న్యూఢిల్లీ: గర్భాశయ క్యాన్సర్ కేసులు, మరణాల విషయంలో ఆసియాలో మన దేశం ఐదో స్థానంలో ఉంది. అంతర్జాతీయ పరిశోధకులు ఇటీవల ‘ది లాన్సెట్’లో ప్రచురించిన పత్రం ఈ వ్యాధికి సంబంధించిన వివిధ అంశాలను విశ్లేషించింది. ఈ వ్యాధి మన దేశంలో ఆందోళనకర స్థాయిలో ఉన్నదని తెలిపింది. ఎయిమ్స్ (న్యూఢిల్లీ), పండిట్ మదన్‌మోహన్ మాలవ్యా క్యాన్సర్ సెంటర్, హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్, వారణాసిలోని టాటా మెమోరియల్ సెంటర్‌కు చెందిన పరిశోధకులు ఈ నివేదికను రూపొందించారు. 2020లో ప్రపంచంలో చోటుచేసుకున్న గర్భాశయ క్యాన్సర్ మరణాలలో 90% మరణాలు పేద, ఓ మాదిరి ఆదాయం కలిగిన దేశాలలో జరిగినవేనని నివేదిక తెలిపింది. ఆ దేశాలలో వ్యాధి ముదురుతున్న దశలోనే 60% మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. అదే సంపన్న దేశాలలో అయితే ఆ దశలో మరణిస్తున్న మహిళలు 30% మాత్రమే. ఆసియాలో కొత్తగా 3.5 లక్షల గర్భాశయ క్యాన్సర్ కేసులు నమోదయ్యాయని, ప్రపంచంలో నమోదైన కేసులలో ఇవి 58% అని నివేదిక తెలియజేసింది. 2020లో ఆసియాలో రెండు లక్షల మంది మహిళలు ఈ వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. గర్భాశయ క్యాన్సర్‌కు ప్రధాన కారణమైన పపిల్లోమా వైరస్ నివారణకు పెద్ద ఎత్తున వాక్సినేషన్ చేపట్టాలని పరిశోధకులు సూచించారు.