రక్తం తీయకుండా మధుమేహ పరీక్ష

‘రక్తం తీయకుండా మధుమేహ పరీక్ష…” చదివింది బీటెక్‌ కానీ, మధ్యతరగతి వారికి ఆసరాగా ఉంటుంది తన వైద్య పరికరం. ఆశ్చర్యంగా ఉంది కదా… అవునండి! ఇది నిజమే పైన హామీ ఇచ్చింది ఎవరో కాదు చీపు ప్రత్యూష. అసలు ఆమె కథ ఏంటో ఇప్పుడు చూద్దాం…
చీపు ప్రత్యూష ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జన్మించింది. తండ్రి చీపు నరసింహారావు, తల్లి చీపు మానస. ప్రత్యూషకి చిన్ననాటి నుండి మహిళా పారిశ్రామికవేత్తగా ఎదగాలని ఎంతో ఆశ. తన కల నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉండగా, తన తండ్రి డయాబెటిక్‌తో బాధపడటం చూస్తూ పెరిగిన ప్రత్యూషకి వచ్చిన ఆలోచన… రాబోయే కాలంలో మధ్యతరగతికి, దిగువ తరగతికి వారికి ఒక అద్భుతమైన కానుకనే చెప్పొచ్చు. వెంటనే తన ఆలోచనల ఆచరణలోకి తీసుకురావాలని ఓ సమూహం సిద్ధం చేసుకుంది.
తండ్రి బాధను చూసి
ప్రత్యూష ప్రస్తుతం హైదరాబాద్‌లోని నారాయణమ్మ కాలేజీలో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో నాలుగో సంవత్సరం చదువుతుంది. ఒకసారి వాళ్ళ నాన్న షుగర్‌ టెస్ట్‌ చేసుకుంటుండగా చూసింది. షుగర్‌ పరీక్ష రక్తంతో కాకుండా ఇంకొక రకంగా ఎందుకు చేసు కోకూడదన్న ఆలోచన ఆమెకి వచ్చింది. ఆ ఆలోచనే నేడు ఆవిష్కరణ రూపంలో మన ముందుకు రానుంది.
లోపాల్ని సరిచేస్తూ…
సాధారణంగా మధుమేహ సమస్యతో బాధపడేవారు మధుమేహ పరీక్ష గ్లూకోమీటర్‌ ద్వారా రక్తంతో చేసుకుంటారు. అలా చేసుకోవటం వల్ల చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే రక్తహీనత, చర్మంలో మార్పులు కూడా సంభవించవచ్చు. కొన్ని రకాల గ్లూకోమీటర్లు ఖరీదు కూడా ఎక్కువ ఉంటాయి. ఈ లోపాల్ని సరిచేస్తూ గ్లూకోమీటర్‌ ద్వారా ఎటువంటి కష్టం కలగకుండా మన ప్రత్యూష వాళ్ళ సమూహంతో కలిసి ”గ్లూకోసాప్‌”ని అందుబాటులోకి తేనున్నారు.
గ్లూకోసాప్‌ అంటే
ఈ గ్లూకోసాప్‌ ద్వారా మనం మధుమేహ పరీక్ష చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి రక్తం ఇవ్వాల్సిన పనిలేదు. అంతే కాదండి ఇది ప్రతి దిగువ తరగతి మధ్య తరగతి వాళ్ళు కొనగలిగే ఖరీదుకు అమ్మబడుతుంది. అలాగే చర్మ సమస్యలే కాదు, ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు. దీన్ని ప్రత్యూష తన సమూహంలో ఉన్న బండి విద్యశ్రీ, అమీనా జుహీతో కలిసి ఆవిష్కరణకు ఆద్యం పోశారు. చక్కగా మన ఇంట్లోనే ఉండి ఈ గ్లూకోసాప్‌ ద్వారా మధుమేహ పరీక్ష చేసుకోవచ్చు. మధుమేహ పరీక్ష చేసుకున్న కొన్ని నిమిషాల్లోనే రిజల్ట్‌ కూడా వచ్చేస్తుంది. చదువురాని వారికి కూడా దీన్ని ఎంతో సులభంగా వాడుకోవచ్చు. ఇది దీని మరో ప్రత్యేకం. ఇంత గొప్ప ప్రయోగం ప్రారంభించిన ప్రత్యూష మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుద్దాం.
– ఆనం ఆశ్రితరెడ్డి (గంగ),
9502709070

Spread the love