– పోలీసులకు సమాచారం ఇవ్వడంలో జాప్యం ఎందుకు…!
నవతెలంగాణ -ముధోల్: బాసర ట్రిపుల్ ఐటీలో ఏదో ఒక ఘటన చోటు చేసుకోవటంతో ట్రిపుల్ ఐటీ ప్రతిష్టను దిగదారుస్తున్నారన్న అపవాదు ట్రిపుల్ ఐటీ యాజమాన్యం మూటకట్టుకోవటం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకెళ్తే..బాసర ట్రిపుల్ ఐటీలో మొన్ననే అల్పాహారంలో బొద్దింక వచ్చిన ఘటన వారం గడవక ముందే తాజాగా నిన్న మధ్యాహ్నం విద్యార్థిని అనుమాన స్థితిలో భవనం పైనుంచి పడి గాయాల పాలైన సంఘటన కలకలం రేపింది. నిన్నటి ఘటనలో ట్రిపుల్ ఐటీ అధికారులు ఘటన జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వలేదన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు చట్ట ప్రకారం పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి, సంబంధించిన అధికారులకు ఉంటుంది.
ఈ విషయం ట్రిపుల్ ఐటీ అధికారులకు తెలియదేమి కాదు. అయితే ఘటన జరిగిన పోలీసులకు సకాలంలో సమాచారం అందలేనట్లు తెలుస్తుంది. ఈ సంఘటన పై ట్రిపుల్ ఐటీ అధికారులు, మీడియా కూడా వివరాలు తెలుపకపోవడం వల్ల అనుమానాలకు తావించినట్లయింది.దింతో ఘటనపై స్థానికంగా వివిధ రకాలుగా ప్రచారం జరిగింది. తమకు సమాచారం లేకపోయినప్పటికీ పోలీసులు మాత్రం తమకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన సమాచారం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పి జానకి షర్మిల ఆదేశాల మేరకు నిన్న సాయంత్రం బైంసా ఎఎస్పి పత్తిపాక సాయికిరణ్ తన సిబ్బందితో ట్రిపుల్ ఐటీకి వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఘటన గల కారణాలను ట్రిపుల్ ఐటీ వీసీ గోవర్ధన్ ను అడిగితెలుసుకున్నారు.
ఈ ఘటన కు సంబంధించిన దర్యాప్తును ఏఎస్పీ ప్రత్యేకంగా చూస్తున్నట్లు సమాచారం. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం జరిగితే..రాత్రి బాసర పోలీసులకు ట్రిపుల్ ఐటీ అధికారులు ఘటన జరిగిన వివరాలను లిఖితపూర్వకంగా అందజేశారు. ఆలస్యంగా సమాచారం ఇవ్వడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, అనే వాటిపై స్పష్టత రావడం లేదు. ట్రిపుల్ ఐటీ అధికారులు సంఘటనా వివరాలను గోప్యంగా ఉంచటంపై అనుమానాలకు మరింత ఆజ్యం పోసినట్టు అయింది. ఏది ఏమైనా చట్టాన్ని గౌరవించాల్సిన సంబంధిత అధికారులే పోలీసులకు సమాచారం చేరవేయడం లో జాప్యం చేయటం పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈవిషయంపై బాసర పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ అయిన సిఐ దీపక్ నవతెలంగాణతో ఫోన్ లో గురువారం ఉదయం మాట్లాడారు. ట్రిపుల్ ఐటీ అధికారులు ఈ ఘటనపై బుధవారం రాత్రి లిఖితపూర్వకంగా తెలిపారని పేర్కొన్నారు. తమకు తెలిసిన సమాచారం మేరకే బుధవారం సాయంత్రం ట్రిపుల్ ఐటీ కి వెళ్లడం జరిగిందని అన్నారు.



