పుంజుకుంటారా?!

Will you bounce back?!– విండీస్‌తో భారత్‌ రెండో టీ20 నేడు
– సిరీస్‌ సమంపై హార్దిక్‌సేన గురి
రాత్రి 8 నుంచి డిడి స్పోర్ట్స్‌లో..
ఐపీఎల్‌ (ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌) స్టార్స్‌ వర్సెస్‌ సీపీఎల్‌ (కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌) స్టార్స్‌గా పరిగణిస్తున్న ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో తొలి పంచ్‌ కరీబియన్లు విసిరారు. స్వల్ప స్కోర్ల థ్రిల్లర్‌లో ఓ బౌండరీ ఇరు జట్లకు మధ్య వ్యత్యాసంగా నిలిచింది. టెస్టు, వన్డేల్లో కరీబియన్‌ శిబిరంలో పస తగ్గినా.. టీ20ల్లో ఆ జట్టు అరివీర భయంకరమే. నాణ్యమైన విండీస్‌ జట్టుపై పొట్టి ఫార్మాట్‌లో సత్తా చాటేందుకు హార్దిక్‌ సేన సిద్ధమవుతోంది. యువ జట్టుతో 2024 టీ20 ప్రపంచకప్‌ సన్నద్ధతకు టీమ్‌ ఇండియా సై అంటోంది!.
2023 వన్డే వరల్డ్‌కప్‌ ఏడాదిలో టీ20 సిరీస్‌కు పెద్దగా ప్రాధాన్యత లేదు అనిపించింది. కానీ భారత్‌, విండీస్‌ టీ20 సిరీస్‌ అందుకు భిన్నమైన అనుభూతి అందిస్తోంది!. తొలి టీ20ల్లోనే అందరి దృష్టిని ఆకర్షించిన భారత్‌, విండీస్‌ యువ స్టార్స్‌.. ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో ఆధిపత్య పోరుకు తెరతీశారు. 2024 టీ20 ప్రపంచకప్‌ వెస్టిండీస్‌, అమెరికాల్లోనే జరుగనుండటంతో టీమ్‌ ఇండియా ఈ సిరీస్‌ను సవాల్‌గా తీసుకుంటుంది. యువ ఆటగాళ్లకు ఇక్కడి పిచ్‌లు, పరిస్థితులపై అవగాహన కలిగేందుకు ఈ సిరీస్‌ను కీలకంగా భావిస్తుంది. ఇదే సమయంలో టెస్టు, టీ20ల్లో తేలిపోయిన ఆతిథ్య విండీస్‌.. అచ్చొచ్చిన టీ20 ఫార్మాట్‌లో సిరీస్‌ విజయం దిశగా అడుగులు వేస్తోంది. సమంపై హార్దిక్‌సేన, ఆధిక్యంపై పావెల్‌ గ్యాంగ్‌ కన్నేసిన వేళ భారత్‌, వెస్టిండీస్‌ రెండో టీ20 మ్యాచ్‌ నేడు.
కుర్రాళ్లకు పరీక్ష
తొలి టీ20లో భారత బ్యాటర్లు స్లో వికెట్‌పై తడబడ్డారు. అరంగేట్ర బ్యాటర్‌ తిలక్‌ వర్మ మినహా మరో ఆటగాడు ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడిన తిలక్‌ వర్మ.. మ్యాచ్‌ను భారత్‌ పరం చేసినట్టే కనిపించాడు. కానీ అతడి నిష్క్రమణ తర్వాత పరిణామాలు వేగంగా మారిపోయాయి. రెండో టీ20లోనూ తిలక్‌ వర్మ భారత్‌కు కీలకం కానున్నాడు. ఇక కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య, వైస్‌ కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌లు ఇటు వ్యక్తిగతంగా మెరుగైన ప్రదర్శన చేయటంతో పాటు జట్టుగా ముందుకెళ్లటంపై దృష్టి నిలిపారు. సూర్యకుమార్‌ యాదవ్‌ ఇష్టమైన పొట్టి ఫార్మాట్‌లోనైనా ధనాధన్‌ మోత మోగించాలని ఎదురు చూస్తున్నాడు. ఇషాన్‌ కిషన్‌, శుభ్‌మన్‌ గిల్‌, సంజు శాంసన్‌లు సైతం మంచి ఇన్నింగ్స్‌లు ఆడాల్సి ఉంది. గత సీజన్‌ ఐపీఎల్‌ హీరో యశస్వి జైస్వాల్‌ బెంచ్‌పై అందుబాటులో ఉన్నాడు. టెస్టుల్లో కదం తొక్కిన యశస్వి జైస్వాల్‌కు నేడు రెండో టీ20లో అవకాశం దక్కుతుందేమో చూడాలి. తిలక్‌ వర్మ శైలిలోనే నిలకడగా ఊచకోత ఇన్నింగ్స్‌లు ఆడటంలో యశస్వి దిట్ట. బౌలింగ్‌ విభాగంలో ఇద్దరు స్పిన్నర్లనే నేడు ఎంచుకునే వీలుంది. కుల్దీప్‌, చాహల్‌ ఉండగా.. అక్షర్‌ పటేల్‌పై వేటు పడొచ్చు. ముకేశ్‌ కుమార్‌, అర్షదీప్‌ సింగ్‌లు డెత్‌ ఓవర్లలో మెరుస్తున్నా.. ఇంకా మెరుగైన ప్రదర్శన అవసరం. ఉమ్రాన్‌ మాలిక్‌, అవేశ్‌ ఖాన్‌లలో ఒకరు నేడు తుది జట్టులో నిలిచే అవకాశం కనిపిస్తోంది. లేదంటే, యశస్వి జైస్వాల్‌ రూపంలో అదనపు బ్యాటర్‌ను ఎంచుకునే అవకాశం సైతం లేకపోలేదు.
జోరుమీదున్న విండీస్‌
టెస్టులు, వన్డేలు అటుంచితే.. టీ20ల్లో కరీబియన్లది భిన్నమైన జట్టు. ‘టీమ్‌ ఆఫ్‌ బౌండరీ హిట్టర్స్‌’గా విండీస్‌కు ఘనమైన పేరుంది. పొట్టి ఫార్మాట్‌లో స్ట్రయిక్‌రొటేషన్‌కు విలువ లేదని నిరూపించిన విండీస్‌.. బాదుడుతోనే అసమాన విజయాలు సాధించింది. సీపీఎల్‌లో దుమ్మురేపిన కుర్ర క్రికెటర్లు జట్టులో ఉండగా ఆతిథ్య జట్టు సిరీస్‌లో ఆధిక్యంపై కన్నేసింది. కెప్టెన్‌ రోవ్‌మాన్‌ పావెల్‌, షిమ్రోన్‌ హెట్‌మయర్‌, నికోలస్‌ పూరన్‌ సహా కైల్‌ మేయర్స్‌, బ్రాండన్‌ కింగ్‌లు ప్రమాదకర బ్యాటర్లు. తమదైన రోజు ఆకాశమే హద్దుగా చెలరేగుతారు. బంతితోనూ అల్జారీ జొసెఫ్‌, షెఫర్డ్‌, మెక్‌కాక్‌లకు తోడు ఒడీన్‌ స్మిత్‌ ప్రభావశీల బౌలర్లు. ఆరంభ మ్యాచ్‌లోనే విజయం, ఫేవరేట్‌ ఫార్మాట్‌ కావటంతో రెండో టీ20లోనూ విజయమే లక్ష్యంగా కరీబియన్లు బరిలోకి దిగుతున్నారు. ఈ గ్రౌండ్‌లో చెత్త రికార్డు ఒక్కటే ఆతిథ్య జట్టుకు అతిపెద్ద ప్రతికూలత!.

