స్థిరమైన ప్రపంచం వైపు యువత అడుగులు

స్థిరమైన ప్రపంచం వైపు యువత అడుగులుయువతలోని మంచి అలవాట్లు అన్ని మార్పులకు కారణమవుతాయి’ అంటారు ప్రముఖ రాజనీతి తత్వవేత్త అరిస్టాటిల్‌. ఆయన చెప్పింది అక్షర సత్యం. యువతకు మంచి అలవాట్లు అవసరం. వాటి ఆధారంగానే వారు బలమైన పునాదిని నిర్మించగలరు. సమాజాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను సృష్టించగలరు. తద్వారా తమ విజయానికి అవసరమైన మార్గాన్ని సుగమం చేసుకోగలరు. ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా యువతే కీలకం. వారి ఆలోచనలు సరైనవిగా ఉంటే ఆ దేశం సరైన దిశలో పురోగమిస్తుంది. అందుకే ఐక్యరాజ్య సమితి ప్రపంచ యువతపై ప్రత్యేక దృష్టి పెడుతున్నది. ప్రతి ఏడాది ఆగస్టు 12న అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుతున్నది.
ప్రతి ఏడాది జరుపుకునే అంతర్జాతీయ యువజన దినోత్సవం సమాజ అభివృద్ధికి నేటి యువత చేస్తున్న కృషిని ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంది. దీని లక్ష్యం రేపటి నాయకులను తయారు చేయడం మాత్రమే కాదు. నేటి సమాజంలో వేగంగా వస్తున్న మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా యువతకు జరుగుతున్న అన్యాయాల గురించి అవగాహన కల్పించడం కూడా ఈ రోజు ప్రాముఖ్యత. ప్రపంచవ్యాప్తంగా యువకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సవాళ్లపై దృష్టి సారించేందుకు ఈ అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి జరుపుతున్నది. పరిమిత వనరులతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ మంచి భవిష్యత్తు కోసం కెరీర్‌ను రూపొందించుకోవడానికి మార్గం సుగమం చేసుకుంటున్న యువతకు ఐక్యరాజ్య సమితి ప్రాధాన్యం ఇస్తున్నది.
అంతర్జాతీయ యువజన దినోత్సవ చరిత్ర
ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ 1965లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువత జీవితాలపై సానుకూల ప్రభావం చూపే ప్రయత్నాలను ప్రారంభించింది. ప్రపచం శాంతి, పరస్పర గౌరవం, ప్రజల మధ్య అవగాహన వంటి ఆదర్శవంతమైన విషయాలను ప్రచారం చేసే బాధ్యత యువతకు అప్పగించాలని నిర్ణయించారు. అప్పటి నుండి యువత సాధికారత కోసం కేటాయించిన సమయం, వనరులను మరింత పెంచారు. మళ్లీ 1999లో అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పాటించాలని యువతకు బాధ్యత వహించే మంత్రుల ప్రపంచ సదస్సు ద్వారా సిఫార్సు చేయబడింది. డిసెంబర్‌ 17, 1999న యుఎన్‌ జనరల్‌ అసెంబ్లీ ఈ తీర్మానాన్ని ఆమోదించింది. మొదటి అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని ఆగష్టు 12, 2000న జరుపుకున్నారు. అప్పటి నుండి ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
కింది స్థాయి వరకు చర్చించాలి
నేటి ప్రపంచంలో యువత వివిధ సవాళ్లు, అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. అయితే ఇది వారు ప్రపంచంలోని ఏ ప్రాంతంలో ఉన్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలలో యువకులు సామాజిక, మానసిక సవాళ్లకు ఎక్కువగా గురవుతున్నారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అభివృద్ధి చెందని దేశాల్లోని యువకులు ఆరోగ్యం, విద్య, ఉపాధి వంటి ప్రాథమిక విషయాల్లో తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఈ అడ్డంకులు, సవాళ్ల గురించి కింది స్థాయి వరకు విస్తృతంగా చర్చించాలి. అలాగే యువతలో ఈ సమస్యలపై అవగాహన కల్పించేందుకు శిక్షణా తరగతులు, సెమినార్‌లు, వెబ్‌నార్లు, ప్రభావవంతమైన వ్యక్తులతో ఉపన్యాసాలు, ప్రేరణాత్మక వక్తలతో చర్చా వేదికలు ఏర్పాటు చేయాలి. అలాగే విద్యా, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించాలి. వీటన్నింటినీ సమర్ధవంతంగా చేయాలంటే నిధుల సమీకరణలు చాలా అవసరం. ఆ వైపు కూడా ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి.
బాధ్యత పెరిగింది
