24 గంటల్లో కూడవెళ్లి వాగుకు నీళ్లు విడుదల చేయాలి

24 గంటల్లో కూడవెళ్లి వాగుకు నీళ్లు విడుదల చేయాలి– చేయకుంటే మేమే గేట్లు ఎత్తుతాం : ఎమ్మెల్యే హరీశ్‌రావు
– కాలం తెచ్చిన కరువు కాదు… కాంగ్రెస్‌ తెచ్చిన కరువు
– ఎండిన, వడగండ్లకు నష్టపోయిన పంట ఎకరాకు రూ. 25వేలు పరిహారం ఇవ్వాలి
– రైతులను ఆదుకోవాలని కలెక్టర్‌ మను చౌదరికి వినతిపత్రం అందించిన హరీశ్‌ రావు
నవతెలంగాణ-సిద్దిపేట
దుబ్బాక నియోజకవర్గంలోని కూడవెళ్లి వాగుకు వెంటనే నీళ్లు విడుదల చేయాలని, మంత్రులు, ఇరిగేషన్‌ అధికారుల దష్టికి తమ ఎమ్మెల్యే ప్రభాకర్‌ రెడ్డి తీసుకెళ్లారని, 24 గంటల్లో వాగుకు నీళ్లు విడుదల చేయని పక్షంలో మల్లన్న సాగర్‌ను ముట్టడించి, తామే.. గేట్లు ఎత్తుతామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌ రావు హెచ్చరించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ మను చౌదరికి బీఆర్‌ఎస్‌ పార్టీ పక్షాన రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే హరీశ్‌రావు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌ రెడ్డి బోగస్‌ మాటలను పక్కనపెట్టి రైతులు పండించిన పంటలకు బోనస్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కెేసీఆర్‌ పొలం బాట పట్టిన తరువాతనే కాంగ్రెస్‌ ప్రభుత్వం పంటల విషయంలో కండ్లు తెరిచిందన్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన కరువని తెలిపారు. కేసీఆర్‌ ఈ నెల 5న కరీంనగర్‌కు వెళ్తున్నారని, అందుకే ప్రభుత్వం గాయత్రి పంప్‌ హౌజ్‌ నుంచి నీరును ఎత్తిపోస్తుందని, నాగార్జునసాగర్‌ కాలువ నుంచి నీటిని విడుదల చేస్తుందని అన్నారు. ప్రభుత్వ నీటి నిర్వహణ, విద్యుత్‌ వైఫల్యం వల్లనే పంట నష్టం జరిగిందని తెలిపారు. దొంగలు పడ్డ ఆరునెలలకు కుక్కలు మొరిగినట్టుగా ఉంది సర్కారు తీరు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిపోయిన, వడగండ్ల వానకు నష్టపోయిన పంటలకు రూ.25 వేల నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రూ.2 లక్షల రుణమాఫీ, రూ.15 వేల రైతుబంధు, పంటలకు రూ.500 బోనస్‌ పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్నదాతలను దగా చేసిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో ఒక్క మంచి పని కూడా చేయకుండా పథకాల్లో కోతలు పెట్టి వికృత ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 200 మంది రైతుల ఆత్మహత్యలపై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అవహేళనగా మాట్లాడటం సరికాదన్నారు. విపక్ష పార్టీ నాయకులపై కేసులు పెట్టడంపై ఉన్న శ్రద్ధ రైతులను ఆదుకోవడంపై కాంగ్రెస్‌కు లేదని ఫైర్‌ అయ్యారు. కేసీఆర్‌ హయాంలో ఒక్క ఎకరా ఎండలేదని, కాంగ్రెస్‌ వచ్చాకే పంటలు ఎండుతున్నాయని చెప్పారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో రైతులు కాంగ్రెస్‌ పార్టీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ హామీల అమలుపై చర్చకు సిద్ధమని కాంగ్రెస్‌ మంత్రులకు సవాల్‌ విసిరారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌ పర్సన్‌ రోజా రాధాకష్ణ శర్మ, బీఆర్‌ఎస్‌ నాయకులు నాగిరెడ్డి, గుండు భూపేష్‌, రాజనర్సు, రవీందర్‌ రెడ్డి, వేణుగోపాల్‌ రెడ్డి, మాణిక్య రెడ్డి, బాలమల్లు, సారయ్య, సోమిరెడ్డి, రమేష్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love