భగీరథా.. ఎన్నాండ్లీ వ్యధా..?

– ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మొదలైన తాగునీటి ఎద్దడి
– ఏజెన్సీ గ్రామాల్లో పనిచేయని మిషన్‌ భగీరథ పథకం
– వృధాగా ట్యాంకులు.. అలంకారంగా నల్లాలు
– తాగునీటికి అల్లాడుతున్న ఆదివాసీ గిరిజనులు
–  కన్నెత్తి చూడని అధికారులు.. పట్టించుకోని ప్రజాప్రతినిధులు
నవతెలంగాణ ఆదిలాబాద్‌:
ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలం పీచర గ్రామంలో ఏర్పాటుచేసిన మిషన్‌ భగీరథ నీటి నిల్వ చేసే సంపు ఇది. అనేక రోజులుగా ఇది పనిచేయకపోవడంతో ఈ ఊరికి భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. గ్రామంలో ఉన్న చేతిపంపులు కూడా మరమ్మతులకు గురికావడంతో గ్రామస్తులు తాగునీటికి అల్లాడుతున్నారు. ఊరి చివర ఉన్న ఓ చేతిపంపు నామమాత్రంగా పనిచేస్తుండటంతో ఊరంతా అక్కడికి వెళ్లి రోజువారీ నీటి అవసరాలను తీర్చుకుంటున్నారు. ఇక మూగజీవాల పరిస్థితి దయనీయంగా మారింది. నేరడిగొండ మండలం లక్ష్మీపూర్‌ గ్రామంలో నీటి గోస ఇది. గ్రామంలో రెండేండ్ల కిందట మిషన్‌ భగీరథ ట్యాంకు నిర్మించి నల్లాలు బిగించినా.. ఫలితం లేకుండా పోయింది. ప్రారంభించిన నాటి నుంచి ఈ ఊరికి భగీరథ నీరు సరఫరా కావడం లేదు. దాంతో ఊరి పొలిమేరలో ఉన్న ఓ చేతిపంపు నుంచి గ్రామస్తులు రోజూ ఇలా బిందెలతో నీటిని తీసుకువస్తూ అవస్థలు పడుతున్నారు. మరికొన్ని రోజులు అయితే ఈ చేతిపంపు నుంచి కూడా నీరు వచ్చే పరిస్థితి ఉండదని.. ఆ సమయంలో మరింత ఇబ్బందులు ఎదురవుతాయని గ్రామస్తులు చెబుతున్నారు.
లక్ష్మీపూర్‌ గ్రామంలో సుమారు 100వరకు పశుసంపద ఉంటుంది. వీటికి తాగునీటిని అందించేందుకు గ్రామస్తులు ఊరి చివరన ఓ తొట్టె నిర్మించి స్థానికంగా ఉన్న చేతి పంపు ద్వారా నీటిని ఇందులో నింపుతున్నారు. దాంతో ఆ గ్రామానికి చెందిన పశువులు ఇలా దాహం తీర్చుకుంటున్నాయి.
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో తాగునీటి తండ్లాట మొదలైంది. కొండలు, గుట్టలు ఎక్కి ఊరికి చేరిన మిషన్‌ భగీరథ పథకం పనిచేయడం లేదు. గిరి గ్రామాల్లో ఎక్కడ చూసినా భగీరథ ట్యాంకులు అందంగా కనిపిస్తున్నా.. వాటి ద్వారా నీటి సరఫరా మాత్రం జరగడం లేదు. ఈ పథకం పనిచేయకపోవడం.. అక్కడ ఉన్న చేతిపంపులు మూలకుపడిపోవడంతో ఆదివాసీ గిరిజనులు తాగునీటికి తండ్లాడుతున్నారు. ఊరికి దూరంగా.. చాలా భారంగా పనిచేస్తున్న చేతిపంపుల వద్ద గంటల తరబడి నిరీక్షించి తాగునీటి అవసరాలను తీర్చుకుంటున్నారు. భగీరథ పథకం దరిచేరకపోవడం..ఉన్న నీటి వనరులు పనిచేయకపోవడంతో గిరిజన గ్రామాలు తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. ఏటా ఈ సమస్య ఉత్పన్నమవుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టిసారించడం లేదనే విమర్శలున్నాయి. ఉమ్మడి జిల్లాలోని ఆయా పల్లెల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.కోట్లాది నిధులు వెచ్చించి మిషన్‌ భగీరథ ట్యాంకులు, నీటి నిల్వ సంపులు నిర్మించినా ఫలితం లేకుండా పోతోంది. అనేక గ్రామాల్లో అలంకార ప్రాయంగా మారుతున్నాయి. ఏదో ఒక కారణంతో నెలల తరబడి తాగునీటి సరఫరా నిలిచిపోతోంది. నేరడిగొండ మండలం పీచరలో భగీరథ ట్యాంకులతో పాటు ఇంటింటికి నల్లాలు బిగించినా వాటి ద్వారా నీరు సరఫరా కావడం లేదు. ఇదే పంచాయతీ పరిధిలోని లక్ష్మీపూర్‌ గ్రామంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గ్రామంలోనైతే ఈ పథకం ప్రారంభించి రెండేండ్లు గడిచినా ఒక్కరోజు కూడా నల్లాల ద్వారా నీళ్లిచ్చిన దాఖలాలు లేవని గ్రామస్తులు చెబుతున్నారు. ఇలా అనేక ఆదివాసీ గిరిజన గ్రామాల్లో తాగునీటి దుస్థితి నెలకొంది. మరోపక్క గ్రామాల్లో ఇది వరకే వేసిన చేతిపంపులు కూడా మరమ్మతులు గురికావడం.. ఉన్న వాటి నుంచి నీళ్లు సక్రమంగా రాకపోవడంతో మనుషులతో పాటు గ్రామాల్లోని పశువులు నీటి కోసం తిప్పలు పడుతున్నాయి. ఏజెన్సీలోని అనేక గిరి గ్రామాల్లో ఎక్కడ చూసినా భగీరథ ట్యాంకులు..నీటిని నిల్వ చేసే సంపులు.. గ్రామాల్లో ఇంటి ముందర నల్లాలు కనిపిస్తున్నా వాటి ద్వారా నీరు సరఫరా కావడం గగనంగా మారిందని ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు.