నేటి యువత కొంత వరకు ప్రగతిశీల ఆలోచనలు కలిగి ఉన్నారు. కేవలం తమ వ్యక్తిగత జీవితం కోసమే తపించడకుండా సమాజం గురించి కూడా ఆలోచిస్తున్నారు. తోటి వారికి సాయం చేయడం తమ బాధ్యతగా భావిస్తున్నారు. సోషల్‌ మీడియా వచ్చిన తర్వాత సాంకేతికతను అందిపుచ్చుకొని ఎక్కడ సమస్య ఉందని తెలిసినా వెంటనే స్పందిస్తున్నారు. మన దేశంలోనే చూస్తూ ఇటీవల జరిగిన రైలు ప్రమాదంలో గాయపడిన వారి కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేశారు. అంతేకాదు కొంత మంది స్వచ్ఛంధ సంస్థలు ఏర్పాటు చేసి పేదలకు, విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నారు.
దురలవాట్లుకు బానిసలుగా…
బాధ్యతగా ఆలోచిస్తున్న యువతతో పాటు చెడు అలవాట్లకు బానిసలవుతున్న యువతరం కూడా ఉంది. ఇటీవల కాలంలో మాదకద్రవ్యాలకు అలవాటు పడుతున్న యువత రోజురోజుకు ఎక్కువవుతుంది. దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించాల్సిన యువత మైకంలో మునిగిపోతుందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. కొందరు అసాంఘిక కార్యకలాపాలకు కూడా పాల్పడుతున్నారు. దీని వల్ల ప్రపంచ దేశాలు అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింత నష్టం. యువత ఇటువంటి చెడు అలవాట్లకు బానిసలైతే దేశ పరిస్థితి మరింత దిగజారిపోవడం ఖాయం. కనుక ఐక్యరాజ్య సమితితో పాటు వివిధ దేశాల పాలకులు కూడా దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
ఈ ఏడాది థీమ్‌
ప్రతి ఏడాది ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ యువజన దినోత్సవం కోసం ఒక థీమ్‌ను ఎంచుకుంటుంది. ఆ ఏడాది మొత్తం ప్రభుత్వాలు సంబంధిత థీమ్‌లపై దృష్టి పెట్టాలి. దీనికి అనుగుణంగా ప్రాంతాల వారిగా యువతకు అవసరమైన కార్యక్రమాలను రూపొందించాలి. 2023కు గాను ‘యువత కోసం గ్రీన్‌ స్కిల్స్‌: స్థిరమైన ప్రపంచం వైపు’ అని థీమ్‌ను నిర్ణయించారు. ప్రతి దేశానికి పునాది యువత విద్య. కాబట్టి యువత విద్యావంతులను చేయడం చాలా ముఖ్యం. అలాగే విద్యతో పాటు నైపుణ్యాలు పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే చాలా మంది పిల్లలు నేడు ప్రాథమిక విద్యకు దూరమవుతున్నారు. ఆకలి, పేదరికంతో బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నాణ్యమైన యువత ఎక్కడి నుండి తయారవుతుంది. ఇది వారి ఎదుగుదలకే కాదు దేశాల అభివృద్ధికి కూడా పెద్ద ఆటంకం. అందుకే యువత భవితను నిర్మించేందుకు, వారిలోని చెడుఅలవాట్లను దూరం చేసి మంచి యువతగా ఎదగడానికి అవసరమైన కార్యక్రమాలకు రూపకల్పన జరగాలి. కనుక ప్రతి ఏడాది థీమ్‌ ఇవ్వడంతో పాటు యువత పురోగతికి అవసరమైన చర్యలను కూడా ఐక్యరాజ్యసమితి చేపట్టాలి. ఆ దిశగా ప్రపంచ దేశాలను నడిపించాలి.
మునుపటి థీమ్‌లు
2022 – ‘తరాల మధ్య సంఘీభావం: అన్ని వయసుల కోసం ప్రపంచాన్ని సృష్టించడం’
2021 – ఆహార వ్యవస్థలను మార్చడం: ఆరోగ్యం కోసం యూత్‌ ఇన్నోవేషన్‌
2020 – గ్లోబల్‌ యాక్షన్‌ కోసం యూత్‌ ఎంగేజ్‌మెంట్‌
2019 – విద్యలో మార్పు
2018 – యువత కోసం సురక్షిత ప్రదేశాలు
2017 – యూత్‌ బిల్డింగ్‌ పీస్‌
2016 – 2030కి దారి: పేదరికాన్ని నిర్మూలించడం, సుస్థిరతను సాధించడం
2015 – యూత్‌ సివిక్‌ ఎంగేజ్‌మెంట్‌
2014 – మానసిక ఆరోగ్య విషయాలు
2013 – యూత్‌ మైగ్రేషన్‌: అభివృద్ధిని ముందుకు తీసుకువెళుతోంది
2012 – మెరుగైన ప్రపంచాన్ని నిర్మించడం: యువతతో భాగస్వామ్యం
2011 – మన ప్రపంచాన్ని మార్చండి
2010 – సంభాషణ, పరస్పర అవగాహన
2009 – సస్టైనబిలిటీ: అవర్‌ ఛాలెంజ్‌. మన భవిష్యత్తు.
2008 – యూత్‌ అండ్‌ క్లైమేట్‌ చేంజ్‌: టైమ్‌ ఫర్‌ యాక్షన్‌
2007 – చూడండి, వినండి: అభివృద్ధి కోసం యువత భాగస్వామ్యం
2006 – పేదరికాన్ని కలిసి పరిష్కరించడం
2005 – ఔూA్‌ం10: మేకింగ్‌ కమిట్మెంట్స్‌ మేటర్‌
2004 – ఇంటర్‌జెనరేషన్‌ సొసైటీలో యువత
2003 – ప్రతిచోటా యువకులకు మంచి, ఉత్పాదక పనిని కనుగొనడం
2002 – నౌ అండ్‌ ఫర్‌ ది ఫ్యూచర్‌: యూత్‌ యాక్షన్‌ ఫర్‌ సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌
2001 – ఆరోగ్యం – నిరుద్యోగం

– సలీమ
94900 99083

Spread the love