కేశవాపురం అభివృద్ధి ప్రదాత యర్వనేని పురుషోత్తం

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు
నవతెలంగాణ-తల్లాడ
కేశవాపురం అభివృద్ధి ప్రదాత యర్వనేని పురుషోత్తం అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు అన్నారు. కేశవాపురం గ్రామంలో సిపిఎం సీనియర్‌ నాయకులు, మాజీ సర్పంచ్‌ యర్వనేని పురుషోత్తం దశదినకర్మ శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుదర్శన్‌రావు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే ఎస్‌ఎఫ్‌ఐలో పనిచేస్తూ పట్టబద్రునిగా కేశవాపురం గ్రామంలో అడుగుపెట్టి సిపిఎం నిర్మాణానికి గ్రామ అభివృద్ధికి తుది శ్వాస విడిచే వరకు అహర్నిశలు ఎనలేని కృషి చేశారని పురుషోత్తం సేవలను కొనియాడారు. ఆయన లేని లోటు తీర్చలేనిది అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటు పడాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలు తెచ్చి కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, సాధించుకున్న హక్కులను కాపాడుకోవటానికి పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సిపిఎం సీనియర్‌ నాయకులు తాతా భాస్కర్‌రావు మాట్లాడుతూ పురుషోత్తం తన కన్నా ఎనిమిది సంవత్సరాలు చిన్నవాడు అయినా తామిద్దరమూ కలిసి పనిచేసి తల్లాడ మండలంలో పార్టీ అభివృద్దికి, గ్రామాల అభివృద్ధికి అహర్నిశలు బూర్జువాదులతో తలపడుతూ కృషి చేశామన్నారు. పురుషోత్తం నిబద్ధతగల నాయకుడని, నమ్మిన సిద్ధాంతం కోసం కడవరకూ ఎత్తిన జెండా దించకుండా పోరాడారని, ఆయన సేవలు ఎనలేనివిని అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు. సత్తుపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్‌ మాచర్ల భారతి మాట్లాడుతూ సిపిఎం అభివృద్దికి, గ్రామాభివృద్ధికి మడమ తిప్పకుండా ఎనలేని కృషి చేశారని పురుషోత్తం సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, తెలంగాణ రైతు సంఘం అధ్యక్షులు బొంతు రాంబాబు, కార్యదర్శి మాదినేని రమేష్‌, టిఆర్‌ఎస్‌ నాయకులు జక్కంపూడి కృష్ణమూర్తి, శీలం సత్యనారాయణరెడ్డి, అయినాల రామలింగేశ్వరరావు, మన్నేపల్లి రామారావు, పి.సత్యనారాయణ, పారుపల్లి కృష్ణారావు, నారికొండ అమరేందర్‌, చెన్నుపాటి శేషగిరి తదితరులు పాల్గొన్నారు.

Spread the love