బీబీసీపై కేంద్రం ప్రతీకారం తగదు ఐటీ దాడులకు జర్నలిస్టు సంఘాల ఖండన

నవతెలంగాణ – హైదరాబాద్‌
గుజరాత్‌లోని గోధ్రా అల్లర్లపై బీబీసీ ప్రసారం చేసిన సంచలనాత్మక డాక్యుమెంటరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడటాన్ని పలు జర్నలిస్టు సంఘాలు ఖండించాయి. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం. సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య , ఐఎఫ్‌డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి పి.ఆనందం, ఎన్‌ఏజే నేషనల్‌ సెక్రెటరీ జనరల్‌ ఎన్‌.కొండయ్య, టీబీజేఏ రాష్ట్ర అధ్యక్షులు పి. రాధిక, ప్రధానకార్యదర్శి వి.జ్యోతిబసు, హెచ్‌యూజే అధ్యక్ష, కార్యదర్శులు బి. అరుణ్‌కుమార్‌, బి. జగదీశ్‌ బుధవారం సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలో మీడియా స్వేచ్ఛను కేంద్ర ప్రభుత్వం ప్రశ్నార్థకం చేస్తున్నదన్నారు. ఐటీ దాడుల పేరుతో ప్రతికార దాడులు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. గత మూడు రోజుల్లో న్యూఢిల్లీ, ముంబయి బీబీసీ కార్యాలయాల్లో నిరంతరాయంగా ఐటీ దాడులు చేయడం ఎంతమాత్రం సమంజసం కాదని అన్నారు. ప్రజల తరపున మీడియా పనిచేయకూడదా ? అని ప్రశ్నించారు. మీడియా అంటేనే ప్రజలు, ప్రభుత్వాల మధ్య వారధిగా ఉండేదని గుర్తు చేశారు. పాత్రికేయుల ఫోన్లను ట్యాప్‌చేయడం, ల్యాప్‌ట్యాప్‌లను బలవంతంగా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు. ఐటీ దాడులు చేస్తూ, సర్వే అని బుకాయించడాన్ని ఖండించారు. ప్రధాని మోడీ గుజరాత్‌ అల్లర్లపై తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకోవాలని కోరారు. దాడుల ద్వారా మీడియా సంస్థలను భయపెట్టాలని చూడటం, స్వేచ్ఛకు సంకెళ్లు వేసే ప్రయత్నం చేయడం చెల్లదని చెప్పారు. ప్రభుత్వ ఏజెన్సీలను కీలుబొమ్మలుగా మార్చేసి మోడీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేయడం సరికాదన్నారు. బీబీసీ డాక్యుమెంటరీపై అభ్యంతరాలు ఉంటే, నేషనల్‌ ప్రెస్‌కౌన్సిల్‌ ద్వారా విచారణ చేసుకోవచ్చని సూచించారు. వెంటనే బీబీసీపై ఐటీ దాడులను ఆపాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Spread the love