కలిసి పనిచేయాలి

– రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి
– రాష్ట్రాలు ఆర్థికంగా వివేకవంతమైన నిర్ణయాలు తీసుకోవాలి
– కేంద్రం, రాష్ట్రాల మధ్య సమాన భాగస్వామ్యానికి నీతి ఆయోగ్‌ ఒక వేదిక
– కేంద్రం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిసి పని చేయాలి
– నిటి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : రాష్ట్రాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. శనివారం నాడిక్కడ ప్రగతి మైదానంలోని కన్వెన్షన్‌ సెంటర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన నిటి ఆయోగ్‌ పాలక మండలి ఎనిమిదో సమావేశం జరిగింది. ‘వికసిత్‌ భారత్‌ ఏ 2047’ అనే థీమ్‌ తో నిర్వహించిన ఈ సమావేశంలో 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా.. ఆరోగ్యం, నైపుణ్యాల అభివృద్ధి మహిళా సాధికారత, మౌలిక సదుపాయల వృద్ధి వంటి ఎనిమిది అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో అంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పాలిత ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు భూపేష్‌ భఘేలా, సుఖ్వేంధర్‌ సుక్‌, జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్లు, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌ నాథ్‌ సింగ్‌, నిర్మలా సీతారామన్‌, స్మృతి ఇరానీ, పియూష్‌ గోయల్‌, ధర్మేంద్ర ప్రధాన్‌, నారాయణ్‌ రాణె, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ 2047లో వికసిత్‌ భారత్‌ను సాధించేందుకు ఉమ్మడి దృక్పథాన్ని రూపొందించే ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఆదర్శ్‌ అమృత్‌ కాలాన్ని నిర్ధారించడానికి కేంద్రం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు టీమ్‌ ఇండియాగా కలిసి పనిచేయాల్సిన అవసరముందని తెలిపారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య సమాన భాగస్వామ్యానికి నిటి ఆయోగ్‌ ఒక వేదికను అందిస్తుందని, తద్వారా దేశంలో సహకార, పోటీ సమాఖ్యవాదాన్ని బలోపేతం చేస్తుందని అన్నారు. కోఆపరేటివ్‌ ఫెడరలిజాన్ని బలోపేతం చేసేందుకు నిటి ఆయోగ్‌ ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమం (ఏడీపీ) వంటి పలు కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. ఏడీపీ లో చురుగ్గా పాల్గొన్నందుకు రాష్ట్రాలను కూడా ఆయన అభినందించారు. ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమం విజయవంతం కావడంతో నిటి ఆయోగ్‌ ఆకాంక్షాత్మక బ్లాక్‌ (ఏబీపీ)ల కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రేరేపించిందని మోడీ పునరుద్ఘాటించారు.
అంతర్జాతీయ మిల్లెట్‌ సంవత్సరంలో భాగంగా మిల్లెట్‌ కార్యక్రమంలో రాష్ట్రాలు కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. శ్రీ అన్న అనేది పర్యావరణ అనుకూల పంట, రైతుకు అనుకూలమైన ఒక సూపర్‌ ఫుడ్‌ అని అన్నారు. దేశ అవసరాలను తీర్చడానికి దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించి, చమురు ఉత్పత్తిలో ఆత్మనిర్భర్‌గా మారవలసిన అవసరాన్ని ప్రధాని మోడీ తెలిపారు. రాష్ట్రాలు 50 వేల పైబడి అమృత్‌ సరోవర్లను నిర్మించడాన్ని ప్రధాని మోడీ ప్రశంసించారు. రాష్ట్రాలు ఆర్థికంగా పటిష్టంగా మారేందుకు, ప్రజల కలలను నెరవేర్చే కార్యక్రమాలను అందజేయడానికి వీలుగా రాష్ట్రాలు ఆర్థికంగా వివేకవంతమైన నిర్ణయాలు తీసుకోవాలని మోడీ కోరారు. దాదాపు 1,600 లేయర్‌ల డేటాతో గతి శక్తి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సెక్టార్‌లో సాక్ష్యం-ఆధారిత విధాన రూపకల్పనను నిర్ధారిస్తుందనీ, ఇది సమర్థవంతమైన సామాజిక-ఆర్థిక ప్రణాళిక, ప్రాంత అభివృద్ధి విధానాన్ని అనుసరించడాన్ని కూడా నిర్ధారిస్తుందని తెలిపారు.
పది రాష్ట్రాల ముఖ్యమంత్రులు గైర్హాజరు
నీతి ఆయోగ్‌ సమావేశానికి పది రాష్ట్రాల ముఖ్యమంత్రులు గైర్హాజరు అయ్యారు. ముఖ్యమంత్రు లు కె చంద్రశేఖర్‌ రావు (తెలంగాణ), నితీష్‌ కుమార్‌ (బీహార్‌), అరవింద్‌ కేజ్రీవాల్‌ (ఢిల్లీ), సిద్ధ రామయ్య (కర్నాటక), పినరయి విజయన్‌ (కేరళ), నవీన్‌ పట్నాయక్‌ (ఒరిస్సా), భగవంత్‌ మాన్‌ (పంజాబ్‌), అశోక్‌ గెహ్లాట్‌ (రాజస్థాన్‌), ఎంకె స్టాలిన్‌ (తమిళనాడు), మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్‌) గైర్హాజరు అయ్యరు.ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాల నేపథ్యంలో తాను సమావేశానికి రాలేనని బీహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌ తెలిపారు. నవీన్‌ పట్నాయక్‌కు అక్కడ ముందస్తు కార్యక్రమాలు ఉన్నాయనీ, అందుకే ఆయన సమావేశానికి హాజరు కావడం లేదని ఒరిస్సా సీఎంఓ తెలిపింది. ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసులు, బదిలీల విషయమై కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చిన నేపథ్యంలో నిటి ఆయోగ్‌ నిర్వహించే సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ ప్రకటించారు. దేశంలో సహకార సమాఖ్య వ్యవస్థ ఒక పరిహాసంగా మారిందని ఆయన విమర్శించారు.సమావేశానికి తాను రాలేనని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. అయితే, తమ రాష్ట్రం తరపున రాష్ట్ర ఆర్థిక మంత్రి, చీఫ్‌ సెక్రటరీని పంపించేందుకు అనుమతినివ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
ఈ అభ్యర్ధనను కేంద్రం తిరస్కరించింది. నిధుల కేటాయింపు విషయంలో పంజాబ్‌ పై కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆరోపిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ ఈ సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అనారోగ్య కారణాల రీత్యా నిటి ఆయోగ్‌ సమావేశానికి రావట్లేదని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ సింగపూర్‌, జపాన్‌ పర్యటనలో ఉన్నారు. దీంతో ఆయన కూడా సమావేశానికి హాజరుకాలేదు. కర్నాటకలో నేడు క్యాబినెట్‌ విస్తరణ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హాజరు కాలేదు. కేరళ సీఎం పినరయి విజయన్‌ కూడా ఈ భేటీకి హాజరుకాలేనని ప్రకటించారు.

Spread the love