వర్క్‌ ఫ్రమ్‌ హౌమ్‌ జాబ్‌ ఇస్తామని మోసం

– రూ.1.25 లక్షలు అకౌంట్‌లో వేయించుకుని బురిడీ
– పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
నవతెలంగాణ-శంషాబాద్‌
వర్క్‌ ఫ్రమ్‌ హౌమ్‌ ఉద్యోగం కోసం వాట్సాప్‌ ప్రకటన చూసి వారిని ఆన్‌లైన్‌లో సంప్రదించిన యువతి.. పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకుంది. చివరికి మోసపోయానని తెలుసుకుని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం జరిగింది. సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఏ.శ్రీధర్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్‌ మండలం ఊట్‌పల్లిలోని హనుమాన్‌నగర్‌ కాలనీకి చెందిన సి.మౌనిక ప్రయివేటు ఉద్యోగి. ఈ నెల 18న సాయంత్రం 6 గంటలకు తన మొబైల్‌కు నంబర్‌ (7970135848) నుంచి వాట్సాప్‌ మెసేజ్‌ వచ్చింది. అందులో ఫ్రీ లాన్సింగ్‌ కంపెనీ వర్కింగ్‌ ఫర్‌ హౌమ్‌ జాబ్‌ ఆఫర్‌ ఉంది. ఇంటి వద్దనే ఉంటూ జాబ్‌ చేసుకోవచ్చన్న ఆశతో తాను ఆ జాబ్‌ చేస్తానని ఆ మెసేజ్‌కు బదులు ఇచ్చింది. అయితే కంపెనీకి సంబంధించిన వాటిపై ఒక రివ్యూ ఇచ్చి దాన్ని నోటుగా పంపాలని వాళ్లు సూచించారు. వాళ్ల సూచన మేరకు ఆమె రివ్యూ రాసి పంపింది. జాబ్‌ కావాలంటే మొదట రూ.2000 పంపాలని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ అకౌంట్‌ 7476002100001301 వాట్సాప్‌ మెసేజ్‌ పంపారు. అందుకు ఆమె రూ. రెండు వేలు పంపగా.. తిరిగి వాళ్లు రూ.2,800 ఆమెకు తిరిగి పంపించారు. ఇది నమ్మిన ఆమెను రూ.5వేలు వేయమని అకౌంట్‌ నంబర్‌ ఇచ్చారు. అలా.. ఒకసారి రూ. 5వేలు, మరోసారి రూ.30 వేలు, చివరకు రూ.90వేలు.. ఇలా మొత్తం రూ.1.25లక్షలు వారి అకౌంట్‌లో పంపించింది. చివరికి జాబ్‌ గురించి అడిగితే ఇంకా రూ.1.50 లక్షలు వేయాలని అప్పుడే జాబ్‌ ఇస్తామని వారు చెప్పారు. దాంతో తాను మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సైబర్‌ క్రైమ్‌ కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love