ఇండోనేషియా తీరంలో బోటు మునక.. 15 మంది మృతి

నవతెలంగాణ – ఇండోనేషియా
ఇండోనేషియాలోని సులవేసి దీవి తీరంలో ప్రయాణికులతో వెళ్తున్న బోటు మునిగిపోయింది. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 33 మందిని రెస్క్యూ టీమ్స్‌ రక్షించాయి. ఇంకో 19 మంది గల్లంతయ్యారు. సామర్థ్యానికి మించి జనం ఎక్కడమే బోటు మునకకు కారణమని అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. రెస్క్యూ చేసిన 33 మందిలో ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సులవేసి దీవి నుంచి బయలుదేరిన తర్వాత కేవలం 1 కిలో మీటర్‌ ప్రయాణం అనంతరం పడవ ప్రమాదానికి గురైందని అధికారులు చెప్పారు. కేవలం 20 నిమిషాల ప్రయాణం మాత్రమే సాగిందన్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కాగా, ఇండోనేషియా మొత్తం దీవుల సముదాయం. ఆ దేశంలో చిన్నాచితకా కలిపి దాదాపు 17 వేల దీవులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీవుల మధ్య ప్రయాణానికి పడవలో ప్రధాన రవాణా సదుపాయంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకుని కొందరు అత్యాశతో సామర్థ్యానికి మించి జనాలను ఎక్కించుకుంటున్నారు. దాంతో ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి.

Spread the love