మానవవాద సంప్రదాయం ఎక్కడ?

దేవతలుగా పూజించక్కర్లేదు. ఆడపిల్లల్ని వారి తీరున వారిని బతకనిచ్చే మనిషితత్వం ఉంటే చాలు. మహిళలపై ద్వేషాన్ని, తమ అహంకారపు విషపు గొట్టాలతో వెదజల్లి, సమాజాన్ని దుర్గంధంతో నింపి వేయడమే మన సంస్కృతా? అదే మన సంప్రదాయమా? అని అందరం ప్రశ్నించుకోవాలి. జెండర్తో పని లేకుండా ప్రతి మనిషికి ఈ దేశంలో స్వేచ్ఛగా, స్వతంత్ర నిర్ణయాలతో జీవించే హక్కుంది. ఆడవాళ్లకి స్వతంత్రం ఎందుకు? అన్న భావజాలాన్ని ఎక్కువ శాతం జనాభా సమర్థించడం భయాన్ని కలిగిస్తోంది. మహిళలపై నిరంకుశత్వానికి, పైశాచికత్వానికి కట్టుబాట్లు అని పేరు పెట్టే వెకిలి ప్రవృత్తి మారనంత కాలం గళమెత్తిన ప్రతి మహిళ గొంతును నొక్కేయడానికి కోట్ల కొద్దీ పితృస్వామ్యపు విష కోరలు చాపుతూనే ఉంటాయని ఇటీవలి కొన్ని సంఘటనలు రుజువు చేస్తున్నాయి.
సంస్కృతి, సంప్రదాయం ముసుగులో మహిళల వ్యక్తిత్వాలని, వారి శరీరాలను ఛిద్రం చేసే వికృత మానవులు పెద్ద సంఖ్యలో మందలు మందలుగా, మోరల్‌ పోలీసింగ్‌ రాక్షసులుగా రూపుదిద్దుకుంటున్నారు. సమాజం ఇటువంటి చీడ పీడలతో నిండిపోతోంది. అంతకంతకూ అవి మరింత విస్తృతంగా లోతుగా వేళ్లూనుకుంటూ పాతుకుని పోతున్నాయి. కాలం మారుతోంది. ఆడపిల్లలకు చదువులు, అన్నింటా అవకాశాలు లభిస్తాయి. స్వేచ్చగా ఊపిరి పీల్చుకుంటారు. భావితరం అమ్మాయిలు మరింతగా తమకు నచ్చినట్లుగా తమ జీవితాలను చక్కదిద్దుకుంటారనే ఆశలు అడియాశలుగానే కనిపిస్తున్నాయి. 2024కి వచ్చినా కూడా ఇంకా ఆడపిల్ల ఉనికి సమాజానికి కంటకంగానే ఉంది.
నగత్వమే కనిపిస్తుంది
అమ్మాయి పుడితే బంగారు తల్లి పుట్టిందని మురిసిపోయే తల్లిదండ్రులారా! బహు పరాక్‌! ఆడపిల్లను కేవలం లైంగిక వస్తువుగా చూసి బూతులతో విఝృంభించే గొప్ప సమాజం మనది. ఇంకా ఎన్ని దశాబ్దాలు ముందుకెళ్లినా ఇటువంటి భావజాలం ఒక తరానికి ఇంకో తరం అందిపుచ్చుకుంటోంది తప్ప మారట్లేదు. ఆడపిల్లలకు సొంత అభిప్రాయాలు ఉండకూడదు. నచ్చిన బట్టలు వేసుకోకూడదు. వాళ్ల కాళ్లు, వేళ్లని వెర్రెక్కినట్లు చూస్తారు. అమ్మాయికి అది తన మనసుకు నచ్చిన ఒక అందమైన డ్రెస్సు మాత్రమే. కాని చూసేవారి కళ్లలో కామం, వెకిలితనం ముద్దలుగా నిండిపోతే ఆమె తన శరీరాన్ని ఎన్ని వస్త్రాల వెనుక దాచినా నగత్వమే కనిపిస్తుంది. బంగారు తల్లికి బంగారు భవిష్యత్తు ఉండాలంటే సంప్రదాయం పేరిట జరిగే తీవ్రవాదాన్ని సమర్థించడం కాదు. వ్యతిరేకించాలి.
