ధరల దోపిడీ.. ‘జీరో’ దందా..!

ధరల దోపిడీ.. 'జీరో' దందా..!– ఖమ్మం మార్కెట్‌ ఆదాయానికి భారీ గండి
– నిలకడ లేని మిర్చి ధరలతో రైతుల్లో ఆందోళన
– వ్యవసాయ, మార్కెటింగ్‌ మంత్రి తుమ్మల సమీక్ష
– అవకతవకలకు పాల్పడితే చర్యలని హెచ్చరిక
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం మిర్చి మార్కెట్లో ‘జీరో’ వ్యాపారం జోరుగా నడుస్తోంది. ఓవైపు ధరలు తగ్గించి దోపిడీకి పాల్పడుతున్న వ్యాపారులు మరోవైపు ఈ జీరో దందాను కొనసాగిస్తున్నారు. రోజుకు కనీసం రూ.3 లక్షల వరకు మార్కెట్‌ ఆదాయానికి గండికొడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. రోజుకు 30వేల బస్తాలు అమ్మకానికి వస్తే వాటిలో సగం, అంతకన్నా తక్కువ సరుకును మాత్రమే చూపించి మార్కెట్‌కు రావాల్సిన ఆదాయాన్ని వ్యాపారులు కాజేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. మార్కెట్‌కు వచ్చిన సరుకును బయటే బేరమాడి కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు ధరలను తగ్గించి కొనుగోలు చేస్తుండటంతో రైతులు కూడా నష్టపోతున్నారు. మార్కెట్లో చోటుచేసుకుంటున్న దోపిడీపై రైతులు ఆందోళన నిర్వహించారు. ఖమ్మం మార్కెట్‌ విషయంపై వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. అధికారులను హైదరాబాద్‌ పిలిపించి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్లలో జెండా పాటలు, రైతులకు లభిస్తున్న ధరలు, మార్కెట్లకు వస్తున్న ఆదాయంపై నాలుగు రోజులుగా సీరియస్‌గా దృష్టి సారించారు. శుక్రవారం ఆకస్మికంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ను మంత్రి సందర్శించారు. రైతులతో మాట్లాడారు. ధరల్లో వ్యత్యాసాలు, మార్కెట్‌ ఆదాయానికి గండికొట్టే చర్యలపై వ్యాపారులు, అధికారులను సీరియస్‌గా హెచ్చరించారు. పండుగ తర్వాత ఇలాంటి ఘటనలు పునరావృతమైతే ఊరుకునేది లేదని చెప్పారు.
జెండాపాటతో పొంతన లేని ధరలు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో జెండాపాటతో పొంతన లేకుండా ధరలు ఉంటాయి. తద్వారా రైతులు నష్టపోవాల్సి వస్తోంది. పంట విక్రయాలు పెరిగే కొద్ది ధరలు తగ్గుతుండటంపై రైతుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. నెల రోజులుగా మిర్చి ధర దాదాపు రూ.3,500కు పైగా తగ్గింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం క్వింటాల్‌ మిర్చి గరిష్ఠంగా రూ.21వేల ధర పలకగా మంగళవారం నాటికి రూ.500 తగ్గింది. మంత్రి సమీక్షలు, హెచ్చరికల నేపథ్యంలో ధరను కొంతమేర పెంచారు. శుక్రవారం క్వింటాల్‌ మిర్చి గరిష్ఠంగా రూ.21,300 ధర పలికింది. గత నెలలో రూ.24,500 పలికిన మిర్చి ధర ఈ నెల ఆరంభంలో 23,600కు చేరింది. 3వ తేదీన రూ.23వేలున్న ధర 8వ తేదీ నాటికి క్రమేణా క్షీణించి.. రూ.21వేలుగా నమోదైంది. ఒకటి, రెండు లాట్లకే జెండాపాట ధరలు పెట్టి మిగిలిన మొత్తానికి రూ.20వేల లోపే ధరలు పెడుతుంటంపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
విదేశాల్లో డిమాండ్‌ ఉన్నా..
తేజా రకం మిర్చికి విదేశాల్లో డిమాండ్‌ ఉన్నా.. నాణ్యత పేరు చెప్పి వ్యాపారులు దగా చేస్తున్నారు. మొదటి కోత మిరపకాయలు కావడంతో తేమ అధికంగా ఉందని, మిర్చి నాణ్యత లేదని తక్కువ ధరకు కొంటున్నారు. రెండేండ్లుగా తామర పురుగు ప్రభావం ఉండటంతో రైతులు ఈ ఏడాది ముందస్తుగా మిరప సాగు చేశారు. ఆగస్టులో సాగు ప్రారంభించాల్సిన పంటను జులైలోనే మొదలు పెట్టడంతో.. ఫిబ్రవరిలో రావాల్సిన పంట జనవరి నుంచే వస్తోంది. ఇదే సమయంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల్లోనూ మిర్చి కోతలు ప్రారంభించడంతో ధరలు తగ్గుతున్నాయనే వాదనను వ్యాపారులు ముందుకు తెస్తున్నారు.
సరుకు తక్కువ పేరుతో ఆదాయానికి గండి…
మార్కెట్‌కు ఈ నెల ఆరంభం నుంచి రోజుకు పదివేల బస్తాలకు పైగానే వస్తున్నాయి. కానీ వ్యాపారులు, అధికారులు ఏకమై సరుకు తక్కువగా వస్తుందని సాకు చూపించి మార్కెట్‌ ఆదాయానికి గండికొడుతున్నారు. ఈనెల ఆరంభంలో ఏడువేల బస్తాలు, ఐదో తేదీ నాటికి 8,600 బస్తాలు చూపించారు. మంత్రి తుమ్మల దృష్టి సారించే వరకు పదివేల లోపు బస్తాలనే చూపించారు. సోమవారం నుంచి 14వేలకు పైగా బ్యాగ్‌లు వచ్చినట్లు చూపుతున్నారు. కానీ ఇప్పటికి కూడా వచ్చిన సరుకులో సగం మాత్రమే మార్కెట్‌ గణాంకాల్లో నమోదవుతుందనే ఆరోపణలున్నాయి.
పర్యవేక్షణ నిమిత్తం ప్రత్యేక బృందాలు…
తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార, చేనేతశాఖల మంత్రి మిర్చి కొనుగోళ్లలో అవకతవకలు చోటు చేసుకోకుండా పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నాం. ధరల్లో వ్యత్యాసం రాకుండాచూస్తున్నాం.అదనపు సిబ్బందిని కూడా నియమించాలని ఆదేశాలిచ్చాం. పంట సీజన్‌లో అదనపు ఉద్యోగులను నియమించి దళారులు, లైసెన్స్‌లు లేనివారు మార్కెట్లోకి రాకుండా చూడాలని చెప్పాం. రైతులతో పాటు మార్కెట్‌ ఆదాయానికి కూడా గండిపడకుండా చర్యలు చేపట్టాం.

Spread the love