ఎందుకింత భయం?

Why fear?భయపడుతున్నట్టున్నారు..! సమస్త వనరులు, సకల సంపదలు, సర్వాధికారాలు వారి కనుసన్నల్లోనే ఉన్నాయి కదా.. అయినా ఎందుకీ భయం? బహుశా వారికి విజయం పట్ల నమ్మకం సన్నగిల్లుతోంది కాబోలు..! తమ పదేండ్ల పాలనా వైఫల్యాలు ప్రజాజీవితాన్నీ, ప్రజాస్వామ్యాన్నీ సంక్షో భంలో ముంచెత్తుతుంటే… రామాలయ రాజకీయాలు, శ్రీకృష్ణుని నామస్మరణలు మాత్రమే ఓట్లు తెచ్చిపెట్టబోవని బోధపడింది కాబోలు..! ప్రశ్నించేవారి గొంతునొక్కడం, ప్రతిపక్షాలను నిలువునా చీల్చడం, వారికి డబ్బుతో సహా ఏ వనరులూ అందుబాటులో లేకుండా చేయడం, అక్రమ అరెస్టులకు పాల్పడం.. ఇలా ఒకటేమిటి సకల దుర్వినియోగాలకూ తెగబడుతున్నారు. ఆ మధ్య హేమంత్‌ సోరెన్‌, తాజాగా అరవింద్‌ కేజ్రీవాల్‌… సరిగ్గా సార్వత్రిక ఎన్నికల ముందు ఇద్దరు విపక్ష సీఎంలను అరెస్టు చేశారు. ఇదేమీ మొదలూ కాదు, చివరా కాదు…దీనికి ముందూ ఇలాంటి ఘటనలు ఉన్నాయి. వెనుక కూడా ఉంటాయి. ఇదంతా సాధారణమనే అభిప్రాయం దాదాపు స్థిరపడి పోయింది. కాకపోతే ఇలా వరుసగా ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్ష నేతలను వేటాడం ఎప్పుడూ ఏలినవారిలోని నిరాశా నిస్పృహలనే సూచిస్తుంది. ఇప్పుడూ అంతే…లేదంటే మూడోసారీ మాదే విజయమని జబ్బలు చరుచుకుంటున్నవారికి ఇంతటి దిగజారుడుతనమెందుకు?
తమ నిజాయితీ ప్రశ్నార్థకమైన ప్రతిసారీ ప్రత్యర్ధులను అప్రతిష్టపాలు చేయజూసే దుర్బుద్ధిని సైతం ఈ దుశ్చర్యలు ఎత్తిచూపుతున్నాయి. ఎలక్టోరల్‌ బాండ్లు రాజ్యాంగ వ్యతిరేకమంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన వెంటనే ”సీఏఏ”ను అమలులోకి తెచ్చి చర్చనీయాంశంగా మార్చారు. ఆతర్వాత బాండ్లరూపంలో వీరు భారీగా విరాళాలు దండుకున్న వ్యవహారం మార్చి 14న వెలుగులోకి రాగా ఆ మరుసటిరోజే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేశారు. తాజాగా ఆ బాండ్ల వివరాలు పూర్తిగా వెల్లడించడంలో ఇన్నాళ్లుగా పిల్లిమొగ్గలేస్తున్న ఎస్‌బీఐ చివరికి కోర్టు ఆగ్రహంతో యునిక్‌ నెంబర్లతో సహా అందజేసిన మరుక్షణమే కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు. బద్దలయిన తమ బాండ్ల బండారం నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కూడా ఈ చర్యల వెనుక ఒక వ్యూహంగా మనకు కనిపిస్తోంది. ప్రత్యర్ధులను రాజకీయంగా నేరుగా ఎదుర్కోలేక ఇలా దొడ్డిదారిన నిర్బంధాలకు గురిచేయడం వీరికొక ఆనవాయితీగా మారిపోయింది. తద్వారా ప్రత్యర్థి పార్టీల నేతలను లొంగదీసుకోవడం, ఎప్పుడు తమపై ఎటువంటి కేసులు నమోదవుతాయోననే భయాందోళనలో ముంచేయడం ఒక విధానంగా అమలు పరుస్తున్నారు.వెరసి లొంగినవారు పునీతులుగా మారడం, లొంగనివారు కటకటాలపాలవడం వీరి ఏలుబడికి ప్రతీకలుగా చెలామణీ అవుతున్నాయి. ఇక్కడ కేజ్రీవాల్‌ దోషా, నిర్దోషా అనే సంగతి కాసేపు పక్కనబెడితే…అతను వారికి లొంగివుంటే ఈ అరెస్టు జరిగేదా?
