అతివేగంతో బైక్‌ను ఢీకొీట్టిన లారీ

అతివేగంతో బైక్‌ను ఢీకొీట్టిన లారీ– ఇద్దరు పదో తరగతి విద్యార్థుల మృతి
– మొన్ననే పరీక్షలు పూర్తి.. ఇంతలోనే ప్రమాదం
– జహీరాబాద్‌లో ఘటన
నవతెలంగాణ-జహీరాబాద్‌
అతివేగంతో వచ్చిన ఓ లారీ బైక్‌ను ఢకొీట్టడంతో ఇద్దరు పదో తరగతి విద్యార్థులు మృతి చెందారు. మొన్నటి వరకు పరీక్షలు రాసిన వారిద్దరూ.. పరీక్షలు పూర్తయిన రెండ్రోజులకే ప్రమాదంలో మరణించడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పట్టణంలోని రైల్వే ఓవర్‌ బ్రిడ్జీ వద్ద మంగళవారం ఉదయం జరిగింది. జహీరాబాద్‌ ఎస్‌ఐ శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మోమిన్‌ మహిలకు చెందిన వరుసకు అన్నదమ్ములయ్యే యువకులు.. రిహాన్‌(18), ఆదిల్‌(16).. మంగళవారం ఉదయం తమ మామకు సంబంధించిన యమహా బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీఏ చెక్‌పోస్ట్‌ నుంచి అతివేగంగా వస్తున్న లారీ ఆ యువకులు ప్రయాణిస్తున్న బైక్‌ను రైల్వే ఓవర్‌ బ్రిడ్జి బాగా రెడ్డి విగ్రహం వద్ద ఢీకొీట్టింది. ఈ ప్రమాదంలో ఆదిల్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. రిహాన్‌కు స్థానిక కమ్యూనిటీ వైద్యశాలలో ప్రథమ చికిత్స చేసి.. మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని వైద్యశాలకు తరలించగా.. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఒకే కుటుంబానికి చెందిన వరుసకు అన్నదమ్ములయ్యే ఇద్దరు యువకులు మృతి చెందడంతో.. పట్టణంలోని మైనార్టీ సోదరులు, మృతుల సహచర విద్యార్థులు భారీ సంఖ్యలో ఆస్పత్రికి వచ్చి బోరున విలపించారు. దాంతో ఆ ప్రాంతమంతా శోకసంద్రంలా మారింది. కాగా మృతదేహాలను స్థానిక కమ్యూనిటీ వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించి.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. కాగా, విషయం తెలుసుకున్న డీఎస్పీ రామ్మోహన్‌ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను పరిశీలించారు. ప్రధానంగా ఆర్టీఏ చెక్‌పోస్ట్‌ నుంచి వస్తున్న వాహనాలు, రాంనగర్‌ వైపు దారి మళ్లిస్తున్న వాహనాలు కనిపించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు డీఎస్పీ తెలిపారు. ఈ ఘటనా స్థలాన్ని ఇదివరకే రోడ్డు ప్రమాదాల సంఘటనా స్థలంగా గుర్తించినట్టు చెప్పారు. బైపాస్‌ రోడ్డు ఏర్పాటు చేసిన అనంతరం ప్రమాదాలు కొంచెం తగ్గినట్టు తగ్గి.. మళ్ళీ ప్రారంభం అయ్యాయన్నారు. రైల్వే ఓవర్‌ బ్రిడ్జి పనులు పూర్తయితే వాహనాల రద్దీ ఇంకా పెరుగుతుందని, కాబట్టి ఆర్‌అండ్‌బీ అధికారులతో కలిసి ఒక నివేదికను తయారు చేయనున్నట్టు చెప్పారు. ప్రాణాలు చాలా అమూల్యమైనవి, రెండు నిమిషాలు ఆలస్యమైనా.. జాగ్రత్తగా నిబంధనలు పాటిస్తూ ప్రయాణాలు చేయాలని సూచించారు. ఆయన వెంట సీఐ రవి, ఎస్‌ఐ శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.రోడ్డు ప్రమాదాలకు నిలయంగా రైల్వే ఓవర్‌ బ్రిడ్జి..రైల్వే ఓవర్‌ బ్రిడ్జి రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. ఆర్టీఏ చెక్‌పోస్ట్‌ నుంచి వస్తున్న వాహనదారులకు.. ఈ ఓవర్‌ బ్రిడ్జి వద్ద క్రాసింగ్‌ చేస్తున్న వాహనాలు.. దగ్గరికి వచ్చే వరకు కనిపించకపోవడంతో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. పట్టణంలోని వివిధ వార్డులతోపాటు శివాజీ విగ్రహం నుంచి పెద్దసంఖ్యలో ప్రజలు ద్విచక్ర వాహనాలపై జాతీయ రహదారిపైకి వెళ్తుంటారు. ఈ క్రమంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Spread the love