న్యూఢిల్లీ : మణిపూర్‌లోని కుకీ కమ్యూనిటీకి చెందిన మహిళలు బుధవారం అమిత్‌షా నివాసం ఎదుట ఆందోళనకు దిగారు. రాష్ట్రంలో రెండు వర్గాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను అడ్డుకోవాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పునరుద్ధరిస్తామని ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన సమయంలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్ర పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదని, తమ కమ్యూనిటీపై దాడులు కొనసాగుతున్నాయని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. తమ జీవితాలు ప్రమాదంలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని, అమిత్‌షాలు జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
బీజేపీ ప్రభుత్వ అసమర్థ నిర్వాకంతో మణిపూర్‌లో తలెత్తిన హింసకు తాజాగా మంగళవారం బిఎస్ఎఫ్ జవాన్ ఒకరు మరణించగా, మరో ఇద్దరు ఆర్మీ జవాన్లు గాయపడ్డారు. ప్రభుత్వం రగిలించిన రిజర్వేషన్ల చిచ్చు, అటవీ ప్రాంతం నుంచి మైనార్టీ గిరిజనులను గెంటివేసేందుకు చేసిన యత్నాలతో తలెత్తిన జాతి ఘర్షణలు దావానలంలా విస్తరిస్తోంది.