నిజంగా తమ పాలనలోని నిజాయితీ, సామర్థ్యాల మీద నమ్మకముంటే వీరికి ఇంతటి అగత్యమెందుకు? దీన్నిబట్టి వీరిని ఓటమి భయం ఎంతగా వెంటాడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఎంత భయపడకపోతే చివరికి ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ బ్యాంకు అకౌంట్లను సైతం సీజ్‌ చేస్తారూ..? వీరేమో అక్రమంగా భారీమొత్తంలో రాజకీయ విరాళాలను గుండుగుత్తగా సొమ్ముచేసుకోవచ్చు. పైగా ప్రభుత్వ వనరులను కూడా యధేచ్చగా ప్రచారానికి వాడుకోవచ్చు. అనేకానేక ఫిర్యాదుల తరువాత ”వికసిత భారత్‌ సంపర్క్‌” పేర ప్రభుత్వ నిధులతో వీరు సాగిస్తున్న ప్రచారాన్ని నిలిపేవేయాల్సిందిగా ఈసీ ఆదేశించడం ఇందుకో తాజా ఉదాహరణ. కాగా, ప్రతిపక్షాలు మాత్రం వారికున్న అరకొర నిధుల్ని కూడా ఉపయోగించడానికి వీల్లేదు. ఇదెక్కడి న్యాయం? ఎన్నికల ప్రచారం కాదుగదా, రైలు టిక్కెట్లకూ తమకు డబ్బులు లేకుండా చేశారని కాంగ్రెస్‌ అగ్రనేతలు వాపోతున్నారు. ఇలా ప్రత్యర్ధుల ఆర్థికవనరుల మీద కూడా దాడికి పాల్పడుతున్నారంటే ఇది దేనికి సూచిక దీని ఉద్దేశ్యం వారికి ఎన్నికల్లో పాల్గొనే అవకాశాలను నిర్వీర్యం చేయడమే కదా! ఇక తమ బెదిరింపుల ద్వారా ఇండియా కూటమిలో అనైక్యత సృష్టించడం, కుదరకపోతే నిలువునా చీల్చడం వంటివి సరేసరి. మహారాష్ట్ర, బెంగాల్‌ రాజకీయాల్లో ఇందుకు స్పష్టమైన ఉదాహరణలు కనిపిస్తాయి.
మూడోసారి కూడా తామే అధికారలోకి రావాలని ఏలినవారు ముచ్చటపడితే ఎవరమూ కాదనలేం. కానీ అందుకు ఇంతకు దిగజా రాలా? అయినా ఎన్నికల్లో రాజకీయ పార్టీల గెలుపోటములను నిర్ణయించాల్సింది ప్రజలు.
కానీ ప్రజలకు ఆ స్వేచ్ఛ, అవకాశం ఉన్నాయా? స్వేచ్ఛగా నిస్పక్షపాతంగా జరగాల్సిన ప్రజాస్వామ్య పోరును కేవలం ఓ పోల్‌ మేనేజ్‌మెంటుగా మార్చారు. పోటీ నిస్పక్ష పాతంగా జరగాలంటే పోటీదారు లందరికీ సమానావకాశాలుండాలి. ఆ అవకాశాలను కల్పించాల్సిన, కాపాడాల్సిన రాజ్యాంగ వ్యవస్థ లన్నిటినీ తమ జేబుసంస్థలుగా ”తీర్చిదిద్దారు”. అందుకు ‘ఈసీ’ నుంచి ‘ఈడీ’ దాకా ఏదీ మినహాయింపు కాదు. దాని ఫలితమే ఈ అక్రమ అరెస్టులు, అనైతిక అప్రజాస్వామిక చర్యలు, దాడులూ దౌర్జన్యాలు… గెలుపు పట్ల ఎన్ని భయాలు కమ్ముకుంటే ఇన్ని దారుణాలకు తెగిస్తున్నారో కదా..!

Spread the love