సమాజంలో కలుపు మొక్కలు
పాతకాలపు ఆలోచనా ధోరణినే కండ్లు మూసుకుని ముందుకు తీసుకువెళ్లడం కాదు. ఒక అంశంపై ఎలా ఆలోచించాలి, ఎలా స్పందించాలి. జడ్జిమెంటలా ఉండే తీరు మార్చుకోవాలి. దీనికి మానసిక పరిపక్వత ఏర్పడాలి. చిన్నప్పటి నుండి ఇంటి వాతావరణం పిల్లల్లో ఆ దృక్పథాన్ని ఇవ్వగలగాలి. కాని సంప్రదాయపు కుటుంబాలలో తండ్రి ఇంటి యజమాని, తల్లి ఇంటికి బానిస. ఇంట్లో పుట్టిన ఆడపిల్ల ఇంటి పరువు సింబల్‌. ఆడవారిని తిట్టి, కొట్టగలిగే హక్కు మగవాడికి ఉంటుంది. బాల్యం నుండి నువ్వు మొగోడివిరా అనే అహాన్ని నింపడం. మగవాడిగా పుట్టడం, మగపిల్లలకు జన్మనివ్వడం గొప్ప విషయాలని నమ్మే భావజాలం మధ్య పిల్లలు పెరుగుతారు. అటువంటివారే సోషల్‌ మీడియాలో మహిళల పట్ల అసభ్య రాతలు రాసేది. బూతులతో, తిట్లతో ఈసడింపులతో వారి మనోబలాన్ని ముక్కలు చేసి మళ్లీ వంటింటి వైపుకు పారిపోయేలా వెంట తరుముతుంటారు. ఇటువంటి కలుపు మొక్కలతో సమాజం నిండిపోతోంది. ఇక దాన్ని బాగు చేయడం అసంభవం అయిపోతుంది. సంప్రదాయపు తీవ్రవాద మూకలను తయారు చేసే గట్టి సంకల్పం దేశంలో ఓ అంటు వ్యాధిలా ప్రబలుతోంది.
ఉచ్చులో బంధించి
ఏ విధమైన విజ్ఞానాన్ని సొంతం చేసుకోకుండా కేవలం పూజలు, వ్రతాలు చేసుకుంటూ అన్నిటికీ ఇంట్లోని మగ వారిపై ఆధారపడుతూ, అమాయకత్వంతో, తెలివి తక్కువగా ఉంటూ ఇంట్లో నుంచి బయటకు వెళ్లని ఆడవాళ్లు, భర్త తిట్టినా, కొట్టినా అదే మహా ప్రసాదం అనుకునేవారు, చాలా సంస్కారవంతమైన ఆడవాళ్లు. ఇవి మనుస్మ్మతి ఆధారిత నీతి సూక్తులు. ఇవి అందిపుచ్చుకున్న మగ జెండర్‌ గొప్ప అని మహిళ నమ్ముతుంది. జీవితకాలం తండ్రి, సోదరుడు, భర్త స్థానంలో ఉన్న మగవాడి కనుసన్నల్లో బతకడానికి పాకులాడుతుంది. పితృస్వామ్యంలో మహిళలు కూడా భాగస్వాములే. తన జెండర్‌ తక్కువ కాబట్టి ఇతర మహిళల పట్ల కూడా ఒకరకమైన ఏహ్యత, అస్వీకరణ ఉండటం సర్వ సాధారణం. అటువంటి ఒక నమ్మికే ‘ఆడవారికి స్వతంత్రం ఎందుకు? బయటకు ఎందుకు వెళ్లాలి?’ వంటి భావజాలాన్ని ప్రకటించడానికి కారణం. మన సమాజం మహిళకు యవ్వనాన్ని, అందాన్ని ప్రామాణికతగా ఏర్పరచింది. వీటిని నిలబెట్టుకుంటేనే ఆమెకు ఉనికి. కాబట్టి ఈ రెండిటి చుట్టూ ఆమె జీవితం పరిభ్రమిస్తూ ఉంటుంది. పితృస్వామ్య సమాజం చాలా తెలివితో ఆడవాళ్లను ఈ ఉచ్చులో బంధించింది. అందరూ ఇదే ఉచ్చులో ఉండాలి. ఎవరైనా అటు ఇటుగా, మనిషిగా తన హక్కుల కోసం గొంతు విప్పుతున్నా, ఈ సంప్రదాయాల సాలె గూడును తప్పించుకుని తమకు నచ్చినట్లుగా ఉండాలనుకున్నా వారిపై మగవాళ్లతో పాటుగా పితృస్వామ్య పోకడలను అవపోసనం పట్టిన ఆడవాళ్లు కూడా రాళ్లు విసరడానికి సిద్ధమవుతున్నారు.

