ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిల

– నియమించిన ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిల నియమితులయ్యారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్‌ ఖర్గే ఈ మేరకు నిర్ణయించినట్టు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కెసి వేణుగోపాల్‌ తెలిపారు. కాగా… 2021 జులైలో తెలంగాణ వేదికగా యువజన శ్రామిక రైతు తెలంగాణ పార్టీ(వైఎస్సార్‌ టీపీ)ని ఆమె స్థాపించారు. అప్పటి నుంచి గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు, పాదయాత్రలతో తనకంటూ మైలేజ్‌ సంపాదించుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌, ఇతర ప్రాజెక్ట్‌ల్లో స్కాంలపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదులు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆమె భావించారు. అయితే… బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేక ఓటు చీలి, కెేసీఆర్‌ మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రమాదమున్నందున ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు ఆమె ప్రకటించారు. వైఎస్సార్‌ టీపీ కార్యకర్తలు, నేతలు కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. అనంతరం దాదాపు రెండున్నర ఏండ్ల తన సొంత పార్టీని షర్మిల ఈ నెల 4న కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ విలీన కార్యక్రమంలో ఖర్గే, రాహుల్‌ గాంధీలు షర్మిలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే.
చిత్తశుద్దితో పని చేస్తా….: షర్మిల
ఏపీలో పార్టీకి గత వైభవం తీసుకొచ్చేందుకు సీనియర్లు, జూనియర్లు, అన్ని వర్గాలను కలుపుకొని చిత్తశుద్దితో పని చేస్తానని వైఎస్‌ షర్మిల అన్నారు. ఈ మేరకు షర్మిలా రెడ్డి సోషల్‌ మీడియా ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు శక్తి వంచనలేకుండా కృషి చేస్తానన్నారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా తనకు బాధ్యతలు అప్పగించిన పార్టీ అగ్రనేతలు మల్లికార్జున్‌ ఖర్గే, రాహుల్‌ గాంధీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Spread the love