పిచ్‌ రిపోర్టు
ప్రొవిడెన్స్‌ స్టేడియంలో ఆతిథ్య విండీస్‌కు మంచి రికార్డు లేదు. ఇక్కడ జరిగిన 11 టీ20ల్లో వర్షం కారణంగా మూడు మ్యాచుల్లో ఫలితం తేలలేదు. మిగతా మ్యాచుల్లో ఏకంగా ఐదింట కరీబియన్‌ జట్టు ఓటమి చవిచూసింది. ఈ రికార్డు నేడు భారత్‌కు సానుకూలం కానుంది. సహజంగా ఈ పిచ్‌పై స్పీడ్‌స్టర్స్‌కు సక్సెస్‌ అవకాశం ఎక్కువ. మ్యాచ్‌ సాగుతున్న కొద్ది పిచ్‌ నెమ్మదిగా మారి పరుగుల వేట కష్టమవుతుంది. అంతిమంతగా ఇది స్పిన్నర్లకు ఉపకరిస్తుంది. ఇక్కడ సగటు తొలి ఇన్నింగ్స్‌ స్కోరు 123 పరుగులు. టాస్‌ నెగ్గిన తొలుత బ్యాటింగ్‌ ఎంచుకునే అవకాశం కనిపిస్తుంది.
వర్షం సూచన
భారత్‌, వెస్టిండీస్‌ రెండో టీ20కు వర్షం సూచనలు ఎక్కువగా ఉన్నాయి. విండీస్‌ కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటలకు మ్యాచ్‌ ఆరంభం అవుతుంది. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నాం వరకు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సరిగ్గా మ్యాచ్‌ జరిగే సమయంలోనే 40 శాతం వర్షం కురువనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. మ్యాచ్‌కు ముందే వర్షం అంతరాయం కలిగిస్తే.. కుదించిన ఓవర్లతో రెండో టీ20 జరిగేందుకు ఆస్కారం ఎక్కువ.
తుది జట్లు (అంచనా)
భారత్‌ : ఇషాన్‌ కిషన్‌, శుభ్‌మన్‌ గిల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్య (కెప్టెన్‌), సంజు శాంసన్‌, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, అర్షదీప్‌ సింగ్‌, యుజ్వెంద్ర చాహల్‌, ముకేశ్‌ కుమార్‌.
వెస్టిండీస్‌ : బ్రాండన్‌ కింగ్‌, కైల్‌ మేయర్స్‌, జాన్సన్‌ చార్లెస్‌, నికోలస్‌ పూరన్‌, రోవ్‌మాన్‌ పావెల్‌ (కెప్టెన్‌), షిమ్రోన్‌ హెట్‌మయర్‌, రోమారియో షెఫర్డ్‌, జేసన్‌ హోల్డర్‌, అకీల్‌ హుస్సేన్‌, అల్జారీ జొసెఫ్‌, ఒబెడ్‌ మెక్‌కారు.

Spread the love