మందులు అమ్ముకొని బతికిన చరిత్ర నీది

– మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ బేషరతుగా క్షమాపణ చెప్పాలి : గుత్తా ముఖ్య అనుచరుల వ్యాఖ్యలు
నవతెలంగాణ-నల్లగొండటౌన్‌
”సుదీర్ఘ రాజకీయ అనుభవం పరిజ్ఞానం కలిగిన మచ్చలేని మహా నాయకుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి.. మందులు అమ్ముకొని బతికిన నీచ చరిత్ర నీది.. గుత్తా గురించి మాట్లాడే అర్హత నీకెక్కడిది..? ఉస్మానియా యూనివర్సిటీలో వేలాది మంది చేసిన ఉద్యమాలను నీవే చేసినట్టు నీ ఖాతాలో వేసుకొని, వెంట నడిచిన స్నేహితులను సైతం నిలువునా ముంచింది ఎవరికి తెలియదు.. అధికారులను వేధించి.. దళిత బంధులో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డావ్‌.. ఇవన్నీ నిజం కాదా..?” అని గుత్తా ముఖ్య అనుచరులు మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌నుద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని గుత్తా సుఖేందర్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గుత్తాను విమర్శించే స్థాయిగాని, వయస్సు లేని చిల్లర వ్యక్తి గాదరి కిషోర్‌ అని అన్నారు. ప్రజలకు తన నీచ చరిత్ర తెలుసు కాబట్టే మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడించి తరిమికొట్టారని అన్నారు. ఇసుకదందాను వృత్తిగా మార్చుకుని వందల కోట్ల రూపాయలు సంపాదించిన ప్రబుద్ధుడని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయ నాయకుల ఇండ్ల చుట్టూ తిరిగి చందాలు వసూలు చేసి సొంతానికి వాడుకున్నాడని ఆరోపించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్‌ఎస్‌ పతనానికి ప్రధాన కారుకుడు కిషోర్‌ అని విమర్శించారు. తిరుమలగిరి మండలంలో దళితబంధు పథకంలో తన బినామీలకు, అనుచరులకు ఇప్పించి కోట్ల అవినీతికి పాల్పడిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తనకు అనుకూలమైన కలెక్టర్‌ను రంగారెడ్డి జిల్లాలో పెట్టుకొని కుంట్లూరు గ్రామ శివారులో భూ అక్రమ దందా చేసిన విషయం ఒక పత్రికలో ప్రచురించిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని బినామి రైస్‌ మిల్లులకు పంపింది నిజం కాదా అన్నారు. మరోసారి గుత్తా సుఖేందర్‌ లాంటి వ్యక్తి మీద ఒక్కమాట మాట్లాడినా నాలుక కోసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మెన్‌ ఇరిగి పెద్దులు, కనగల్‌ జెడ్పీటీసీ చిట్ల వెంకటేశం, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతలు ఐతగోని స్వామిగౌడ్‌, వెంకటేశ్వర్‌రావు, గోపాల్‌రెడ్డి, యామా దయాకర్‌, హరికృష్ణ, మునాసు వెంకన్న, మాజీ జెడ్పీటీసీ సంజీవ, చిల్కరాజు శ్రీనివాస్‌, బకారం వెంకన్న, పీఏసీఎస్‌ చైర్మెన్‌ దోటి శ్రీనివాస్‌, చెన్నగోని యాదగిరి, మైనారిటీ నాయకులు అనీష్‌ ముక్తాదర్‌, హన్ను ఉన్నారు.

Spread the love