నవతెలంగాణ – చిన్నకోడూరు : దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా జీవితంపై విరక్తి చెంది ఇంటి నుండి వెళ్ళిపోయిన మహిళ బావిలో శవమై తేలిన ఘటన చిన్నకోడూరు మండల పరిధిలోని మాచాపూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. చిన్నకోడూరు ఎస్ఐ శివానందం, మృతురాలి అన్న బాలయ్య కథనం ప్రకారం మాచాపూర్ గ్రామానికి చెందిన ఎర్రోల్ల రంగవ్వ(56)కు 40సంవత్సరాల క్రితం వివాహమైంది. టిబి మరియు సొమ్మ వ్యాధిగ్రస్తురాలు అని తెలిసి భర్త వదిలిపెట్టగా నాటినుండి అన్న బాలయ్య ఇంట్లో ఉంటుంది. ఈ క్రమంలో దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా జీవితంపై విరక్తి చెంది గురువారం రంగవ్వ ఎవరికి చెప్పకుండా ఇంటి నుండి వెళ్ళిపోయింది. రంగవ్వ కోసం కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. బావిలో శవం ఉందని ఫోన్ ద్వారా సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెంటనే వెళ్ళి చూసి రంగవ్వ అని గుర్తించారు. బాలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివానందం తెలిపారు.