13న ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్‌ డే

– సమస్యలు తక్షణం పరిష్కరించాలి : టీఎస్‌ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర కమిటీ డిమాండ్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ కార్మికుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని కోరుతూ ఈనెల 13వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోలు, యూనిట్లలో డిమాండ్స్‌ డే నిర్వహించాలని టీఎస్‌ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్ల్యూఎఫ్‌) రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. కార్మికులపై వేధింపులు నిలుపుదల చేయాలనీ, పనిభారాలు తగ్గించాలనీ, రెండు వేతన సవరణలు అమలు చేయాలనీ, 2021లో విడుదల చేసిన ఉద్యోగ భద్రత సర్క్యులర్‌ను సవరించాలనీ, గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ 13వ తేదీ ఉదయం డ్యూటీ నుంచే కార్మికులకు డిమాండ్‌ బ్యాడ్జీలు పెట్టాలేని నిర్ణయించారు. ఆదివారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఫెడరేషన్‌ రాష్ట్ర కమిటీ సమావేశం కే గంగాధర్‌ అధ్యక్షతన జరిగింది. దీనిలో ఆర్టీసీ కార్మికుల స్థితిగతులపై సుదీర్ఘంగా చర్చించారు. ఆర్టీసీలో ప్రస్తుతం కార్మికుల పరిస్థితులపై ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి వీఎస్‌ రావు నివేదిక ప్రవేశపెట్టారు. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో బస్‌పాసుల రీయింబర్స్‌మెంట్‌ రూ.850 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.295 కోట్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు. బడ్జెట్‌లో ఆర్టీసీకి రూ.1,500 కోట్లు కేటాయించి, రూ.763 కోట్లు మాత్రమే ఇచ్చారని వివరించారు. కార్మికులపై పనిభారాలు పెరిగాయనీ, అత్యవసరమైనా సెలవులు ఇవ్వట్లేదనీ, ఈపీకే, కేఎంపీఎల్‌ పేరుతో వేధింపులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రావెల్‌ యాజ్‌ యూ లైక్‌ (టీఏవైఎల్‌) టిక్కెట్లు తక్కువ అమ్మారంటూ మేడ్చల్‌, మియాపూర్‌ డిపోల్లో కండక్టర్ల ఫోటోలతో ్ట ఫ్లెక్సీలు కట్టి అవమానించారని తెలిపారు. ఒక్క ఆర్ధిక సమస్యా పరిష్కారం కాలేదనీ, 2017, 2021 సంవత్సరాల వేతన సవరణలు ఇప్పటికీ జరగలేదన్నారు. ఆర్టీసీ యాజమాన్యం సీసీఎస్‌, పీఎఫ్‌ సంస్థలకు రూ.1,800 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందనీ, ఫలితంగా కార్మికులు తీవ్ర నిరాశ నిస్రృహలకు గురవుతున్నారని చెప్పారు. ఉద్యోగ భద్రత లేదనీ, 2021 నాటి సర్క్యులర్‌ను సవరించాలని ఎన్నిసార్లు కోరినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని విమర్శించారు. యూనియన్లకు అతీతంగా డిమాండ్స్‌ డేలో కార్మికులు పెద్దసంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పీఎఫ్‌ హయ్యర్‌ పెన్షన్‌పై కార్మికులకు అవగాహన కల్పించేందుకు ఖమ్మం, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌లో సదస్సులు నిర్వహించినట్టు ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పీ రవీందర్‌రెడ్డి తెలిపారు. సమావేశంలో ఫెడరేషన్‌ రాష్ట్ర నాయకులు సుధాకర్‌(ఖమ్మం), ప్రభాకర్‌ (మహబూబ్‌నగర్‌) నర్సింహా (నల్లగొండ), రాజయ్య (కరీంనగర్‌), పి చంద్రప్రకాశ్‌, బిక్షపతిగౌడ్‌ (హైదరాబాద్‌) తదితరులు పాల్గొన్నారు. మహిళా కార్మికుల సమస్యలను కన్వీనర్‌ పద్మావతి వివరించారు.

Spread the love