భూసారాన్ని పెంచడానికి పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ

– 21 వరకు జరిగే ఉత్సవాలను జయప్రదం చేయండి
– సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య
నవతెలంగాణ- కల్లూరు
ప్రభుత్వం రాయితీతో జీలుగులు పంపిణీ చేస్తుందంటే భూసారాన్ని పెంచి చీడ పీడలు తట్టుకునే విధంగా భూమిని సంసిద్ధం చేయటం కోసమే పచ్చి రొట్టెను సాగు చేయాలని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య అన్నారు. స్థానిక రైతు వేదికలో జీలుగులు పంపిణీ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 65 శాతం రాయితీతో సన్న చిన్న కారు రైతులకు జిలుగులు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. రైతులు రసాయన ఎరువులు తగ్గించి పచ్చి రొట్టె ఎరువులు, పశువుల ఎరువులను పొలాలకు తోలితే మంచిదన్నారు. రెండో తేదీ నుండి రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు 21వ తేదీ వరకు అన్ని శాఖల ఆధ్వర్యంలో పండగ లాగా నిర్వహించాలని అందుకు అధికార యంత్రాంగం సంసిద్ధం కావాలన్నారు. వ్యవసాయ అధికారి ఏవో రూప మాట్లాడుతూ మండలానికి 2146 క్వింటాలు జీలుగులు అవసరమని ప్రతిపాదించగా మొదటి విడత 1500 క్వింటాలు మండలానికి చేరాయి అన్నారు. ఐదు సొసైటీల ద్వారా జీలుగువిత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. సోమవారం నుండి కల్లూరు సొసైటీలో ప్రారంభిస్తామని, రెండు ఎకరాల రైతులకు 30 కేజీలు బ్యాగు ఇస్తామని అంతకుమించి ఎక్కువ భూమి ఉన్న రైతులకు రెండు బ్యాగులు ఇస్తామని అన్నారు. రైతులు పట్టాదార్‌ పుస్తకం, ఆధార్‌ జిరాక్స్‌ ప్రభుత్వం ఇచ్చే 60 శాతం రాయితీ పోను 30 కేజీల బ్యాగుకు 842 చెల్లించాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో సిహెచ్‌ సూర్యనారాయణ, జడ్పిటిసి కట్టా అజరు కుమార్‌, రైతు సమన్వయ సమితి మండల జిల్లా ప్రతినిధులు లక్కినేని రఘు, పసుమర్తి చందర్రావు, డిసిసిబి డైరెక్టర్‌ బోబోలు లక్ష్మణరావు, పోచారం సొసైటీ అధ్యక్షులు నర్వనేని పెద్ద అంజయ్య, సొసైటీ పాలకవర్గ సభ్యులు సీఈవోలు పలు గ్రామపంచాయతీ సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Spread the love