చర్చలు కొనసాగుతున్నాయి. త్వరలో ప్రభుత్వం నుంచి హమాలీ కార్మికులకు శుభవార్త అందుతుంది. కార్మికులు ఎలాంటి ఆందోళన చెందొద్దు. కార్మికులు కోరుకున్న కూలి రేట్లు పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది.
చిలుక నర్సింహారెడ్డి, ఉన్నతశ్రేణి కార్యదర్శి, గడ్డిఅన్నారం మార్కెట్‌
కూలి గిట్టడం లేదు
పొద్దంతా పనిచేసినా కూలి గిట్టడం లేదు. ఏడేండ్ల కింద కూలి రేట్లు పెంచారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా పెంచలే. రోజువారీ కూలి రూ.300 కూడా వచ్చే పరిస్థితి లేదు. ఆ డబ్బులతో కుటుంబాన్ని పోషించేది ఎట్టా.. నలబై ఏండ్లుగా హమాలీ పని చేస్తున్న.. ఇప్పటికీ పని చేస్తేనే.. బుక్కెడు బువ్వ.. లేదంటే పస్తులే.. మా బతుకులను పట్టించుకునే దిక్కులేదు. మాకు కూలి రేట్లు పెంచి ఆదుకోవాలి.
మసూద్‌, ఫ్రూట్‌ మార్కెట్‌ హమాలీ కార్మిక సంఘం అధ్యక్షుడు
హమాలీ కూలి పెంచాలి
పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా హమాలీ కార్మికుల కూలి రేట్లు పెంచాలి. గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్‌లో కార్మికుల శ్రమను దోచుకుంటున్న దళారులపై చర్యలు తీసుకోవాలి. కార్మికులకు న్యాయం చేయాలి.
మల్లేపాక వీరయ్య, హమాలీ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు

Spread the love