కన్నెత్తి చూడని అధికారులు..!
జిల్లాలోని అన్ని గ్రామాల్లో భగీరథ ట్యాంకులు నిర్మించి నల్లాలు బిగించడంతో అధికారులు భరోసాతో ఉన్నారు. అన్ని గ్రామాల్లో నీటి సరఫరా జరుగుతోందని.. ఎక్కడా నీటి సమస్య లేదని సభలు, సమావేశాల్లో చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అనేక గ్రామాల్లో నీటి సరఫరా కాకపోవడంతో గిరిజనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ అధికారులు మాత్రం అటువైపు మాత్రం కన్నెత్తి చూడటం లేదు. ఆయా గ్రామాల ప్రజలు మండల స్థాయి అధికారులకు సమస్య విన్నవించినా వారు పట్టించుకోకపోవడంతో గత్యంతరం లేక చేతిపంపులు, స్థానికంగా ఉండే బావుల వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు సైతం ఆయా గ్రామాలకు వెళ్లకపోవడంతో సమస్య తెలియడం లేదు. ఎన్నికల సమయంలో తప్పితే.. మిగితా రోజుల్లో ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు అటువైపు కన్నెత్తిచూడరనే విమర్శలు ఆయా గ్రామస్తుల నుంచి వినిపిస్తున్నాయి. ముఖ్యంగా భగీరథ పథకం ప్రారంభమైనప్పటి నుంచి గ్రామాల్లో చేతిపంపుల మరమ్మతులను పట్టించుకోవడం లేదు. గతంలో ఆర్‌డబ్ల్యూఎస్‌, ఐటీడీఏ ద్వారా తాగునీటి అవసరాలకు నిధులు కేటాయించే ఈ శాఖలు కొన్నేండ్ల నుంచి వీటిని పూర్తిగా నిలుపుదల చేశాయి. దీంతో చాలా గ్రామాల్లో చేతిపంపులు పనిచేయకుండా మూలకుపడిపోయాయి.
చేతిపంపు నీటినే తాగుతున్నాం : బైరి సోమేష్‌, పీచర, నేరడిగొండ మండలం
గ్రామంలో నిర్మించిన మిషన్‌ భగీరథ పథకం ప్రారంభమైన నాటి నుంచి నీళ్లు రావడం లేదు. ట్యాంకు, నీటి నిల్వ కోసం సంపు, ఇంటింటికి నల్లాలు బిగించినా ఉపయోగం లేకుండా పోతోంది. దాంతో గ్రామానికి చెందిన ఓ రైతు తన చేనులోని బోరు ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. మిగితా అవసరాల కోసం ఊరి చివరనున్న చేతిపంపు నుంచి తెచ్చుకుంటున్నాం. అధికారులు దృష్టిసారించి నీటి సరఫరా చేయాలి.
ఇప్పటి వరకు నీటి సరఫరా లేదు: ఆడెం భీంరావు, గ్రామ పటేల్‌, లక్ష్మీపూర్‌
మా ఊరిలో మిషన్‌ భగీరథ ట్యాంకు నిర్మించి రెండేండ్లు గడిచింది. ఇంటింటికి నల్లాలు కూడా బిగించారు. కానీ ఇప్పటి వరకు నీటి సరఫరా మాత్రం జరగడం లేదు. మూడు కాలాల పాటు గ్రామ చివరలో ఉన్న చేతిపంపు నుంచి నీటిని తెచ్చుకుంటూ దాహం తీర్చుకుంటున్నాం. ప్రతి వేసవిలో తాగునీటికి గ్రామస్తులే కాకుండా పశువులు కూడా ఇబ్బందులు పడుతుంటాయి.

Spread the love