హద్దులు దాటుతున్న కేంద్రం ఆగడాలు

– ఎమర్జెన్సీని గుర్తుకుతెస్తోంది..
– ఆనాటి స్థితికి.. ఇప్పటి పరిస్థితులకు పెద్దగా తేడా లేదు
– రాష్ట్ర ప్రభుత్వాలను పని చేయనివ్వకపోవటం అరాచకం
– సుప్రీం తీర్పును సైతం కాలరాయటం దుర్మార్గం
– దాన్ని ఓడించేందుకు మా శక్తినంతా ఉపయోగిస్తాం
– ఢిల్లీ, పంజాబ్‌ సీఎంలతో కలిసి మీడియా సమావేశంలో కేసీఆర్‌
– ప్రగతి భవన్‌లో సీఎంతో భేటీ అయిన కేజ్రీవాల్‌, భగవత్‌మాన్‌ సింగ్‌
          కేంద్రంలోని బీజేపీ పాలన ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఆనాటి స్థితికి..దేశంలో ఇప్పుడున్న పరిస్థితికి పెద్ద తేడా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల గురించి పదే పదే గొంతు చించుకునే ప్రధాని మోడీ, బీజేపీ నేతలు… తాము కూడా అవే విధానాలను అమలు చేస్తున్నారని విమర్శించారు. ఢిల్లీలో అధికారుల బదిలీ, పోస్టింగులకు సంబంధించి అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారాల్లేకుండా చేస్తూ కేంద్రం ఆర్డినెన్సును తీసుకొచ్చిన సంగతి విదితమే. దీనికి వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంటులో గళమెత్తాలని కోరుతూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ పలు రాష్ట్రాల సీఎంలను కలుస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన పంజాబ్‌ సీఎం భగవత్‌సింగ్‌్‌ మాన్‌ తో కలిసిశనివారం హైదరాబాద్‌కు విచ్చేశారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీర్‌తో వారు భేటీ అయ్యారు. అనంతరం సీఎంలు ముగ్గురూ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు.
– కేంద్రం తెచ్చిన ఆర్డినెన్సును తక్షణం వెనక్కు తీసుకోవాలి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కేసీఆర్‌ మాట్లాడుతూ… కేంద్రంలోని బీజేపీ అరాచ కాలు, ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతు న్నాయని విమర్శిం చారు. అవి ఇప్పుడు పరాకాష్టకు చేరాయని అన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను ముప్పుతిప్పలు పెడుతున్న మోడీ సర్కార్‌… వాటిని పని చేయనివ్వటం లేదని వాపోయారు. ఆర్థికపరమైన పరిధులు విధించటం, రకరకాల దాడులకు పాల్పడటం లాంటి చర్యలతో పలు దుర్మార్గాలకు అది ఒడిగడుతున్నదని తెలిపారు. వీటిని యావత్‌ దేశం గమనిస్తోందని చెప్పారు. ఢిల్లీలోని ఆమాద్మీ పార్టీ ఒక పాపులర్‌ పార్టీ.. యావత్‌ ప్రపంచానికి దాని గురించి తెలుసునని అన్నారు. ఒక సోషల్‌ మూవ్‌మెంట్‌ నుంచి వచ్చిన ఆప్‌… అక్కడ మూడు సార్లు విజయం సాధించిందని సీఎం గుర్తు చేశారు. ఇటీవల నిర్వహించిన ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో సైతం చాలా స్పష్టమైన మెజారిటీని అది సాధించిందని తెలిపారు. బీజేపీ ఎన్ని రకాల ప్రయత్నాలు, ప్రలోభాలు, మాయా మశ్చీంద్రలు చేసినా అక్కడి ప్రజలు ఆ పార్టీని తిరస్కరించి.. ఆప్‌ను గెలిపించారని తెలిపారు. అయినా బీజేపీ అడ్డం తిరిగి మేయర్‌ను ప్రమాణ స్వీకారం చేయనీయలేదన్నారు. చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటే తప్ప ప్రమాణ స్వీకారం జరగలేదని అన్నారు. మరోవైపు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఆప్‌ ప్రభుత్వంపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను పెట్టి… ఊపిరాడకుండా చేస్తున్నారని కేసీఆర్‌ విమర్శించారు. ఈ విషయంలో కూడా కేజ్రీవాల్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందనీ, సీజేతో కూడిన ఐదుగురు సభ్యుల మెజార్టీ బెంచ్‌… ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కిందనే అధికారులు పని చేయాలంటూ స్పష్టమైన తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. గెలిచిన ప్రభుత్వాన్ని పని చేయనివ్వకపోవటం, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను తీసుకొచ్చి కూర్చోబెట్టటం నియంతృత్వమని విమర్శించారు. సుప్రీం తీర్పునకు సైతం అతీగతీ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ, దానికి వ్యతిరేకంగా జయప్రకాశ్‌ నారాయణ్‌ చేసిన ఉద్యమా లను ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. ఢిల్లీలో తెచ్చిన ఆర్డినెన్సును తక్షణం ఉపసంహరించుకోవాలని కేసీఆర్‌ ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. తామందరం కేజ్రీవాల్‌ తరపున నిలబడతామనీ,ఆయనకు మద్దతునిస్తామని స్పష్టం చేశారు. ఆర్డినెన్సు బిల్లు రూపంలో ముందుకొచ్చినప్పుడు లోక్‌సభ, రాజ్యసభల్లో బీఆర్‌ఎస్‌కు ఉన్న శక్తినంతా ఉపయోగించి దాన్ని పాస్‌ కాకుండా అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. రైతుల పోరాటంతో నల్ల చట్టాలను వాపస్‌ తీసుకున్నట్టుగానే ఇప్పటి ఆర్డినెన్సును కూడా ఉపసంహరించుకోవాలనీ, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుందని మోడీ సర్కార్‌ను హెచ్చరించారు.
ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాటం : భగవత్‌మాన్‌సింగ్‌
కేసీఆర్‌ చెప్పినట్టుగా దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాటం చేయాలని పంజాబ్‌ సీఎం భగవత్‌మాన్‌సింగ్‌ తెలిపారు. గవర్నర్‌ వ్యవస్థను బీజేపీ పూర్తిగా దుర్వినియోగం చేస్తోందని చెప్పారు. రాజ్‌భవన్లు బీజేపీ ఆఫీసుల్లాగా మారిపోయాయని ఎద్దేవా చేశారు. గతంలో కేంద్రం తెలంగాణ బిల్లును ఆపింది.. ఇప్పటి మోడీ సర్కార్‌ గవర్నర్‌ చేత మా బిల్లులను నిలుపుదల చేయిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆర్డర్‌ తీసుకున్న తర్వాతే తాము బడ్జెట్‌ను ప్రవేశపెట్టగలిగామనీ, అంతటి దుస్థితిలో దేశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాలన్నీ కలిసి కట్టుగా పోరాడటం ద్వారా సమాఖ్య వ్యవస్థను కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇది యావత్‌ దేశ సమస్య : కేజ్రీవాల్‌
ఇప్పుడు తాము ఎదుర్కొంటున్న సమస్య… కేవలం ఢిల్లీకే పరిమితం కాదు, అది యావత్‌ దేశ సమస్యని ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్‌ చెప్పారు. 2015 ఫిబ్రవరిలో తాము మొదటిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు కేవలం మూడే మూడు నెలల్లో మోడీ సర్కార్‌ ఓ నోటిఫకేషన్‌ ద్వారా తమ అధికారాలను లాక్కుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కంటే ముందున్న షీలా దీక్షిత్‌ ప్రభుత్వంలో అధికారులంతా ఆనాటి సర్కార్‌ హయాంలోనే ఉన్నారని తెలిపారు. ఇప్పుడు ఢిల్లీ సీఎంగా తనకు కనీసం విద్య, వైద్య శాఖల కార్యదర్శులు, ఉప కార్యదర్శులను కూడా బదిలీ చేసే అధికారం లేకుండా పోయిందని వాపోయారు. ఈ క్రమంలో ఎనిమిదేండ్లుగా పోరాటం చేసిన తాము సుప్రీంకోర్టుకెళ్లి మరీ అధికారాలను రాబట్టుకున్నామని వివరించారు. కానీ మోడీ సర్కార్‌ కేవలం ఎనిమిది రోజుల్లోనే తమ అధికారాలను కాలరాస్తూ ఆర్డినెన్సును తెచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశ ప్రధాని సుప్రీంకోర్టును, దాని తీర్పులను సైతం గౌరవించటం లేదని అన్నారు. అలాంటప్పుడు న్యాయం కోసం ఎవరి దగ్గరికెళ్లాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రజలకు న్యాయం జరిగేంత వరకూ పోరాడుతామని చెప్పారు. ప్రతిపక్ష ప్రభు త్వాలు అధికారంలో ఉన్న చోట ఈడీ, సీబీఐలను ప్రయోగించటం బీజేపీకి ఆనవాయితీగా మారిందన్నారు. దేశంలో మోడీ సర్కార్‌ నియం తృత్వం కొనసాగుతోందనీ, అందుకే రాజ్యాంగ పరిరక్షణ కోసం దేశవ్యా ప్తంగా మద్దతు కోరుతున్నామని అన్నారు. రాజ్యసభలో బీజేపీకి మెజార్టీ లేదనీ, విపక్షాలన్నీ కలిసి ఆర్డినెన్సును, దాని తర్వాత వచ్చే బిల్లును పాస్‌ కాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. తమ పోరాటానికి మద్దతు ప్రకటించిన కేసీఆర్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Spread the love