నువ్వు వనాల్లో ఉన్నా
జనాల్లో ఉన్నా
పీడిత వర్గపు ఘోష
నీ నోట పాటై పల్లవించినా
నీ కాలి గజ్జెలు మోతై మ్రోగినా
బూర్జువా వర్గపు గుండెల్లో
తూటాలై పేలేవి
లచ్చుమమ్మో లచ్చుమమ్మ అని
నువ్వు పాటకట్టి పాడుతుంటే
ప్రతి బిడ్డా తన తల్లిని
ఓదార్చుతున్నటుండేది
బండెనక బండి కట్టి
పదహారు బళ్ళు కట్టి అని
నువ్వు గొంతెత్తి పాడుతుంటే
మా చెవ్వుల్లో ఎడ్ల గిట్ల చప్పుడులై
మారు మ్రోగుతుండేవి
నీ గోచీ గొంగళి గజ్జెలు
ఆయుధాలై ప్రతిధ్వనిస్తే
విప్లవ చైతన్యం వెల్లివిరిచేది
ఇప్పుడు నీ ఆట పాట మాటలు
భౌతికంగా దూరమైనా
జన సామాన్యపు మదిలో
పుట్టుమచ్చవై కనిపిస్తావ్
పొడుస్తున్న ప్రతి పొద్దు లోనూ
నీ కాలం నడుస్తూనే ఉంటుంది.
-యం యస్ రాజు, 9502032666