దేశంలో మోడీ వ్యతిరేక గాలి వీస్తోంది

– మోడీ పాలనలో కనబడని ఎమర్జెన్సీ
– స్వతంత్ర సంస్థల్ని నిర్వీర్యం చేసిన వైనం
– ఆర్‌ఎస్‌ఎస్‌ది స్వాతంత్య్ర పోరాటంలో లొంగిపోయిన పాత్ర
– ప్రజల పక్షాన గొంతు విప్పిన ప్రబీర్‌ పుర్కాయస్థ
– ‘అలుపెరుగని పోరాటం’ పుస్తకావిష్కరణ సభలో..ప్రజాశక్తి పూర్వ సంపాదకులు ఎస్‌.వినయ కుమార్‌
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
‘దేశంలో మోడీ వ్యతిరేక గాలి వీస్తోంది కనబడని అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది. ఆనాటి ఎమర్జెన్సీ కూడా ఇంత దారుణంగా లేదు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఆర్‌ఎస్‌ఎస్‌ వాదులది లొంగిపోయిన పాత్ర తప్ప ఏ చరిత్రా లేదు. మత విద్వేషాలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఈడీ, విజిలెన్స్‌, ఎన్నికల సంఘం వంటి సంస్థల్ని నిర్వీర్యం చేసింది. తమకు నచ్చిన వాళ్లతో ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీని ఓడించకపోతే ప్రజాస్వామ్యం, రాజ్యాంగమే కాకుండా ప్రగతిశీల భావజాలం సైతం ప్రమాదంలోకి నెట్టబడుతుంది’ అని ప్రజాశక్తి పూర్వ సంపాదకులు, ఎస్‌వీకే కార్యదర్శి ఎస్‌.వినయకుమార్‌ అన్నారు.
గురువారం సంగారెడ్డి పట్టణంలో నవతెలంగాణ సాహితీ సంస్థ ఆధ్వర్యంలో ప్రబీర్‌ పుర్కాయస్థ రచించిన ‘అలుపెరుగని పోరాటం’ పుస్తకావిష్కరణ సభ నవతెలంగాణ ప్రాంతీయ ప్రతినిధి మేకల కృష్ణయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్‌ఎస్‌ఎస్‌ దాని అనుబంధ సంఘాలకు దేశ స్వాతంత్య్ర పోరాటంలో లొంగిపోయి క్షమాపణ కోరిన పాత్ర తప్ప.. పోరాడిన చరిత్ర లేదన్నారు. సావర్కర్‌ ఆదేశాల మేరకే మహాత్మాగాంధీని గాడ్సే హత్య చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గోద్రా అల్లర్లు సృష్టించి మారణహోమానికి పాల్పడిన ఫలితంగానే మోడీ సీఎం అయ్యారని, 2013లో ముజఫర్‌లో మత ఘర్షణలు సృష్టించి ఆధిత్యనాథ్‌ యోగి సీఎం అయ్యాడన్నారు. మత విధ్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్దిపొందిన సంఘటనల్లోని వాస్తవాల్ని వెలుగుతీసి న్యూస్‌క్లిక్‌ డిజిటల్‌ చానల్‌ ద్వారా ప్రజల పక్షాన నిలిచిన ప్రబీర్‌ పుర్కాయస్థను కుట్రపూరితంగా అరెస్టు చేశారని తెలిపారు.
ఆనాటి ఎమర్జెన్సీ కాలంలో మీసా చట్టం కింద పుర్కాయస్థను జైళ్లో పెట్టారని, ప్రస్తుతం మోడీ పాలనలో కొనసాగుతున్న అప్రకటిత ఎమర్జెన్సీలో కూడా ఉపా చట్టం కింద 2021లో అరెస్టు చేసిన.. బీజేపీ ప్రభుత్వం కక్షకట్టి నిర్బంధంలోకి నెట్టిందన్నారు. అప్పటి ఎమర్జెన్సీ ప్రకటితమైందని, మీడియాలో రాసే రాతలపై ఆంక్షలుండేవని గుర్తు చేశారు
. మోడీ పాలనలో కొనసాగుతున్న అప్రకటిత ఎమర్జెన్సీలో మాత్రం మీడియా సంస్థల్ని మోడీ తన చెప్పుచేతుల్లో పెట్టుకున్నారన్నారు. మోడీ పాలనలోని డొల్లతనాన్ని ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా ఏమీ రాయలేకపోతున్నాయన్నారు. సోషల్‌ మీడియా మాత్రం మోడీ పాలనలోని డొల్ల చేష్టల్ని ఎత్తిచూపుతున్నాయన్నారు. డిజిటల్‌ మీడియాలో మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే సహించే పరిస్థితిలేదన్నారు.
ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిస్తే ముస్లీంలు హిందూ మహిళల పుస్తెలతాళ్లను ఉంచరని మోడీ చెప్పడం దుర్మార్గమైన చర్య అన్నారు. లౌకిక శక్తులు అప్రకమత్తంగా ఉండి సోషల్‌ మీడియాలో వస్తున్న మోడీ త్రయం తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రముఖ రచయిత, జర్నలిస్ట్‌, మాజీ ఎమ్మెల్సీ ఆర్‌.సత్యనారాయణ, ప్రముఖ వైద్యులు కృష్ణమూర్తి, సీనియర్‌ జర్నలిస్టు పీవీరావు, నవతెలంగాణ బుకహేౌస్‌ జనరల్‌ మేనేజర్‌ ఆర్‌.వాసు, రచయిత వినోద్‌కుమార్‌, సింగర్‌ కిషన్‌, రైతు సంఘం రాష్ట్ర నాయకులు జి.జయరాజ్‌, కేవీపీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్యం, నవతెలంగాణ జీఎం నరేందర్‌, మెదక్‌ రీజియన్‌ మేనేజర్‌ రేవంత్‌కుమార్‌, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love