చేతన కలిగి ఉండటమే పరిష్కారం
సంస్కృతి, సంప్రదాయం కేవలం ఆడవారిని చట్రంలో ఇరికించడానికి చేసే పన్నాగం మాత్రమే. సింధూరం, మెట్టెలు ధరించకుండా ఉండే మహిళకు భర్త విడాకులు ఇవ్వొచ్చు అని 2022లో ఒక కోర్టు తీర్పునిచ్చింది. మనుస్మ్మతి ప్రభావం ఎక్కడైనా ఉంటోంది. చేతన కలిగి ఉండటం ఒక్కటే పరిష్కారం. తన ఇంట్లో, తన సమాజంలో ఏం జరుగుతోంది, వీటిలో ఉన్న మర్మమేంటనే అవగాహన రావాలి. కుమారి, శ్రీమతి, విధవ ఇన్ని రూపాలు తనకు మాత్రమే ఎందుకు? రకరకాల వేషధారణలు ఆపాదించి వ్యక్తిగా తనకంటూ స్థానం లేకుండా చేస్తున్నారని అర్థం కావాలి. ముస్లిం మహిళలు తమకు బురఖా వద్దని ప్రతిఘటించవచ్చు, వేసుకోవచ్చు. వద్దనడానికి మీరెవరని ధిక్కార స్వరం వినిపించవచ్చు. అది పూర్తిగా మహిళ సొంత నిర్ణయం. దాన్ని గౌరవించాలనే కనీస జ్ఞానం కలిగి ఉండటమే మన దేశ సంస్కృతి, సంప్రదాయం కావాలి. అడుగడుగునా రాబందుల్లా మోరల్‌ పోలీసింగ్‌ భూతాలు వెంట తరుముతుంటే ఎదురు నిలబడే ఆత్మస్థైర్యం కావాలి. ఎదురు ప్రశ్నించే రౌద్ర స్వరాలు, వందలు, వేలు, లక్షలై ప్రతిధ్వనించాలి. సంప్రదాయపు మంత్రాలు పఠించి ఆడవాళ్లని అణచివేసే మృగాలు తోకముడవాలి.
ఆలోచనా తీరు మారాలి
లైంగిక దాడి, మొలెస్టేషన్‌. ఇది పూర్తిస్థాయి సెక్సువల్‌ ఇంటర్‌ కోర్సు కాకపోవచ్చు. కాని ఆమె శరీరాన్ని తాకడం, ఇవన్నీ చాలా సాధారణ అంశాలు మహిళల జీవితంలో. చిన్నప్పుడు తన పట్ల దగ్గరి చుట్టాలు, ఇంట్లోని సభ్యులు, బయటి వ్యక్తులు తన శరీరాన్ని కామవాంఛతో ముట్టుకున్నారన్న జ్ఞాపకం, గుర్తు, ఆమె మనో ధైర్యాన్ని ఛిన్నాభిన్నం చేస్తాయి. ఆడపిల్లగా పుట్టినందుకు బాధ, తన శరీరంపై తనకే వెగటు వేయక మానదు. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన దగ్గరి చుట్టం గురించి పైకి చెప్తే కుటుంబ పరువు పోతుంది. ఇంట్లో అందరూ కలిసి ఆ మొలెస్టర్‌ మగ వాడిని కాపాడటంలో ఏకం అవుతారు. సంప్రదాయపు కుటుంబాలలో మగవాళ్లు అలానే ప్రవరిస్తారు. ఆడపిల్లలు నోటి నుంచి శబ్దం రాకుండా ఉండటమే పరువు గల ఆడపిల్ల చేయవలసింది అని ఆమె నమ్మేలా చేస్తారు. వారిని బయట స్కూలు, కాలేజి, పని ప్రదేశాలు ఎక్కడైనా సరే మగవారి ప్రవర్తన ఎలా ఉన్నా కిమ్మనకుండా ఉండాలి. ‘మీటూ’ లాటి వాటిలో గొంతు వినిపించారా, చెడిపోయిన ఆ సదరు మహిళ పరమ పవిత్రుడైన మగవాడిపై బురద జల్లాలని చూస్తోందని సంప్రదాయపు జాగిలాలు ఎగబడి నిలువునా ప్రాణాలు తీసేస్తాయి. మనుషుల ఆలోచనా తీరు మారాలి. మార్పు నిరంతరం జరుగుతూనే ఉండాలి. అప్పుడే ఆడపిల్లలు కూడా జీవించగలుగుతారు.
ఆమె గళమే ఒక గర్జన
చిన్మయి శ్రీపాద… మధురమైన గాత్రమే కాదు.. మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై నిర్భయంగా తన కటువైన స్వరాన్ని వినిపించడంలోనూ వెనక్కి తగ్గరు. ‘ఆడపిల్లలకు స్వతంత్రం ఎందుకు? వారికి రాత్రి పూట బయట ఏం పని? అంటూ ఓ సీనియర్‌ నటి చేసిన వ్యాఖ్యలకు తనదైన శైలిలో ప్రతిస్పందించి ఖండించారు. ఆడవారి పట్ల ఇటువంటి భావజాలం కలిగిన దేశంలో తాను ఆడపిల్లగా పుట్టినందుకు బాధను వ్యక్తం చేశారు. అలా అనడాన్ని తప్పుపట్టి భారత దేశాన్ని కించపరిచిందంటూ హెచ్‌సీయూ విద్యార్థి ఆమెపై కేసు దాఖలు చేశారు. అప్పటి నుండి సోషల్‌ మీడియాలో ఆమెను విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. అందులో బూతులు, తిట్లు, లైంగికదాడి బెదిరింపులు ఎన్నో ఉన్నాయి. అయినా ఆమె తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా వ్యక్తం చేస్తూ మరింత విశ్లేషణలతో వీడియోలలో ఆలోచన రేకెత్తించే విధంగా మాట్లాడుతున్నారు. సరైన ఆలోచనా ధృక్పథానికి ఆమె మార్గం చూపిస్తున్నారు.
– శ్రీదేవి కవికొండల

Spread the love