317 జీవోపై మంత్రివర్గ ఉపసంఘం

 317 Cabinet Sub-Committee on Geo– చైర్మెన్‌గా దామోదర రాజనర్సింహ సభ్యులుగా శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌
– ఉత్తర్వులు విడుదల
– ఉపాధ్యాయ సంఘాల హర్షం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో 317, 46 జీవోలను అధ్యయనం చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం నియమించింది. చైర్మెన్‌గా మంత్రి దామోదర రాజనర్సింహ, సభ్యులుగా మంత్రులు డి శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ ఉన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం ఉత్తర్వులు విడుదల చేశారు. సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఈ కమిటీకి కన్వీనర్‌గా ఉంటారని ప్రకటించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల విభజన కోసం 2021, డిసెంబర్‌ ఆరున గత ప్రభుత్వం జీవోనెంబర్‌ 317ను విడుదల చేసిన విషయం తెలిసిందే. 2022, ఏప్రిల్‌ నాలుగున జీవో నెంబర్‌ 46ను జారీ చేసింది. ఈ రెండు జీవోలను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. అందుకు సంబంధించిన సమస్యలను అధ్యయనం చేసి సిఫారసులను నివేదిక రూపంలో సమర్పించాలని కోరింది. మంత్రివర్గ ఉపసంఘం నిర్వహించే సమావేశాలకు సంబంధిత శాఖకు చెందిన స్పెషల్‌ సీఎస్‌లు/ ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు హాజరుకావాలని ఆదేశించారు. రాష్ట్రపతి ఉత్తర్వులు-2018 అమల్లో భాగంగా స్థానికతను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం సీనియార్టీ ప్రాతిపదికన ఉద్యోగులు, ఉపాధ్యాయుల విభజన కోసం గత ప్రభుత్వం 317 జీవోను తెచ్చింది. అందుకనుగుణంగా కొత్త జిల్లాల వారీగా ఉద్యోగులను విభజించింది. దీంతో స్థానికతను వదిలి ఇతర జిల్లాలకు వారు శాశ్వతంగా కేటాయించడ్డారు. సొంత జిల్లాను వదిలి వెళ్లడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. భర్త ఒక జిల్లా, భార్య ఇంకో జిల్లాకు కేటాయించబడ్డారు. భార్యభర్తలను కలపాలనీ, స్థానికత ఆధారంగా కేటాయించాలంటూ అనేక ఉద్యమాలను ఉపాధ్యాయులు నిర్వహించారు. అయినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. భార్యాభర్తలను ఒకే జిల్లాకు తీసుకొస్తామని హామీ ఇచ్చినా పూర్తిగా అమలు చేయలేదు. 19 జిల్లాల్లో స్పౌజ్‌ బదిలీలు చేపట్టి 13 జిల్లాల్లో నిషేధం విధించడం గమనార్హం. అధికారంలోకి వస్తే 317 జీవో ద్వారా ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరిస్తామంటూ కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో ప్రకటించింది. ఆ పార్టీ అధికారంలోకి రావడంతో 317 జీవో బాధితులకు న్యాయం చేయాలంటూ ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తెచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి పలుమార్లు వినతిపత్రాలను సమర్పించాయి. దీంతో ఆ జీవో వల్ల వచ్చిన సమస్యలు, ఉద్యోగుల విభజన వల్ల ఏర్పడిన ఇబ్బందులనుఅధ్యయనం చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం నియమించింది. దీనిపై పలు ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
టీఎస్‌యూటీఎఫ్‌ హర్షం
317 జీవో సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం పట్ల టీఎస్‌యూటీఎఫ్‌ హర్షం ప్రకటించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వులు-2018 అమల్లో భాగంగా ఉద్యోగుల శాశ్వత కేటాయింపుల కోసం గత ప్రభుత్వం ఏకపక్షంగా 317 జీవోను తేవడం వల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. క్యాడర్‌లో జూనియర్‌ అయినందుకే సొంత జిల్లాను వదిలి పరాయి జిల్లాకు కేటాయించబడ్డారని పేర్కొన్నారు. భార్యాభర్తలను వేర్వేరు జిల్లాలకు కేటాయించారని వివరించారు. గత సర్వీసును వదులుకుని అంతర్‌జిల్లా బదిలీ ద్వారా వచ్చిన భార్యాభర్తలను కూడా తిరిగి వేరు చేశారని తెలిపారు. నిబంధనల ప్రకారం ఒకే జిల్లాకు బదిలీ చేయాల్సి ఉండగా 19 జిల్లాల్లో అనుమతించి 13 జిల్లాలను బ్లాక్‌ చేశారని పేర్కొన్నారు. స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులకు, విడిపోయిన భార్యాభర్తలకు న్యాయం చేయాలంటూ రెండేండ్లుగా టీఎస్‌యూటీఎఫ్‌, యూఎస్‌పీసీ, ఆయా ఫోరమ్‌లు నిర్వహించిన ప్రాతినిధ్యాలను గత ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని విమర్శించారు. పోరాటాలను నిరంకుశంగా అణచివేసిందని తెలిపారు. అధికారంలోకి వస్తే 317 జీవో ద్వారా ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరిస్తామంటూ కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో ప్రకటించిందని గుర్తు చేశారు. అందుకనుగుణంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం ఒక ముందడుగని పేర్కొన్నారు. సమస్యలను అధ్యయనం చేసి సత్వరమే సానుకూల పరిష్కారాలను ప్రభుత్వానికి సిఫారసు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఉపాధ్యాయ సంఘాల హర్షణీయం
317 జీవో అధ్యయనం కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించడం పట్ల పీఆర్టీయూటీఎస్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు, పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం చెన్నయ్య, ఎస్‌ బిక్షంగౌడ్‌, ఆర్థిక కార్యదర్శి పులి దేవేందర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రపతి ఉత్తర్వులు-2018ని రద్దు చేయాలనీ, ఇందిరాగాంధీ హయాంలో రాష్ట్రపతి ఉత్తర్వులు-1975ని తిరిగి పునరుద్ధరించాలని లోకల్‌ క్యాడర్‌ గవర్నరమెంట్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఎం వీరాచారి తెలిపారు. 317 జీవోను అధ్యయనం చేయడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించడం పట్ల గురుకుల జేఏసీ అధ్యక్షులు మామిడి నారాయణ, ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Spread the love